home
Shri Datta Swami

 23 Apr 2025

 

భగవంతుని ఊహా రూపమే జగత్తు, గుణములు

Updated with Part-2 on 24 April 2025


Part-1   Part-2 


Part-1

[28-03-2003]  భగవంతుడు భూలోకమున అవతరించినప్పుడు ఆయన యొక్క సకల కళ్యాణ గుణములు పూర్తిగా ప్రకటించబడవు. షోడశకళ్యాణ గుణములలో కొన్ని కళ్యాణ గుణములు మాత్రమే అవతారములలో ప్రకటించబడినవి. ఆ ప్రకటించబడిన కళ్యాణ గుణములు కూడా పూర్తి స్థాయిలో ప్రకటించబడవు. అవి చాలా తక్కువ స్థాయిలోనే ప్రకటించబడినవి. దీనికి కారణము ఏమనగా దేవతలు, ఋషులు సైతము మాత్సర్య (jealousy) గుణము అను అసూయను జయించలేకున్నారు. కొన్ని కళ్యాణ గుణములు మాత్రమే అతి తక్కువ మోతాదులో ప్రకటించబడిననూ దానికే హృదయములలో అసూయ చెలరేగి క్రమముగా ద్వేషముగా మారుచున్నది. దేవతలు, ఋషులు సైతమే అసూయా గుణమును అతిక్రమించలేనప్పుడు ఇక మానవమాత్రుల సంగతి చెప్పనేల? ఈ కారణముచేత దివ్యగుణములు తక్కువస్థాయిలో వ్యక్తమగుట మాత్రమే కాదు, ఒకొక్కసారి అవతారములో దుర్గుణములు కూడ వ్యక్తమగుచున్నవి.

కళ్యాణ గుణములను చూచిన తరువాత మహా మహా భక్తులకు సైతము హృదయములో ఎచ్చటనో మాత్సర్యము తళుక్కుమను చుండును. ఆ మాత్సర్యము నుండి ద్వేషము పుట్టుచున్నది. ఆ ద్వేషము ఎట్లు శాంతించుననగా, అవతారమును నిందించిన గాని అది శాంతించదు. నింద ద్వారా ద్వేషము అను విషము కక్కబడుచున్నది. కరుణామయుడగు స్వామి తన భక్తుల హృదయము నుండి ఆ ద్వేషమును కక్కించి వారిని శాంతింపచేయుటకు తనలో దుర్గుణములను ప్రదర్శించును. ఈ దుర్గుణములను చూచినప్పుడు వారలలో గూఢముగా దాగియున్న ద్వేషము స్వామి నిందారూపముగా బయటకు వచ్చును. స్వామి దుర్గుణములను ప్రదర్శించనిచో ఆ ద్వేషము వారి హృదయములందు దాగి వృద్ధి అగుచుండగా వారు మనస్సులలో బాధపడుచుందురు. భక్తుల బాధను సహించలేని స్వామి వారి మనస్సుల నుండి బాధను తొలగించుటకు దుర్గుణ ప్రదర్శనము ద్వారా అవకాశమును కల్పించును. ఈ దుర్గుణ ప్రదర్శనమునకు అనేకములైన అంతరార్థములు ఉన్నవి. సర్వగుణములకు సృష్టికర్త స్వామియే. సర్వసృష్టియు స్వామి యందే ఇమిడియున్నది. కావున సృష్టిలో ఉన్న సర్వ సద్గుణములు, సర్వ దుర్గుణములు ఆయన యందే ఇమిడియున్నవి.

దీనినే భగవద్గీతలో స్వామి ఇట్లు చెప్పుచున్నారు –  ‘యే చైవ సాత్త్వికా భావాః రాజసాః తామసాశ్చ యే’, ‘మత్త ఏవేతి తాన్విద్ధి, న చాహం తేష్వవస్థితః’ అనగా సాత్త్వికములైన సద్గుణములు, రాజస, తామసములైన దుర్గుణములు నా నుండియే జన్మించినవి. కాని వాటి యందు నేను లేను. అనగా అన్ని గుణములకు తానే జన్మస్థానమై, ఆధారమైననూ అవి తన కన్న వేరుగనే ఉండుటచేత తనలో ఎట్టి వికారము (feeling) ను కల్పించలేవు. సర్వసృష్టియు స్వామి యొక్క సంకల్ప స్వరూపమై ఉన్నది. అనగా ఈ సృష్టిలో ఉన్న ఒక కుండయు స్వామి సంకల్పరూపమే. అట్లే ఈ సృష్టిలో ఉన్న దయ అను ఒక సద్గుణము కూడా ఆయన యొక్క సంకల్ప స్వరూపమే. ఒకడు ఒక మహానగరమును ఊహించినాడు. ఆ నగరములో ఎందరో జనులు సంచరించుచున్నారు. ఆ జనులలో ఒక పేదవానికి ధనికుడు ధనమునిచ్చి దయను చూపెను. మరియొక ధనికుడు పేదవానిని కొట్టి హింసించెను. ఆ నగరము కాని, ఆ నగరములో సంచరించుచున్న జనులు కాని, ఒకచోట ప్రదర్శింపబడిన దయాగుణము కాని, మరియొక చోట ప్రదర్శించబడిన హింసాగుణము కాని ఇవి అన్నియును ఆ వ్యక్తి యొక్క ఊహలే. అవి ఆ వ్యక్తి కన్న భిన్నముగా ఉన్నవి. ఊహలు మనస్సుచేత నిర్మించబడినవి కావున మనోమయములు అందురు.

Swami

మనస్సుకు చాలా అత్యల్పమైన శక్తి కలదు. మనము నడచుచున్నప్పుడు స్వల్పముగ గాలి వీచుచున్నది. దానివలన మన శరీరమునకు ఎట్టి నొప్పియు పుట్టుట లేదు. గాలికి బదులు ఒక రాయి తగిలినచో శరీరమునకు గాయమగుచున్నది. గాలి యొక్క శక్తి చాలా తక్కువ కావున శరీరమునకు గాయమగుట లేదు. కాని రాయి యొక్క శక్తి చాలా ఎక్కువ కావున దానితో పోల్చినపుడు అత్యల్పమైన శక్తిగల మనస్సు యొక్క రూపమైన భావము శరీరములో ఎట్టి మార్పును తీసుకురాలేదు. ఉదాహరణకు, ఎర్రగా నున్న ఒకడు నేను తెల్లగా ఉన్నాను అని భావించినందున వాడి శరీరములో తెలుపురంగు వచ్చుట లేదు. అట్లే ఈ సృష్టిలోని సర్వపదార్థములు స్వామి యొక్క సంకల్ప రూపమునకు భావములే. మనకు ద్రవ్యము, గుణము వేరు వేరుగా సృష్టిలో కనబడుచున్నవి. ద్రవ్యము అనగా ఒక కొండ. గుణము అనగా ఒక దయాగుణము అనుకొందము. మన దృష్టిలో కొండ వేరు, దయాగుణము వేరు. ఒకటి ద్రవ్యము, మరియొకటి గుణము, కాని స్వామి దృష్టిలో కొండయు, దయాగుణము ఈ రెండును ఆయన యొక్క ఊహారూపమైన భావములే. భావమునకు మరియొక పేరు గుణము. కావున స్వామి దృష్టిలో కొండయు, దయయు రెండును గుణములే. కావున స్వామి దృష్టిలో సర్వసృష్టియు సత్త్వము, తమస్సు, రజస్సు అను మూడు గుణములే. అనగా సృష్టి అంతయు త్రిగుణ స్వరూపమే. కావున పంచభూతములు అను ద్రవ్యమునకు, సద్గుణములకు, దుర్గుణములకు మూలకారణమై ఆధారభూతమై ఉన్న స్వామిలో ఈ సద్గుణములు కాని, దుర్గుణములు కాని ఎట్టి వికారమును తీసుకురాలేవు.

స్వామి ఎల్లప్పుడు నిశ్చలుడు, నిర్వికల్పుడు, నిరంజనుడు, నిష్కళంకుడు, నిర్గుణుడు. స్వామి దుర్గుణములను ప్రదర్శించుటకు మరియొక కారణము ఏమనగా, స్వామిని గుర్తించినాము, స్వామి యందు పరిపూర్ణ విశ్వాసముతో ఉన్నాము అను భావము వలన భక్తులలో అహంకారము వచ్చుచున్నది. ఆ అహంకారమును పోగొట్టుటకు స్వామి తన దుర్గుణ మాయను ప్రదర్శించును. దానిచే విశ్వాసము సడలి గుర్తింపు చెదరి పోవుచుండును. అట్లు ఆ పరీక్షలో ఓడిపోవుట వలన వారు తాము పొందిన అహంకారమును తెలుసుకొనుచున్నారు. నారాయణుడే శ్రీకృష్ణునిగను, శిరిడిసాయిగను అవతరించినాడు. శ్రీకృష్ణుని ముఖము ఎంతో అందముగ ఉండును. కాని శిరిడిసాయి ముఖములో కొంచెము కూడ అందము లేదు. దీనికి కారణమేమి? సౌందర్యము అనునది భగవంతుని కళ్యాణ గుణములలో ఒకటి. శ్రీకృష్ణుడు షోడశ కళాపరిపూర్ణుడు అనగా షోడశకళ్యాణ గుణములను ప్రకటించినాడు. దాని కారణముగా శ్రీకృష్ణునకు అందరును శత్రువులే. ఒక్క రాధ తప్ప సర్వభక్తుల హృదయములలో కూడ అప్పుడప్పుడు మాత్సర్య, ద్వేషములు తొంగిచూచినవి.

 

Part-2

ఆ కాలములో కృష్ణుని పదునారువేల రాజకన్యలు వలచినారు. వారు అందరు రాజకుమారులను నిరాకరించినారు. ఈ కారణముగా రాజులందరును కృష్ణునకు శతృవులైనారు. జరాసంధుడు ఆ పదునారువేల రాజకన్యలను బంధించి చెరసాలలో ఉంచి కృష్ణుని మరచిపొమ్మని హింసించెడివాడు. జరాసంధుడు వధ జరిగిన తరువాత కృష్ణుడు వారిని విముక్తులను కావించి ఎవరి ఇళ్ళకు వారిని పొమ్మన్నాడు. కాని వారు తమ భావములను తెలిపి ప్రాయోపవేశ మరణమునకు సిద్ధమైనారు. అప్పుడు తప్పనిసరియై కృష్ణుడు వారిని వివాహమాడినాడు. అంతే కాదు వారందరికీ భర్తగా ఉండి జీవితాంతము ఆనందము నిచ్చినాడు. ఇట్లు తన సౌందర్య, సామర్థ్యములు అను కళ్యాణ గుణములను భగవానుడు పరిపూర్ణముగా ప్రకటించుటచేత మహాభక్తులైన పాండవుల హృదయములలో కూడ అసూయ వచ్చినది. దానిని కట్టించి వారిని శుభ్రపరచుటకు స్వామి గయోపాఖ్యానమును కల్పించినాడు. ఆ సందర్భమున స్వామి శీలరహితుడని పాండవులు నిందించినారు. కావున ఈ సౌందర్యము అను కళ్యాణగుణము శిరిడిసాయిలో దాగి ఉన్నది. కాని ప్రకటించబడలేదు. ఈ సౌందర్యము అను కళ్యాణగుణము యొక్క ప్రయోజనమేమి? ఇతరులకు అసూయను కల్పించి ఏడ్పించుటకా? కాదు. కాదు.

ఆత్మావా రే ద్రష్టవ్యః’ అని శ్రుతి చెప్పుచున్నది. అనగా పరమాత్మను మొట్టమొదట చూడవలయును అని అర్థము. ఇదే దర్శనము అను భక్తిలోని మొదటి అవస్థ. దర్శనము అనగా దృష్టి పరమాత్మ మీదకు ఆకర్షింపబడి స్థిరముగా నిల్చుట. కావున భక్తుల యొక్క దృష్టిని స్థిరముగా నిల్పుటకు ఈ కళ్యాణగుణము సత్ర్పయోజనము కలిగియే ఉన్నది. దృష్టిని పరమాత్మపై స్థిరముగా నిల్పుటకు స్త్రీ, పురుష బేధము లేదు. ఏలననగా సాధకులగు భక్తులు ఎవరైననూ కావచ్చును. రాముని సౌందర్యమును చూచి దండకారణ్యములో జితేంద్రియులగు ఋషులు అగు పురుషులే ఆకర్షించబడి తమ దృష్టిని స్థిరముగా స్వామిపై నిలిపినారు. వారే గోపికలుగా, స్త్రీలుగా జన్మించి కృష్ణుని అందముపై దృష్టిని స్థిరముగ నిల్పినారు. జీవులందరునూ స్త్రీలే అని ‘స్త్రియః సతీః పుంసః’ అని శ్రుతి చెప్పుచున్నది. పరమాత్మ ఒక్కడే పురుషుడనియు శ్రుతి ‘అధ పురుషో హ వై నారాయణః’ అని శ్రుతి చెప్పుచున్నది. రాధ యొక్క అవతారమగు మీరాబాయి తులసీదాసు ఆశ్రమమున విశ్రమించ గోరినది. ఇది పురుషులుండు ఆశ్రమము, స్త్రీలకు నిషిద్ధము అని తులసీదాసు చెప్పినాడు. అప్పుడు మీరాబాయి అమాయకముగా అయ్యా! ఇంతవరకునూ కృష్ణభగవానుడు ఒక్కడే పురుషుడని భావించుచుంటినే, మన జీవులలో కూడా పురుషులు ఉన్నారా? అని ప్రశ్నించినది. తులసీదాసు మీర పాదములపై పడినాడు.

చైతన్యమహాప్రభు అను కృష్ణభక్తుడు ప్రతిదినము కృష్ణుని ఆలింగనము కొరకు తపించగా శరీరమంతయును జ్వరముతో కాలుచుండెడిది. ఆ తాపశాంతికి ఆ భక్తుని శరీరమంతయును చందనముతో కప్పెడివారు. కావుననే అతడిని ‘గౌరాంగుడు’ అని పిలచినారు. గౌరాంగుడు అనగా తెల్లని శరీరము కలవాడు అని అర్థము. నిత్యము చందనము పూతచేత అతని శరీరము తెల్లగా కనిపించెడిది. ప్రతిదినమూ కృష్ణుడు వచ్చి ఆ భక్తుని ఆలింగనము చేసుకొని ఆ రోజు తాపమును స్వామి శాంతింప చేసెడివారు. కావున ఇట్లు సౌందర్యము అను కళ్యాణగుణము భక్తుల సాధనకు సహాయము చేయునదియే. అంతేకాని, బాహ్యసౌందర్యము నిత్యము కాదు. ఆత్మసౌందర్యమే ప్రధానము. త్యాగమే ఆత్మసౌందర్యము. స్వార్థమే ఆత్మ యొక్క కురూపితనము. ఈ విషయమును నిరూపించుటకై శిరిడిసాయి సౌందర్యము అను కళ్యాణ గుణమును దాచుకొని దానిని ఏ మాత్రము ప్రకటించక ఆత్మసౌందర్యమును మాత్రమే ప్రకటించియున్నాడు. బాహ్యసౌందర్యము సాధించుకొనుట వీలు కాదు. కాని ఆత్మసౌందర్యము సాధనచేత సాధ్యము. కావున బాహ్యసౌందర్యము లేని వారు నిరుత్సాహమును చెందరాదు. అది అశాశ్వతము.

శాశ్వతమైన ఆత్మసౌందర్యమును సాధించుకొనవలయునని శిరిడిసాయి అవతారము యొక్క ఉపదేశము. కావుననే అసూయకు కారణమగు బాహ్యసౌందర్యమును స్వామి శిరిడిసాయి అవతారములో ప్రకటించలేదు. హనుమంతుడు వానరముఖముతో ఉన్నాడు. ఆయనలో బాహ్యముఖ సౌందర్యము లేదు. కాని అపార సౌందర్య సాగరుడగు రామునకు పరమభక్తుడైనాడు. రాముని సౌందర్యము ఆయనలో మాత్సర్యమును పుట్టించలేదు. హనుమంతుని యొక్క హృదయము నందు ఆత్మసౌందర్యము అంత గొప్పగా ఉన్నది. తన స్వామి సౌందర్యమునకు పొంగిపోయి పలువిధముల స్తుతించి నాడే తప్ప గయోపాఖ్యానమువలె యయాతి రక్షణ సందర్భమున తనతో రామునికి యుద్ధము వచ్చినప్పుడు రాముని ఒక్కమాటతో కూడ నిందించలేదు. కావుననే రాముడు హనుమంతునకు అతి గాఢమైన ఆలింగనమును ఇచ్చి బ్రహ్మానందమున మునుగునట్లు చేసినాడు. స్వార్థము యొక్క మారురూపమైన ఈ అసూయ అంతరించనిదే ఏ జీవునికీ దత్తుడు చిక్కడు. అసూయ లేకపోవుటయే అనసూయ తత్త్వము. అట్టివాని లోనికి దత్తుడు ప్రవేశించును. ఇదే అనసూయా గర్భములోనికి దత్తుడు ప్రవేశించుటలోని అంతరార్థము.

సత్యభామ ఎంతో బాహ్య సౌందర్యము కలిగియుండెడిది. బాహ్య సౌందర్యమున కృష్ణభగవానుడు కూడ ఆమెకు దీటుగా ఒక ఆకు ఎక్కువగనే ఉండెడివాడు. ఆమె తన బాహ్య సౌందర్యమునకు గర్వించి స్వార్థముతో ఆత్మసౌందర్యము లేక కృష్ణుని ఆత్మసౌందర్యమును చూడలేక కేవలము ఆయన బాహ్య సౌందర్యముచేతనే ఆకర్షిత అయినది. స్వార్థముతో కృష్ణుని తన కొంగున మాత్రమే కట్టివేసుకొనవలెనని భావించినది. బాహ్య సౌందర్యమును దీపింపచేయు బంగారు ఆభరణములను కూడా ఎక్కువగా కలిగియుండెడిది. సృష్టిలోని మొత్తము బంగారమునకు అధిదేవత అయిన మహాలక్ష్మీ అవతారమగు రుక్మిణి కేవలము తులసిమాలను మాత్రమే ధరించెడిది. ఆ తులసిమాల నుండి త్యాగము అను సద్గుణము సుగంధరూపమున బయిటకు వచ్చుచుండెడిది. ఆ సుగంధము శరీరమున ఉన్న స్వార్థగుణము అను చెమటకంపును కూడా పోగొట్టి శరీరమును కూడ సుగంధమయముగా చేయుచుండెడిది.

అనగా రుక్మిణి స్వార్థగుణమును పోగొట్టుకొని త్యాగసుగంధముతో ఘుమఘుమ లాడుచుండెడిది. సత్యభామ ఒంటినిండా బంగారు సొమ్ములను పెట్టుచుండెడిది. ఆ బంగారము తేజస్సు అను రజోగుణమైన అహంకారమును వెదజల్లుచున్నది కాని త్యాగము అను సుగంధమును వెదజల్లుట లేదు. పైగా అది ఆశ్రయించిన శరీరములోని స్వార్థము అను చెమటకంపును పొంది తాను కూడ ఆ దుర్గంధమునే వెదజల్లుచున్నది. కావున స్వార్థము కలవాడు తనతో చేరిన వారిని కూడ స్వార్థపూరితులను చేయును. అట్లే త్యాగము కలవారు తులసీమాలవలె తనతో చేరిన వారిని కూడ త్యాగమయులను చేయును.

కృష్ణుని తూచుటకు, సత్యభామ పెట్టిన బంగారు సొమ్ములన్నియును ఆమె శరీరము నుండి అంటిన స్వార్థము అను స్వేద దుర్గంధమునే వెదజల్లుచున్నది. ఆ బంగారమంతయును స్వార్థమునకు సూచన. ఆ స్వార్థమునకు పరమాత్మ దక్కలేదు. కాని రుక్మిణి తులసీదళము నుంచి త్యాగ సుగంధము వెదజల్లుచూ రుక్మిణి శరీరమున ఉన్న స్వార్థము అను స్వేద దుర్గంధమును పోగొట్టి త్యాగ సుగంధములుగా మార్చినది. దానికి పరమాత్మ చిక్కినాడు. ఎన్ని టన్నుల బంగారము పెట్టిననూ కృష్ణుడు దక్కలేదు. అనగా స్వార్థముతో ఎన్ని పూజలు చేసిననూ ఎంత తపస్సు చేసినను పరమాత్మ లభించడని అర్థము. చిన్న తులసీదళమునకు స్వామి దక్కినాడు అనగా ఇతర జీవులను ఉద్ధరించుట అను త్యాగ సుగంధములతో కూడిన స్వల్పమైన సేవకు పరమాత్మ చిక్కును అని అర్థము.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch