home
Shri Datta Swami

 12 Oct 2024

 

సంచితము-ప్రారబ్ధము-ఆగామి అనెడి కర్మలు: వాటి సరియైన అర్థము

[22. 11. 2002] కర్మ మూడు విధములుగా యున్నది. సంచితము, ప్రారబ్ధము, ఆగామి. సంచితము అనగా పేరుకున్నది అని అర్థము. సంచితమే జీవుని యొక్క స్వరూపము. కర్మ చేసిన తర్వాత ఆ కర్మకు సంబంధించిన గుణము జీవునిలోనికి చేరుచున్నది. జీవుడు అనగా గుణముల యొక్క సమూహమే. ఈ గుణములన్నియు వివిధ కర్మలనుండి పుట్టిన సంస్కార రూపములగు వాసనలే. ఈ సంస్కారములు అన్నియు ఒక చోటికి చేరి సమూహమైనపుడు ఆ సమూహమునే “జీవుడు” అందురు.

ఈ సమూహము దుష్కర్మల నుండి పుట్టిన దుర్గుణముల సమూహమైనచో అట్టి జీవుడు ఒక చెత్తకుప్ప వంటి అసురుడు. ఈ గుణములే సద్గుణములైనచో ఆ సమూహమే రత్నములరాశి వంటి “దేవతా స్వరూప”మగును. ఈ సమూహమే దుర్గుణ, సద్గుణ మిశ్రమమైనచో అట్టి జీవుడే “నరుడు” అనబడును. కావున దేవతలలో చెడు లేదు. రాక్షసులలో మంచి లేదు. మంచి చెడుల మిశ్రమమే మానవుడు.

ఈ మిశ్రమములో మంచి ఎక్కువున్నచో సజ్జనుడైన నరుడగును. చెడు ఎక్కువ ఉన్నచో దుర్జనుడైన నరుడగును. ఒక సమయమున మంచి ఎక్కువగను మరియొక సమయమున చెడు ఎక్కువ కూడా ఉండవచ్చును. కావుననే మానవుడు ఒక సమయమున సజ్జనుడుగను, మరియొక సమయమున దుర్జనుడుగను ఉండుచున్నాడు. దేవతలకు బోధించనవసరము లేదు. రాక్షసులకు బోధించినా ప్రయోజనము లేదు. మొదటిది సత్త్వగుణము రెండవది తమోగుణము. ఈ రెండింటిమధ్య యున్నది రజోగుణము. రజోగుణ స్వరూపమే నరుడు.

ఈ నరునికే ఎంతో జ్ఞానమును ఎన్నో రీతుల ఎన్నోసార్లు బోధించవలసి యున్నది. కావుననే జ్ఞానస్వరూపుడైన దత్తుడు నరులలో మాటిమాటికి అవతరించుచున్నాడు. శ్రీకృష్ణభగవానుడు సత్త్వగుణియైన ధర్మరాజుకు గాని, తమోగుణియైన భీమునికి గాని భగవద్గీతను ఉపదేశించలేదు. మధ్యలోనున్న రజోగుణరూపియగు అర్జునునకే భగవద్గీతను బోధించెను. ఈ నరుడు జ్ఞానము, అజ్ఞానముల మిశ్రమమై కొంత తెలిసి కొంత తెలియనివాడు. పూర్తిగా తెలియదు కావున అజ్ఞానము వలన అనుమానములు వచ్చుచుండును. వీనికి తెలియచెప్పుటకు ప్రయత్నించినచో తెలుసునన్న అహంకారము వచ్చుచుండుట వలన ఇట్టివానికి బోధించుట చాలా కష్టము. కావున శ్రీదత్తసద్గురువు మాటిమాటికిని దిగి రావలసి వచ్చినది. అందుకే ‘తెలిసీ తెలియని నరుల దెల్ప బ్రహ్మదేవుని వశమే’ అన్నారు.

Swami

జీవుడు సంస్కారముల గుట్ట. ఈ సంస్కారములు కర్మల నుండి పుట్టును. ఈ సంస్కారములే మరల కర్మలను చేయించుచుండును. కర్మసంభవమై మరల కర్మకు కారణమగు గుణమే ‘సంస్కారము’ లేక ‘వాసన’ అనబడును. హింసాకర్మలు చేయువానికి హింసాగుణము వచ్చును. ఆ గుణముచే మరల హింసాకర్మలను చేయును. కావున “కర్మానుసారిణీ బుద్ధిః” అని మాత్రమే కాదు, “కర్మ బుద్ధి ననుసరించు” అనియు తెలియవలెను. ఈ సంస్కారములే కర్మ ఫలములగు “గుణములు”. ఈ గుణముల రాశియే “సంచితము”. ఈ సంచితమే జీవస్వరూపము.

ఈ జీవుని మరణానంతరము పై లోకములకు తీసుకొని పోయి ఆ జీవునకు యాతనాశరీరమును సంబంధింపచేసి శిక్షలతో బాగుగా ఉతికి వేయుదురు. వాటి చేత ఈ సంస్కారములు బలహీనములై మిగిలియుండును. కావుననే జీవస్వరూపము నశించదు. ఈ సంస్కారములలో అతి బలమైన సంస్కారమును అనుసరించి పునర్జన్మ లభించుచున్నది.

ఈ అతిబలమైన సంస్కారమునే “ప్రారబ్ధము” అనుచున్నారు. ఇప్పుడు జీవుని సంస్కారములలో ఏది అతిబలముతో యున్నదో అదియే పైలోకములో శిక్షల తర్వాత కూడా అతిబలముగ మిగిలి యుండును. కావున మనలో ప్రస్తుతము ఉన్న అతిబలమైన సంస్కారమును బట్టియే మనకు పునర్జన్మ లభించును. కావున రాబోవు జన్మ ఏదియో ఎవరికి వారే తెలుసుకొనవచ్చును. శిక్షల తర్వాత ఈ బలహీన సంస్కారమూటయైన జీవుడు ప్రారబ్ధమును అనుసరించి మరల జన్మమునెత్తగనే బాల్యావస్థలో బలహీనముగా యున్నాడు. కావున బాలుని చూచి ఇతడు నిర్మలుడు దైవస్వరూపుడు అనుకొనుట వెర్రితనము. పాము చిక్కనంత మాత్రమున సాధు ప్రాణియని భ్రమింపరాదు. అప్పుడే పుట్టిన రాక్షసబాలుడు కూడా అమాయకుడగు సజ్జనుని వలె కనిపించును.

కాని కాలము గడచిన కొలది, లోకసంగము పెరిగిన కొలది అతడి సంచిత సంస్కారములను అనుసరించి ఆ కర్మలనే మరల చేయును. ఆ కర్మల నుండి మరల అవే సంస్కారములు పుట్టి ఆ జీవుని లోనికి చేరుచుండును. ఈ జన్మలోని ఈ సంస్కారమునే “ఆగామి” అందురు. అనగా రాబోవు శిక్షలకు ఇవి కారణములు. ఈ సంస్కారములను గుణములే “మనస్సు”, “బుద్ధి”, “చిత్తము” అనబడుచున్నవి. కావున గుణసంగము లేక కర్మ చేసినచో దాని కర్మఫలము జీవుని అంటనేరదు. అనగా గుణమును అంటక కర్మ చేసినప్పుడు ఆ కర్మ నుండి గుణము పుట్టదు. ఆ కర్మకు నీలో వున్న గుణము కారణము కారాదు. కర్మ చేయకున్నను గుణము జీవునిలో చేరినచో ఆ జీవునికి కర్మఫలము అంటుచున్నది.

ఉదాహరణకు రావణాసురుడు సీత శరీరస్పర్శ చేసెను. ఈ శరీరస్పర్శకు కారణము సీతలో ఉన్న గుణము కాదు. సీతకు అట్టి సంకల్పము లేదు. సంకల్పము లేకుండా కర్మ జరిగినది. అనగా కర్మకు తనలో నున్న గుణము కారణము కాదు. కావున ఆ కర్మనుండి సంస్కారము పుట్టలేదు. అనగా ఆ కర్మకు ఫలము లేదు. ఈ విధముగా అగ్నిదేవుడు రామునికి బోధించి సీతను అప్పగించెను.

పతివ్రతయగు రేణుకాదేవి నర్మదానది కేగి అచట స్నానము చేయుచున్న సుందరుడగు గంధర్వుని చూచి కోరికయను సంకల్పము మనస్సులో పుట్టెను. ఆ గంధర్వుని శరీరస్పర్శ చేయలేదు. అనగా కర్మ జరగలేదు. అయిననూ కర్మఫలము ఆమెను అంటుకుని ఆరోజు ఇసుకతో చేయు కుండ ఏర్పడక శిరచ్ఛేదశిక్షను అనుభవించెను. కావున జడమైన కర్మ, కర్మ ఫలములను ఈయజాలదు. ఆ కర్మకు కారణమగు నీ సంకల్పమను గుణమే కర్మ ఫలములను ఇచ్చుచున్నది. కావున సంకల్పరహితుడై, అనాసక్తుడై ఎట్టి స్వార్థము లేక కర్మలను చేయువాడు కర్మఫలములను పొందడని భగవద్గీత ఘోషించుచున్నది. ఇదియే భగవద్గీత 18 అధ్యాయముల సారాంశము. ఇదియే “నిష్కామ కర్మయోగము” అనబడుచున్నది.

గ్రహములు నీ కర్మఫలమునే ఇచ్చుచున్నవి:

సంకల్పములచే చేసిన కర్మలనుండి పుట్టిన సంస్కారములకు శిక్షలను అందచేయునవియే గ్రహములు. ఈ శిక్షలు అతి తీవ్రమైన కర్మలకు ఈ లోకముననే అందచేసి మిగిలిన కర్మలకు పైలోకములలో అందచేయు శక్తిస్వరూపములే గ్రహములు. గ్రహములు నీ కర్మఫలమునే ఇచ్చుచున్నవి. కాని ఈనాడు గ్రహములు రాశులలో సంచరించు గోచారము వలన ఫలములు లభించుచున్నవ్నియు తాను ఎట్టి కర్మలు చేయని అమాయకుడననియు, అతితెలివిగల మానవుడు తలచుచున్నాడు. అనగా రోడ్డు మీదకు పోయిన తనను నిష్కారణముగా పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోయినారని చెప్పుచున్నాడు. అనగా గ్రహగోచారముల వలన ఫలములు వచ్చుచున్నవని జ్యోతిషశాస్త్ర పండితులు చెప్పుచున్నారు. జ్యోతి అనగా జ్ఞానము. ఇట్లు చెప్పినచో అట్టి శాస్త్రము జ్యోతిషశాస్త్రము కాదు, అది అంధకారశాస్త్రమగును. అట్లు చెప్పువారు, దానిని నమ్మువారు జ్ఞానులు కారు, పరిపూర్ణ అజ్ఞానులు. గ్రహముల నారాధించినచో దుష్కర్మ ఫలములు తప్పిపోయి సత్కర్మ ఫలములు వచ్చునా? అనగా దొంగతనము చేసియు పోలీసులకు లంచమిచ్చినచో నిన్ను అరెస్టు చేయక నీకు ఒక ధనపుమూటను అందింతురా? ఇది ఈ లోకమున జరగవచ్చునేమో కాని గ్రహములు ఎన్నటికీ అట్లు చేయవు.

గ్రహములు పరమాత్మ యొక్క శక్తిస్వరూపములు. పోలీసులకు లంచమిచ్చి శిక్ష తప్పించుకున్న వానిని నీవు విమర్శించుచున్నావు. కాని నీవే గ్రహముల నారాధించి దుష్కర్మ ఫలములను తప్పించుకొనవలెనని యత్నించుచున్నావు. నీ శతృవు అన్యాయము చేసినను లంచము తీసుకొని న్యాయమూర్తి అన్యాయముగా వానికి అనుకూలముగా తీర్పు ఇచ్చినందులకు నీవు దుమ్మెత్తిపోయుచున్నావు. కాని నీవే భగవంతుని ఆరాధించి నీ దుష్కర్మఫలములను రద్దు చేసి నీకు సత్కర్మ ఫలములను ఈయమని, అనగా కష్టములను పోగొట్టి సుఖమునీయమని ప్రార్థించుచున్నావు. ఆహా! మానవుని యొక్క నీతిశాస్త్రము భగవంతుని ఊహకు కూడా అందకున్నది.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch