13 Aug 2025
1. జ్ఞానమే నా సహజ సత్య స్వరూపం - ప్రేమయే నా సహజ సత్య సౌందర్యం!
ఈ రెండె నను పట్టగా గుర్తులిచ్చట - నా అలంకారాలె యీ అష్టసిద్ధులు ।
దైత్య పుత్రులు గూడ మొండి తపములఁజేసి
నా నుండి పొందుదురు అష్ట సిద్ధులనిలను ।
అవె గుర్తులను తలచువారలజ్ఞానులే ।
స్వార్థమును తీర్చుకొన యత్నించు లుబ్ధులే
2. అష్ట సిద్ధుల అవసరమేల? - సుందరాకృతికి సొమ్ములు ఏల?
జ్ఞాన యోగమే నా స్వరూపమగు - జ్ఞానులు వ్యక్తిని గుర్తించెదరు
3. సాధన పూర్తిగ చేయకయే - కొన్ని సిద్ధులను పొందగనే
అవతారములుగ గురువులుగ - బ్రహ్మోహమనిరి కొందరిలన్
జ్ఞాన భాస్కరుడు దత్తాత్రేయుడు - తత్త్వాంబరమున గోచరించగా ।
మాయగురువులిల అంధకారములు - పటాపంచలై పారిపోదురు
4. అష్ట సిద్ధులను భ్రమలను వీడుము - పాపలకే గద మాయలు వింతలు।
జ్ఞానయోగమున గమ్యము చేరుము - జ్ఞాన యోగమన తెలియుట చెప్పుట
(స్వామి భజనలనుండి)
జీవునకు మహిమల వలన దేవుడున్నాడని విశ్వాస మేర్పడుతుంది. కానీ క్రమముగా, ఆ మహిమలను ప్రదర్శించిన అవతార పురుషునిపై ఆ జీవునకు మాత్సర్యద్వేషములు కలిగి, ఆ సిద్ధులను పొంద యత్నిస్తాడు. వాటిని పొంది తానూ దేవుడు కావలయుననుకుంటాడు. ఈ సిద్ధులు స్వామికి సొమ్ములే. మొండిబిడ్డలగు రాక్షసులు మొండితపస్సుల చేత సర్వపితయగు స్వామి నుండి వాటిని పొందినా వారు స్వామి కాలేరు. ఆయన నుండి వేరు చేయలేని ఆయన జ్ఞానస్వరూపమును, ప్రేమసౌందర్యమును వారు పొందలేరు గదా. పులియంత బలవంతుని జ్ఞానులు పులి యందురు కానీ బాలురు కేవలం పులివేషగాడినే పులియందురు. సిద్ధులు పామరుల గుర్తులు. అసురులను జయించిన దేవతలు, సర్వ క్షత్రియ సంహారము చేసిన పరశురాముడు ఆ మహిమ తమదేనని అహంకరించి గర్వభంగమును పొందలేదా. వీరి ద్వారా శ్రీదత్తపరబ్రహ్మమే ఆ మహిమలను చేసినదని గుర్తించలేకపోయారు గదా! లైటును వెలిగించినది కరెంటుగానీ, తీగెకాదు. ఎన్ని మహిమలు చేసినా సదా దాసభావముననున్న అవతారపురుషుడైన శ్రీహనుమంతుడు సర్వదా విజయము, సత్కీర్తిని పొందినాడు. మహిమల ద్వారా, తమ స్వార్థములను తీర్చుకొనుటకు, సొమ్ముల కాశించిన వేశ్యవలె భక్తిని నటించుచు, డబ్బుల కాశించి లారీలలో రాజకీయనాయకుని ప్రసంగమునకు తీసుకరాబడిన జనులవలె విశేష సంఖ్యలో భక్తులు చేరుదురు. అట్టి గులకరాళ్ళ గుట్టలు ఏల? శంకరాచార్యుని కడకు జిజ్ఞాసతో చేరిన శిష్యులవలె వజ్రముల వంటి నలుగురు సద్భక్తులు చాలరా? ఒకే సమయమున అనేక దత్తావతారములుండును. ఒకే సమయమున పరశురామ, శ్రీరామ అవతారములును, అక్కల్ కోట మహారాజ్, షిరిడీసాయి అవతారములున్నవి. నేనే దత్తుడనువాడు అవివేకి. శ్రీదత్తుడు చేసిన మహిమలను నేనే చేసితినని పలుకువాడు మూర్ఖుడు. ఒకే సమయమున అనేకావతారముల ద్వారా, ఒకే దత్తుడు అనేక రకముల మహిమలను చేయును. ఒకే సమయమున అనేక తీగెలద్వారా ఒకే విద్యుత్తు, లైటును వెలిగించి, రేడియోను మ్రోగించి, ఫ్యానును త్రిప్పుచున్నది.
స్వామి
(ౙన్నాభట్ల వేణుగోపాల కృష్ణమూర్తి)
★ ★ ★ ★ ★