home
Shri Datta Swami

 09 Jun 2025

 

బ్రహ్మలహరి - దివ్యదర్శనముల నిచ్చుట - 13

శివదత్త దర్శనము - బరోడా మహరాజ్

స్వామి, మేము శ్రీశైలంలో శివసదనంలో బసచేసి ఉన్న రోజులవి. సత్రంలోని శివాలయంలో ఎదురుగా ఒక మహాపురుషుడు (బరోడా మహారాజ్) కనిపించారు. ఆయన రోజూ ఒక గ్లాసుపాలను మాత్రం తీసుకుంటూ, శివపురాణము పారాయణ చేస్తున్నారు. స్వామి “ఈ యోగిపుంగవుడు మార్కండేయుని అంశ సంభవుడు” అన్నారు.

ఒకనాడు శివసదనంలో మా వసతి గృహములో మేము ముగ్గురము ఉన్న సమయంలో ఇలా అన్నారు “శ్రీదత్తభగవానులు ఈ రోజు మధ్య శివముఖము, ఇరుపక్కల బ్రహ్మ, విష్ణు ముఖములతో తేజోవంతముగా ఉన్నారు, శివదత్తులుగా. బరోడా మహారాజ్ స్వామి పాదాలవద్ద సేవ చేయుచూ స్వామి ముఖమును చూచుచున్నారు.”

ఆనాటి రాత్రి మేము ముగ్గురము కరివెన అన్నదాన సత్రములోని ఆ యోగిపుంగవుడు నివసించుచున్న గదికి వెళ్ళినాము. ఆ మహరాజ్ ఇలా పదేపదే గానం చేసినారు. చేతులతో చప్పట్లు కొడుతూ ఆనందోద్రేకంలో స్వామి వైపు చూస్తూ “ఆజ్ మీ దత్త కో దేఖ్ లీ” అని అనగా, “ఈ రోజు నేను దత్తుని చూశాను” అని అర్థము. దీని వల్ల ఆ ఉదయం స్వామి చెప్పిన దివ్యదర్శన వివరమునకు శ్రీ మహారాజ్ పాడిన కీర్తనకు ఎంత పొంతన ఉన్నదో కదా! స్వామి చెప్పిన మాటనే మహారాజ్ గానం చేశారు. తరువాత మేము అర్థం చేసుకున్నదేమంటే శివదత్తునిగా దర్శనము ఇచ్చినది స్వామియేనని.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch