12 Jun 2025
గోడపైన చిత్రములో కదలికలు.
స్వామి లీలలు అనంతాలు. అజయ్ కూడా స్వామి మహిమను చూడాలని మనస్సులో కోరుకున్నాడు. స్వామి అజయ్ ను చూసి నవ్వారు, అంగీకరించినట్లుగా. ఒకనాడు అజయ్ స్వయంగా పాయసం తయారు చేసి శ్రీదత్తప్రభువుకు నివేదన చేస్తున్నారు. దత్తుని చిత్రపటములో స్వామి విచిత్రముగా కన్నులను తిప్పుతూ పెదవులను పాయసం చప్పరిస్తున్నట్లు కదలించసాగారు. దానితో నిశ్చేష్టుడైన అజయ్ గారికి శరీరమంతా ముచ్చెమటలు పోసినవి. ఆ రోజు రాత్రి స్వామి వారు ఇంటికి వేంచేసినప్పుడు, ఈ విచిత్రాన్ని అజయ్ గారు వివరించగా “అవును పొంగలి బాగా చేస్తావు గదా వెనుక జన్మలో, తిరుపతిలో నీవు స్వామికి అర్చకుడివిగా బాగా చేసేవాడివి” అని చిరునవ్వు చిందించారు. అజయ్ దంపతులు విస్తుపోయారు. అజయ్ భార్య లక్ష్మి స్వామికి అన్నం వడ్డిస్తూ “స్వామీ! వారికి దివ్య దర్శనం కల్గించారు గదా, నాకూ చిన్నదేదైనా చూపరా?” అని అడిగింది. స్వామి తల ఊపి అంగీకారంగా నవ్వినారు. మరురోజు ఆమె వంట చేస్తుండగా ఒక చిన్న జ్యోతి, లక్ష్మికి కనిపించింది. కూరచేస్తూ అలానే నిలబడి దాని వంకే చూస్తున్నది లక్ష్మి. ఆ జ్యోతి 5 నిముషాలు ప్రయాణించి దత్తచిత్రములోనికి పోయి అదృశ్యమైనది. ఆహా! ఎంతటి అద్భుతలీల!
★ ★ ★ ★ ★