home
Shri Datta Swami

 15 Jun 2025

 

బ్రహ్మలహరి - దివ్యదర్శనముల నిచ్చుట - 19

విద్యుత్ శక్తిని, రంగు కిరణాలను చూపించుట.

[శేషాద్రి, లలిత, దివ్య]

భక్తులు శ్రీ ఆత్కూరు సుబ్బారావుగారు, వారి సతీమణి శేషమ్మగారు ఎప్పటినుండో స్వామిని వారింటికి ఆహ్వానిస్తున్నారు. సరే! అన్నారు స్వామి. కాని ఆ సమయం రాలేదు. శ్రీ సుబ్బారావు గారి పుత్రిక చి. సౌ. గాయత్రి, అల్లుడు చంద్రశేఖర్ గారు కువైట్లో ఉన్నారు. ఈ దంపతులు స్వామి వ్రాసిన దత్తవేదమును చదివి, తన్మయత్వం చెంది తృతీయముద్రణము కావించి ప్రచారసేవ చేసిన ధన్యులు.

శ్రీ సుబ్బారావుగారు ధర్మపత్నితో సహా వచ్చి స్వామిని ఒకరోజు ఇందిరా టవర్సులో ఉన్న పుత్రుడు శేషాద్రి, కోడలు లలిత, ఇద్దరు అమ్మాయిలు నివసిస్తున్న ఇంటికి తీసుకుపోయి స్వామి చేత భజన, సత్సంగం చేయించినారు. అందరూ స్వామికి నమస్కరించారు. కోడలు లలితగారు స్వామి పాదాలు స్పృశించి నమస్కరించగనే కరెంటుషాకును పొందినది! ఒక అమ్మాయి నమస్కరించగా స్వామి హస్తము నెత్తి ఆశీర్వదించినారు. ఆ అమ్మాయికి స్వామి హస్తము నుండి రంగు, రంగుల కిరణాలు ప్రసరిస్తూ రావటం కనిపించింది. రెండవ అమ్మాయి నమస్కరించగా, స్వామి శరీరములో విద్యుత్ వలయాలు గిరగిర తిరుగుతూ స్వామి శరీరము అంతా విద్యుత్ శక్తితో నిండి తెల్లగా ప్రకాశించటం కనిపించింది! ఆ కుటుంబం ఆనందపరవశులైనారు. విశ్వాసం పెంపొందించటానికి స్వామి ఇట్టి అనుభూతులు ప్రసాదిస్తారని మనం గ్రహించాలి. మర్నాడు వారు తమ అనుభూతులను నాకు ఫోనులో చెప్పారు.

నేను చాలా సంతోషించాను. మీరు అందరూ ధన్యులన్నాను. ఆ సాయంత్రం స్వామి మా ఇంటికి వచ్చారు. వారికి ఈ అనుభూతుల విషయం చెప్పాను. స్వామి చిరునవ్వు చిందిస్తూ “వారిని బ్రహ్మరంధ్రం వరకు చేర్చాను” అన్నారు. ఆ తరువాత నేను వారికి ఫోను చేసి ఈ విషయం చెప్పాను. వారు మహదానంద భరితులైనారు. ఆ అమ్మాయిలలో ఒకరికి స్వామి శరీరం నుండి పింక్ రంగు కాంతి అనంతంగా రావటం చూచిందట. అది నా ప్రేమస్వరూపము అన్నారు స్వామి.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch