home
Shri Datta Swami

 01 Jun 2025

 

బ్రహ్మలహరి - దివ్యదర్శనముల నిచ్చుట - 5

విశ్వరూప దర్శనమునిచ్చుట.

మేమందరము స్వామికోసం నిరీక్షిస్తున్నాము. ఇంతలో అజయ్ గారికి, సీతమ్మ గారికి మధ్య ఒక సంభాషణ జరిగినది. అది ఇలా ఉన్నది. సీతమ్మగారు క్రిందటి రోజున స్వామి సువర్ణతేజస్సుతో తనకు ఇచ్చిన శ్రీదత్తదర్శనమును గురించి అజయ్ గారికి వర్ణించి చెప్పుచున్నది. ఇప్పటికీ ఆ రూపము కనపడుచున్నదని, తనివి తీరుటలేదనియు ఎంతో ఉద్రేకముతో చెప్పుచున్నది. అప్పుడు అజయ్గారు అదివిని “సీతమ్మగారూ! మీకే కదా కనపడినది. నాకు కనపడటం లేదుకదా” అని అన్నారు, ఆ భాగ్యం తనకు కలుగని వేదనతో.

ఇంతలో స్వామి రానే వచ్చారు. సత్సంగము ప్రారంభమైనది. ఆనాడు గురుపూర్ణిమ. స్వామి సత్సంగములో భక్తులకు భగవద్గీతాసారమునంతయు 3 గం. సమయము ప్రవచనవర్షము కురిపిస్తున్నారు. “మనస్సంగము వల్లనే కర్మఫలాలు జీవుడికి అంటుకుంటాయి. జడమైన కర్మ, జడదేహంతోపాటు భస్మమౌతున్నది. మనస్సంగము లేకుండా వ్యాసుడు అంబిక - అంబాలికలందు పుత్రోత్పాదనం చేసినా ఏ పాపమూ అంటలేదు. మనస్సంగము లేని సీత, రావణ స్పర్శచేత దూషితురాలు కాలేదని అగ్ని రాముడికి చెప్పినాడు. శరీరస్పర్శ లేకపోయినా, మనస్సు చలించుట చేత రేణుక, శిరచ్ఛేద పాపఫలాన్ని పొందినది. పరకాయప్రవేశము ద్వారా తాను పొందిన స్త్రీలభోగాల ఫలాలు తనను అంటవని, మనస్సంగము లేనందున తాను పవిత్రుడనని శంకరులు సర్వజ్ఞపీఠం ఎక్కుతూ సరస్వతీదేవి ఆక్షేపించగా, ఆమెతో అన్నారు. హనుమంతుడు కూడా లంకలో వివస్త్రలుగా నిద్రించుచున్న అసురవనితలను చూచినందున, మనస్సంగరాహిత్యం వల్ల పాపిని కాలేదని సుందరకాండలో తలచినాడు. ఇదే నిష్కామ కర్మయోగము.” అని ఇలా గీతాతాత్పర్యాన్ని అమృతవర్షంగా కురిపించినారు. హఠాత్తుగా, స్వామి ఎంతో వేగంగాలేచి 5 నిముషాలు నిలబడినారు. తరువాత ఆసీనులై, భక్తులలో ఉన్న సీతమ్మగారినీ ఆత్మీయభక్తుడగు అజయ్ గారినీ "మీరిరువురూ ఏమి చూశారు?" అని స్వామి ప్రశ్నించగా, ఇరువురూ ఒకే సమయములో ఒకే దృశ్యాన్ని చూసినట్లు వారి సమాధానాలలో చెప్పారు. అయితే ఆ దృశ్యం ఏమిటి? అని భక్తులంతా వినాలని కుతూహలపడ్డారు. ఆ దృశ్యం ఇది. స్వామి విశ్వరూపంలో గోచరిస్తున్నారు. ఆ విశ్వరూపుని పాదాల మీద అర్జునుడు సాష్టాంగపడి ఉన్నాడు. స్వామి వెనుక బంగారురథం ఒకటి ఖాళీగా ఉన్నది. "ఒకే సమయములో ఒకే దృశ్యాన్ని ఇరువురికీ చూపించటంలో కంటిభ్రమ కాదని తేలింది గదా" అన్నారు నాతో, అలా ఇరువురికీ దర్శనమిచ్చుటలో అంతరార్థం ఏమిటని నేను అడిగినందుకు. "మరియును, అజయ్, సీతమ్మకే దర్శనమైనది తనకు కాలేదని బాధపడుచున్నందున ఇట్లు చేశాను" అన్నారు.

ఆహా! ఎంతటి మహిమ!

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch