home
Shri Datta Swami

 16 Apr 2025

 

యజ్ఞోపవీతము, ఉపనయనము, గాయత్రీ మంత్రానుష్ఠానము, వేదాధ్యయనము

యజ్ఞోపవీతము, ఉపనయనము, గాయత్రీ మంత్రానుష్ఠానము, వేదాధ్యయనముల వలన బ్రాహ్మణత్వము సిద్ధించదు. ఇవేవీ లేని బ్రాహ్మణకులమున పుట్టిన స్త్రీలు కూడ బ్రాహ్మణులే కదా. బ్రాహ్మణ స్త్రీలు బ్రాహ్మణులు కానిచో వర్ణసాంకర్యము వచ్చినది కదా. బ్రాహ్మణ స్త్రీలను చూచి, ఇతర వర్ణముల వారు, ఈ ప్రక్రియల అంతరార్థమును గ్రహించి బ్రాహ్మణ ద్వేషమును త్యజించవలయును.

ఉపనయనము అనగా బ్రహ్మమును ఉపాసించుటకు సమీపమునకు తీసుకురాబడుటయని తెలియవలెను. బ్రహ్మమును గుర్తించవలయునన్నచో బ్రహ్మలక్షణము తెలియవలెను. బ్రహ్మలక్షణము అనగా బ్రహ్మతత్త్వము కాదు. అది మహర్షులకే అందలేదు. బ్రహ్మమును ఉపాసించుటకు వీలుగా బ్రహ్మమును గుర్తించుటకు మాత్రము వీలగునది బ్రహ్మలక్షణము. దానిని వేదము చెప్పుచున్నది. కావున వేదాధ్యయనము కావలయును. అధ్యయనము అనగా పఠించి దాని అర్థమును తెలియుట. ఇక వేదము అనగా కేవలము స్వరములతో కూడిన వాక్యరాశియే కాదు. బ్రహ్మమును గురించి చెప్పు ప్రతివాక్యమూ వేదమే.

పూర్వపక్షము (opponent):- స్వరములకు అర్థము కలదు కదా. కావున స్వరరహితమైన వాక్యములకు సంపూర్ణమైన అర్థము రాదు కదా.

సిద్ధాంతి (Swami):- స్వరములకు ఏ అధికార్థము ( extra meaning) కలదో ఆ అధికార్థమును మరియొక అధికవాక్యముతో (additional sentence) కలిపి చెప్పినప్పుడు, స్వరార్థము కూడ సిద్ధించినది కదా. కావున అర్థలోపము (loss of meaning) రాదు.

కావున బ్రహ్మమును గుర్తించు లక్షణములను, బ్రహ్మమునుపాసించు మార్గమును తెలుపు వాక్యములు కల సత్సంగమే వేదము. ఋషులు చేసిన సత్సంగములే వేదములు. అందువల్లనే ప్రతి వేదమంత్రమునకు ఒక ఋషి కలడు. సత్సంగములో వచ్చు ప్రతి వాక్యము బ్రహ్మమే చెప్పును కావున వేదము బ్రహ్మచే చెప్పబడినది అగును. శ్రీరామకృష్ణ పరమహంస మొదలగు మహాత్ములు చేసిన సత్సంగము లన్నియును వేదములే. ఈ సత్సంగమునకు వచ్చుటయే ఉపనయనము.

Swami

సృష్టి, స్థితి, లయములను చేయు త్రిమూర్త్యాత్మకమైన స్వరూపమే బ్రహ్మలక్షణము. దీనినే యజ్ఞోపవీతములోని త్రితంతువులు (three threads) త్రిగుణములకు ప్రతీకలుగా (representative) ఉన్నవి. రజస్సు సృష్టికి, సత్త్వము స్థితికి, తమస్సు లయమునకును కారణములు. ఈ త్రిగుణ త్రిమూర్త్యాత్మక దత్తాత్రేయరూపమే బ్రహ్మలక్షణము. దీనినే యజ్ఞోపవీతము సూచించుచున్నది. ఇట్టి బ్రహ్మలక్షణ బోధయే బ్రహ్మోపదేశమని, ఉపనయనము యొక్క మరియొక నామము. వివాహములో భార్యకు సంబంధించిన మరియొక త్రిగుణ యజ్ఞోపవీతమును పురుషుడు స్వీకరించి, తన ఉపాసనలో సగము ఫలమును, తనకు సహకరించిన భార్యకు ఇచ్చుచున్నాడు. కొన్ని దేశములలో (places) ఈ ఆరుకాక, మరియొక మూడు పోగులను ఉత్తరీయ జందెముగా వేసుకొందురు. ఉత్తరీయము పైన లేని దోష పరిహారార్థమే తప్ప దీనికి విలువలేదు. కావుననే కొన్ని దేశముల వారు ఆరు పోగులతోనే ఉన్నారు.

కావున ఉపనయనము అనగా కేవలము బ్రాహ్మణులకు జరుపు వైదికకర్మ కాదు. యజ్ఞోపవీతమన్న కేవల జందెమే కాదు. వేదమన్నచో కేవల స్వరములతో కూడిన వాక్యరాశియే కాదు. గాయత్రీ మంత్రమన్నచో కేవలము ‘తత్సవితుః...’ మంత్రమే కాదు. బ్రహ్మమునుపాసించు, అల్పసంగీతము కల, చిత్తాకర్షణము చేసి, మాటి మాటికి మననమునకు ప్రేరేపించు ఎట్టి వాక్యమైననూ గాయత్రీ మంత్రమే. ఇది సంగీతము కాదు. నారద కీర్తనము. వీటి చేత బ్రాహ్మణత్వము సిద్ధించుచున్నది. ఎట్టి కులజుడైననూ బ్రాహ్మణత్వమునకు అర్హుడేనని చెప్పుటకు, ప్రతినెల బయటచేరు స్త్రీని అస్పృశ్యయగు చండాలిగా చేసి, స్నానానంతరము బ్రాహ్మణిగా మారినది అని చెప్పుచున్నారు. ఇది స్త్రీకి మాత్రమే ఏల? స్త్రీ ప్రకృతి రూపిణిగా జీవుని సూచించును. పురుషుడన్న పరమాత్మ ఒక్కడే పురుషుడు. కావున ఉపనయనము, వేదాధ్యయనము, యజ్ఞోపవీతము, గాయత్రీ మంత్రోపదేశము లేని బ్రాహ్మణ స్త్రీ ఎట్లు చండాలత్వము నుండి బ్రాహ్మణత్వమును పొందుచున్నదో, అట్లే చండాలుడును సత్సంగము అను ఉపనయనము ద్వారా, మహాత్ములు చెప్పు వాక్యములను వేదము ద్వారా, దత్తాత్రేయ రూపము అను యజ్ఞోపవీతము ద్వారా, స్వామిని ఉపాసించు కీర్తనము అను గాయత్రీ మంత్రము ద్వారా బ్రాహ్మణుడగుచున్నాడు. ఇదే శంకరాచార్యులకు దత్తాత్రేయస్వామి కాశిలో ఉపదేశించినది.

ఈనాడు మీకు దానిని ప్రకటించుచున్నాను. వేదము – ‘ఏకేన విజ్ఞాతేన సర్వం విజ్ఞాతం భవతి’ అనగా ఒకటి తెలిసిచో అంతయును తెలియును అని చెప్పినది. మట్టి తెలిసినచో కుండలన్నియును తెలియును. మట్టి ఇక్కడ బ్రహ్మము. కుండలే సృష్టి. అనగా సృష్టికర్తయగు బ్రహ్మమును తెలిసి ఉపాసించినచో, ఆ సృష్టికర్త గురురూపమున సర్వమును బోధించును అని అర్థము. కుండలన్నియు మట్టి నుండి పుట్టి, మట్టిలో నిలచి, పగిలినచో మట్టిలోనే లయించుచున్నది. ఇట్లే సృష్టికర్త–భర్త–హర్తయగు త్రిమూర్తుల స్వరూపమైన శ్రీదత్తరూపమును బ్రహ్మముగా తెలిసి ఉపాసించినచో ఆ స్వామియే గురుస్వరూపుడై అనగా బ్రహ్మదేవుని రూపముతో బ్రహ్మజ్ఞానమును బోధించును. ‘బ్రహ్మతత్త్వము బ్రహ్మమునకే తెలియును’ అని శ్రుతి. కావున బ్రహ్మతత్త్వమును ఏ జీవుడూ తెలియజాలడు. బ్రహ్మమును గుర్తించి, ఉపాసించు మార్గమును తెలియుటయే బ్రహ్మజ్ఞానము. సర్వసృష్టి యందును ఆధారముగా వ్యాపించియున్న ఒక్కడేయగు శ్రీదత్తబ్రహ్మమును తెలియుటయే ఏకత్వ విజ్ఞానము–అంతే తప్ప, సర్వజగత్తులోను ఉన్న ఏక పదార్థత్వ విజ్ఞానము కాదు. సర్వసృష్టియును ఈ ఆధారమైన బ్రహ్మము లేనిచో శివరహితమై (without life) శవమేయగును.

కావున పూర్వ బ్రాహ్మణులు, తమ స్త్రీల ద్వారా ఉపనయనాదులు లేకపోయినను, బ్రహ్మత్వము సిద్ధించునని సూచించినారు. మధ్యకాల బ్రాహ్మణులే, ఈర్ష్యాద్వేషములతో దురహంకారముతో ఉపనయనాదులే బ్రహ్మత్వమునకు కారణములని స్థాపించి, తమ కులమున నున్న స్త్రీలకును, ఇతర వర్ణములకును శత్రువులైనారు. దీనితో ఇతర కులములకును బ్రాహ్మణద్వేషమేర్పడి ఉపనయనము, గాయత్రీమంత్రములకు ఎగబడినారు. స్త్రీలు పురుషాశ్రయ కారణమున బ్రాహ్మణస్త్రీలు మౌనముగా నుండినారు. ఇట్టి అనర్థమునకు కారణము ఉపనయన, వేద, యజ్ఞోపవీత, గాయత్రీ మంత్రముల అసలు సత్యమైన తాత్పర్యము తెలియకపోవుటయే. పూర్వ బ్రాహ్మణులు, బ్రాహ్మణుడైనను రావణుని త్యజించి, బ్రాహ్మణులు కాని రామకృష్ణాదులను అవతారములుగా సూచించి అర్చించినారు. అట్లే స్త్రీరూపమున పరమాత్మను శక్తిగా ఆరాధించినారు. శబరి, కన్నప్ప మొదలగు అంత్యజాతుల వారిని సైతము పూజనీయులుగా చేసినారు. వీటిలో అంతరార్థము గుణకర్మ సంస్కారములే, పూజా కారణములు కాని, కులమున జన్మించుట కాదనియే తాత్పర్యము.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch