home
Shri Datta Swami

 17 Apr 2025

 

శంకరులు


Part-1   Part-2


Part-1

[06-02-2003] శంకరులు మూసిన తలుపుల గుండా లోపలికి వచ్చుట చేత ఆయనను పరబ్రహ్మమని నిర్ణయించలేము. ఏలననగా శాంబరీమాయలను తెలిసిన రాక్షసులు సైతము అట్లు ప్రవేశించగలరు. కావున అష్టసిద్ధులను బట్టి పరమాత్మను నిర్ణయించలేము. అయితే అష్టసిద్ధులను ప్రదర్శించుట చేత అవి చేతకాని మానవుల నుండి స్వామిని వేరుపరచవచ్చును. ఉదాహరణకు, ఒక క్లాసులో కొందరు విద్యార్థులు ఉన్నారు. అందులో కొందరికి పది ఎక్కములు మాత్రమే వచ్చును. వారికి పదకొండవ ఎక్కమురాదు. మరి కొద్దిమందికి 19 ఎక్కములు మాత్రమే వచ్చును. వారికి 20వ ఎక్కమురాదు. ఒక విద్యార్థికి 20 ఎక్కములు వచ్చును. ఆ విద్యార్థి క్లాసులో ఉన్న విద్యార్థులనందరిని ఓడించి అత్యుత్తమునిగా తన్ను తాను నిరూపించుకొనవలెను. 10 ఎక్కములు మాత్రమే వచ్చు విద్యార్థుల ముందు 11వ ఎక్కమును (multiplication tables) చదివి వారికి ఆ ఎక్కమురాదని వారిని ఓడించినాడు. వారిని ఓడించుటకు 19వ ఎక్కము చదువనక్కరలేదు. ఆ తరువాత 19వ ఎక్కములు వచ్చిన విద్యార్థుల ముందు 20వ ఎక్కమును చదివి వారికి ఆ ఎక్కమురాదని వారిని ఓడించినాడు. వారి ముందు 11వ ఎక్కమును చదువరాదు. ఏలననగా వారును 11వ ఎక్కము చదువగలరు. కావున వారిని 11వ ఎక్కములో ఓడించుట కుదరదు.

Swami

ఇదే విధముగా సిద్ధులు చేతగాని సామాన్యులైన మానవులకు సిద్ధులను చూపిన చాలును. వారు పరమాత్మను గుర్తించి విశ్వసించి పరమాత్మకు సేవకులుగా మారుదురు. కావున పాండిత్యజ్ఞానము కలిగిన పండితుల ముందు జ్ఞానమును ఎంత ప్రదర్శించినను వారు పరమాత్మను గుర్తించుట చాలా కష్టము. కావుననే శంకరులు మంచి పండితులైన తన శిష్యుల ముందు జ్ఞానమును ప్రదర్శించి బోధ చేయలేదు. ఎంత బోధ చేసినను వారికి ఎక్కుట కష్టము. ధనవంతుని ధనము చూపి ఆకర్షించలేము. అట్లే పండితులగు జ్ఞానులు తత్త్వజ్ఞానములేని వారైనను తత్త్వజ్ఞానమును చూచి అంతగా ఆకర్షింపబడరు. తొంభై రూపాయలు ఉన్నవాడు 100 రూపాయలు ఉన్నవానిని చూచి ఆకర్షించబడడు. 90 రూపాయలు ఉన్నవాడు 100 రూపాయలు ఉన్నవాని చేతిలో ఉన్న కర్రను చూచి భయపడును. ఏలననగా వాని చేతిలో కర్ర లేదు. ఆ కర్రను చూచి దాసోఽహం అనును. కావున పండితులైన తన శిష్యులకు శంకరులు ఎన్నిసార్లు తత్త్వజ్ఞానము బోధించినను వారు శంకరులకు దాసోఽహం అనలేదు. ఆయన శిష్యులకు చెప్పిన తత్త్వజ్ఞానము ఏమి అనగా శ్రుతులలో బ్రహ్మమును పురుషుడు అను శబ్దముచేత పిలుచుట జరిగినది. పురమునందు అనగా దేహమునందు వ్యాపించి ఉన్న చైతన్యమే పురుషుడు అని పురుష శబ్దము యొక్క అర్థము. కావున పురుషుడు అనగా జీవుడు. అయితే బ్రహ్మము పురుషుడైనప్పుడు అనగా జీవుడైనప్పుడు ఆ జీవుడు జీవులందరిలోనూ అత్యుత్తముడై యుండును. కావున పురుషోత్తముడు అనబడుచున్నాడు. కావున ఇచ్చట పరమాత్మ యొక్క లక్షణములు రెండున్నవి:

i) జీవుడగుట

ii) జీవులలో అత్యుత్తముడగుట.

ఉదాహరణకు ఇరవై ఎక్కములు వచ్చిన విద్యార్థి పేరే రాముడు అని అన్నాము. క్లాసులో రాముడిని గుర్తించుటకు రెండు లక్షణములున్నవి. మొదటి లక్షణము: ఆ క్లాసులో ఉన్న విద్యార్థి అను లక్షణము. ఈ లక్షణము చేత క్లాసులో ఉన్న విద్యార్ధులలోనే రాముడున్నాడు. రోడ్డున పోవు మనుష్యులలో రాముడు లేడు. కావున విద్యార్థి అను లక్షణము చేత రాముని గుర్తించుటకు బయట వెతకనక్కరలేదు. ఆ క్లాసులోనికి పోయినచో మనకు రాముడు లభించును. కావున ఈ మొదటి లక్షణము చేత రాముని గుర్తించు ప్రయాస చాల వరకు తగ్గినది. అయితే ఈ మొదటి లక్షణము చేత రాముడిని పూర్తిగా గుర్తించుటకు వీలు లేదు. ఏలననగా క్లాసులో అరవైమంది విద్యార్థులున్నారు. వీరిలో ఒక్కడే రాముడు. ఆ ఒక్కని గుర్తించుటకు రెండవ లక్షణము అవసరము. రెండవ లక్షణము: ఇరవై ఎక్కములు వచ్చిన విద్యార్థియే రాముడు. అప్పుడు ఎక్కముల పరీక్ష పెట్టవలెను. దానిలో అందరినీ ఓడించి తనకు మాత్రమే 20 ఎక్కములు వచ్చునని పైన చెప్పిన విధముగా నిరూపించుకున్న విద్యార్థిని రాముడని గుర్తించవలెను.

ఐతే ఈ విధముగా ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అను మహావాక్యము చేత పరమాత్మ సృష్టిలోని ఏ జడపదార్థమూ కాదని తెలుసుకొనవలయును. అయితే చైతన్యము గల జీవులు అనేక వర్ణములుగ ఉన్నవి. కావున జీవుడు బ్రహ్మము అని చెప్పినంత మాత్రమున క్రిమి, కీటక, పశు, పక్షి, నరాది జీవుల వర్గములలో పరమాత్మ ఏ వర్గములో ఉన్నాడని అనుమానము వచ్చును. క్రిమి, కీటకాదులన్నియును జీవులే. అవి పాపజన్మలు. పరమాత్మ పాపజన్మల వర్గములో ఉండడు. ఈ సృష్టిలో అత్యుత్తమమైన జన్మ నరజన్మయేనని నిశ్చయముగా నిరూపించవచ్చును. నరజన్మల కన్నను దేవతలు ఇంకనూ పవిత్రులైనవారు. అట్లే పశు, పక్షి, నరాది జన్మలకన్నను అతినీచమైన పాపిష్టిజన్మలు రాక్షసులు. అయితే ఈ సృష్టిలో దేవతలు, రాక్షసులు ఎక్కడను కనబడుటలేదు. కావున, మానవులలోనే దేవతలు, రాక్షసులు ఉన్నారు. కావున మానవులను మరల మూడు అవాంతర వర్ణములుగా విభజించవచ్చును. మొదటి వారు కేవల పుణ్యకర్మ స్వరూపులైన సత్త్వగుణులగు మానవులు. వీరే అతిపవిత్రులై దేవతలనబడుచున్నారు. ఇక రెండవవారు పాప, పుణ్య మిశ్రమములై రజోగుణులైన నరులు. వీరే మానవులు అని పిలువబడుచున్నారు. ఇక మూడవవారు కేవలము పాపస్వరూపులై తమోగుణులైన రాక్షసులు అనబడు మానవులు.

 

Part-2

అత్యుత్తమమైన నరస్వరూపమున పరమాత్మ అవతరించినప్పుడు ఆయన తప్పక సత్త్వగుణస్వరూపుడై ఉండును. కావున ‘ప్రకృతిం స్వామ్ అధిష్ఠాయ’ అను గీతాశ్లోకమున నేను నా ప్రకృతిని ఆశ్రయించి అవతరింతును అన్నప్పుడు ఆ ప్రకృతి సత్త్వగుణ ప్రకృతి అని అర్థముగా ఆచార్యులు వ్రాసినారు. కావున ఇట్టి సాత్త్వికులైన వారిలో పరమాత్మ ఉండును. ఇట్టి సాత్త్వికులే విద్యార్థులున్న క్లాసు అయితే ఆ సాత్త్వికులలో కూడ అత్యుత్తమ నరస్వరూపమే పరమాత్మ. అత్యుత్తమ సాత్త్వికుడనగా ఆ సాత్త్వికునిలో ఎప్పడును రజోగుణము గాని తమోగుణము కాని ప్రవేశించదు. ఏలననగా సాత్త్వికులైన జీవులు కూడా ఒక్కొక్క క్షణమున అహంకార, మాత్సర్యములగు రజోగుణ, తమోగుణములను పొందుచున్నారు. కావుననే దేవతలలో సైతము అహంకార, మాత్సర్యాదులు ప్రవేశించుచున్నవి అని చెప్పబడుచున్నది. కావున ఏ సాత్త్విక మానవునిలో రజోగుణము, తమోగుణము ఒక్క క్షణము కూడా ప్రవేశించదో అట్టి మానవుడే పరమాత్మ స్వరూపుడని నిశ్చయముగా తెలియవచ్చును. సత్త్వగుణము యొక్క లక్షణములు గీతలో చెప్పబడినవి. ‘యద్యత్ విభూతి మత్సత్త్వమ్’ అనగా అష్టసిద్ధులను కలిగియున్న సాత్త్విక స్వరూపము పరమాత్మతత్త్వమని అర్థము. దీని చేత అష్టసిద్ధులున్నను క్షుద్ర మాంత్రికులగు రజోగుణులగు మానవులు, తమోగుణులగు రాక్షసులును పరమాత్మకాదని అర్థము.

సత్వాత్ సంజాయతే జ్ఞానమ్’ అనియను చెప్పబడినది. అనగా సత్త్వగుణము జ్ఞానలక్షణమని అర్థము. జ్ఞాన లక్షణము చేత జ్ఞానము, ప్రేమ, వినయము, శాంతి మొదలగు మిగిలిన కళ్యాణగుణము లన్నియు చెప్పబడుచున్నవి. ఈ విధముగా పరమాత్మను అష్టసిద్ధులును, జ్ఞానానందాది సకల కళ్యాణగుణములు కలిగిన దేవతా స్వరూపుడైన నరునిగా గుర్తింపవలెను. ఇరువది ఎక్కములు వచ్చిన ఆ ఒక్క విద్యార్థియే రాముడని గుర్తించినట్లు అవతార పురుషుని గుర్తించవలెను. కావున రాముడు క్లాసులో వున్న విద్యార్థియే. అనగా పరమాత్మ జీవుడే. కాని క్లాసులో ఉన్న విద్యార్థులందరిలోను అత్యుత్తముడగు విద్యార్థి పేరే రాముడు. అట్లే పురుషులు అనబడు జీవులలో అత్యుత్తముడైన పురుషోత్తముడే పరమాత్మ. పురుషోత్తముడు పురుషుడే. కాని పురుషులందరు పురుషోత్తములు కారు. రాముడు విద్యార్థియే. కాని విద్యార్థులందరును రాముడు కాదు. ఈ విధముగా తత్త్వబోధ ఎంత చేసినను శంకరులు తానొక్కడే పరబ్రహ్మమని చెప్పుకొని మనలను మోసగించి మనచేత సేవలను చేయించుకొనుచున్నాడేమో అను అనుమానము శిష్యులలో కలిగినది. దీనికి కారణము అహంకార మాత్సర్యములే. అందుకే తప్త సీస ద్రవపానమను (drinking hot molten lead) సిద్ధి ప్రదర్శనముచేత వారి అహంకారమును పోగొట్టి బాగుపరచినాడు. కావున జ్ఞానము కల పండితులను నమ్మించుటకు జ్ఞానప్రదర్శనము సరిపోదు. వారికి సిద్ధి ప్రదర్శనము కావలయును. అట్లే జ్ఞానము లేని పామరులకును జ్ఞాన ప్రదర్శనము చేసి ఉపయోగము లేదు. ఏలననగా వారికి జ్ఞానము బోధించిననూ అర్థము కాదు. వారికిని సిద్ధి ప్రదర్శనమే కావలయును.

పరమాత్మ అవతరించి వచ్చినప్పుడు అజ్ఞానము కళ్ళగంత కట్టుకునివచ్చుట జరుగుచున్నది. అయితే ఈ ‘కళ్ళగంత’ను ఒక ప్రణాళిక ప్రకారముగా కట్టుట, విప్పుట రెండును జరుగును. ఎట్టి పరిస్థితులలో ఈ కళ్ళగంతను విప్పవలయునో, ఎట్టి పరిస్థితులలో ఈ కళ్ళగంతను తన కళ్ళకు కట్టవలయునో ఆ పరిస్థితులను పరిపూర్ణముగా కాలభైరవునకు వివరించి తాను అవతరించును. ‘కళ్ళగంత’ ను కట్టించుకుని జన్మించినవాడు కావున తాను పరిపూర్ణమైన అజ్ఞానములోనే ఉండి పాత్రరసమును స్వామి సంపూర్ణముగా వినోదించుచుండును. తన కళ్ళగంత ఎప్పుడు విప్పవలయునో స్వామికే తెలియదు. ఏలననగా, కళ్ళగంతను కట్టించుకుని వచ్చినవాడు అజ్ఞానములో ఉన్నప్పుడు ఏ సమయమున విప్పవలయునో అన్న జ్ఞానమును కలిగియుండడు. ఆ సమయము నిజముగా వచ్చినప్పుడు స్వామి చెప్పిన వివరముల బట్టి స్వామి యొక్క కళ్ళగంతను విప్పమని కాలభైరవుడు యోగమాయను ఆదేశించును. అప్పుడు స్వామి యొక్క కళ్ళగంతను యోగమాయ విప్పుచున్నది. అప్పుడు స్వామికి స్వరూపజ్ఞానము కలుగుటవలన జ్ఞానోపదేశమును చేయును. అర్జునుడు కురుక్షేత్రమున శరణాగతుడై పాదములపై పడినప్పుడు యోగమాయ స్వామి యొక్క కళ్ళగంతను విప్పినది. అయితే అట్టి పరిస్థితిలో విప్పమనుటయూ స్వామి యొక్క ఆదేశమే. కావున భగవద్గీతను ఉపదేశించినాడు. ఆ తరువాత యుద్ధము ముగిసిన తరువాత అర్జునుడు స్వామిని మరల భగవద్గీతను చెప్పమని ప్రార్థించెను. అప్పుడు స్వామికి కళ్ళగంత కట్టబడియున్నది. ఒకసారి చెప్పిన తరువాత విన్న జ్ఞానమును మరల చెప్పమని అడుగుట పార్థునిలో శ్రద్ధాలోపమును సూచించుచున్నది. శ్రద్ధాలోపము కలవారికి మరల మరల చెప్పరాదని స్వామి ఆదేశము కావున యోగమాయ కళ్ళగంతను విప్పలేదు. అప్పుడు స్వామి పార్థునితో ఇట్లు పలికినాడు. అర్జునా! అప్పుడు నేను యోగీశ్వర స్థితిలో ఉన్నాను. కావున చెప్పగలిగితిని. ఇప్పుడు ఆ స్థితిలో లేను కావున చెప్పలేను అన్నాడు. ‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్’ అన్నట్లుగా సంపూర్ణమైన శ్రద్ధ ఉన్నప్పుడే జ్ఞానము వంటబట్టును. వంటబట్టిన వానికి మరల చెప్పనక్కరలేదు. మరల చెప్పమన్నచో వానికి వంటబట్టలేదు. వంటబట్టకుండుటకు కారణము శ్రద్ధాలోపము. అందుకే స్వామి గీత యొక్క చివరిలో శ్రద్ధారహితునకు ఈ గీతను ఉపదేశించను అని చెప్పినారు.

కావున ఈ విధముగా అవసరమున్నప్పుడు స్వామికి స్వరూపజ్ఞానము కలుగుట, అవసరము లేనప్పుడు అజ్ఞానములో ఉండుటయను ఈ రెండు నారాయణ, నరతత్త్వముల మిశ్రమమే అవతారము. నారాయణుడనగా జ్ఞానము – నరుడనగా అజ్ఞానము. స్వామి అవతరించినప్పుడు అష్టసిద్ధులను కూడా మూటగట్టి కాలభైరవుని చేతిలో పెట్టి నిజమైన సత్యభక్తుడు నన్ను చేరినప్పుడు మాత్రమే, ఆ జీవునకును అవసరమైనప్పుడు మాత్రమే ఈ సిద్ధులను నాకిమ్ము అని ఆదేశించియే వచ్చును. కావున అజ్ఞానములో ఉన్న స్వామిని నిజమైన భక్తిలేని వారు భక్తిని నటించి, మోసగించిననూ ప్రయోజనము లేదు. ఏలననగా అజ్ఞానములో ఉన్న స్వామి మోసపోయి ఆ భక్తుని కొరకు అష్టసిద్ధులను ఉపయోగించుటకు ఎంత సంకల్పించినను వాటిని కాలభైరవుడు స్వామికి అందనీయడు. ఎప్పుడు సత్యమైన భక్తుడు స్వామిని చేరి వాని నిర్మల ప్రేమను నిరూపించుకొనునో, అది నటన కాక నిజమే అయినప్పుడు కాలభైరవుని ఆదేశానుసారముగా యోగమాయ కళ్ళగంతను విప్పగా స్వామి స్వరూపస్థితిని పొంది సర్వసిద్ధి సమన్వితుడగును. కావుననే ‘నాహం ప్రకాశ స్సర్వస్య యోగమాయా సమావృతః’ అన్న గీతలో యోగమాయ నాకు కళ్ళగంత కట్టినప్పుడు నన్ను ఎవ్వరును గుర్తించలేరు అన్నాడు. ఎవ్వరును అనగా తాను కూడా అనియే అర్థము. ఈ విధముగా జ్ఞాన, అజ్ఞానముల మిశ్రమములైన అవతారము అవసరమైనప్పుడు నారాయణ స్వరూపములోను, అవసరము లేనప్పుడు నరస్వరూపముతోను ఉండి క్రీడించుచుండును.

నం నం నం నం వద్దు వద్దు
నం నం నం నం వద్దు వద్దు
మస్కారమ్ము నమస్కారమ్ము
ఆ రమ్ము త్రాగి భక్తలోలుడనై
అష్టసిద్ధులను మీ కొరకే ఉపయోగించెదను
ఇది తెలిసి ముందే అవతార పూర్వమే
అష్టసిద్ధులనన్నింటిని మూటగట్టితిని
కాలభైరవుని చేత ఉంచి శాసించితిని
ఔదార్య కరుణలో కళ్యాణగుణములు
అపారములుగ నుండు నాలో ఎప్పుడు
కావున జీవులు కళ్ళగంతలో వచ్చిన
నాకు భక్తి మద్యమును త్రాగించెదరూ
ఆ మత్తులో సిద్ధుల నుపయోగించిన
వారికే పతనము చివరకూ జరుగునూ
నా ప్రియభక్తుడు కార్తవీర్యుడేమాయెను?
అయితే అతిమేధావులు ఈ జీవులూ
కాలభైరవునకే ఆ రమ్మును త్రాగించెదమని
భావించెదరూ, పరమ మూఢులూ
అట్టి కాలమున కాలభైరవుడు భీకరరవమున భయపెట్టునూ.
కళ్ళకు గంతలు లేని వాడతడు
పరమకఠోరుడు నిష్ఠా నిశ్చలుడు.
స్వామి ఆదేశమును ఎప్పుడు తిప్పడు తప్పడు
ఔదార్య కణ అణు మాత్రమును
అతడిలో ఉండవు నిర్గుణుడు అతడు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch