home
Shri Datta Swami

 28 May 2025

 

Telugu »   English »  

బ్రహ్మలహరి - దివ్యదర్శనముల నిచ్చుట - 2

బ్రహ్మతేజస్సును చూపుట

[శ్రీలక్ష్మి, భాస్కర్]

విజయవాడ కృష్ణలంకలో మా గృహములోని మూడవ అంతస్థులో శ్రీదత్తపీఠాన్ని స్వామి ప్రతిష్ఠించినారు స్వయముగా. ఇది తన మూలస్థానం అంటారు స్వామి. ఆ పీఠంలో ప్రతిరాత్రి మేము దత్తభగవానునికి పుష్పశయ్య అమర్చి, సేవిస్తూ ఉంటాము. ఆ శయ్యపై స్వామి శయనించేవారు రాత్రిళ్ళు. మా పెద్దకోడలు శ్రీలక్ష్మి స్వామిని గురువుగా భావించేది. శ్రీదత్తభగవానునికై వేసిన ఆ పుష్పశయ్యను ఒక మానవమాత్రుడు (అనగా మన స్వామి) పాదాలతో త్రొక్కుతూ ఆ శయ్యపై శయనించటము అంత ఇష్టంగా ఉండేది కాదు ఆమెకు. "నేను భౌతికంగా ఎక్కడ ఉన్నా, ప్రతిరాత్రి ఈ శయ్యపై నేను శయనిస్తాను కావున, ఈ మందిరం తలుపులు మూసిన తరువాత ఎవరూ తలుపు సందులు, కిటికీ సందుల ద్వారా లోపలకు చూడవద్దు" అని స్వామి ఒకరోజు గట్టిగా శాసించినారు, ఒకసారి నేను ఆ ప్రయత్నం చేయగా…

ఇంతలో కార్తికమాసం వచ్చింది. ఒక కార్తిక సోమవారం నాడు రాత్రి శ్రీలక్ష్మి కార్తికదీపం తులసికోట వద్ద వెలిగించుకొని, మందిరం తలుపులు వేసియున్నందున కిటికిలో నుండి పీఠానికి నమస్కరిద్దామని లోపలికి తొంగిచూచింది.

అంతే, ఆహా! అది అద్భుత దర్శనం. మహాతేజస్సుతో, శయ్యపై, కర్పూరగౌర శరీరముతో శ్రీదత్తప్రభువు దర్శనమిచ్చినారు, శయనించిన ముద్రతో!

ఆశ్చర్యం - ఆనందం - సంభ్రమాలతో నిర్ఘాంతపోయి భయంతో కిందకు పరుగుతీసింది. మరునాడు గాని అసలు విషయం బయటపడలేదు.

మరునాడు స్వామి వేంచేసారు. జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు విన్నవించింది శ్రీలక్ష్మి. అప్పుడు స్వామి ఇలా సెలవిచ్చారు. "ధన్యురాలవు! నీకు బ్రహ్మతేజస్సు యొక్క సాక్షాత్కారం కలిగింది. ఆ దర్శనం ఎన్నో జన్మల తపస్సు యొక్క ఫలమని" స్వామి చెప్పటంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch