home
Shri Datta Swami

 23 Jul 2025

 

Telugu »   English »  

శివలహరి - 12

శ్రీ ఫణిని ఆవేశించి స్కూటరు నడుపుట.

శ్రీ ఫణి ఒకరోజు ఒక పరీక్ష వ్రాయబోతూ ఆ ముందు స్వామికి మనవి చేసుకున్నాడు. స్వామి, ఆశీస్సుల నీయకుండా "కర్మ ఫలముల ననుభవించక తప్పదు. నేనేమియు జోక్యము చేసుకొనను. ఆ విధముగా ఈ పరీక్షలో సాయపడలేను" అన్నారు. మరురోజు పరీక్షకు వెళ్ళి హాలులో కూర్చొనగానే ఫణికి విపరీతముగా జ్వరము వచ్చి బుద్ధి స్వాధీనము తప్పిపోయి పరీక్ష వ్రాయలేక వెంటనే బయటకు వచ్చినాడు. శరీరము కాని మనస్సు కాని అతని స్వాధీనములో లేవు. స్వామిని ప్రార్థించాడు. “స్వామీ! నాకు ఒళ్ళు తెలియటం లేదు. కళ్ళు తిరుగుతున్నాయి. నీవే నా స్కూటరు నడపాలి స్వామీ!” అని స్కూటరుమీద బయలుదేరినాడు. స్వామి! అతడిని ఆవేశించి వాని ఇంటివరకు తీసుకువెళ్ళారు. ఫణి స్కూటరు దిగగానే ఫణి నుండి స్వామి తొలగినారు. అంతే! స్కూటరు ఒక వైపుకు, ఫణి మరియొక వైపుకు పడిపోయినారు. ఏమిటిది అని ఇంట్లో వారు చూచి, పరుగు పరుగున వచ్చి ఫణిని తీసుకొని వెళ్ళి ఆసుపత్రిలో చేర్చారు. స్వామి అనుగ్రహము వలన ఫణి క్రమముగ స్వస్థుడయ్యెను. “ఫణి ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలియజేయుటకే అట్లు చేసినాను. స్కూటరు దిగగానే పడిపోయేవాడు స్కూటరు నడుపగలడా?” అన్నారు స్వామి. ఏమీ! నేను ఉపేక్షింతునా? అన్న శ్రీదత్తప్రభువుల దివ్యవాణి సార్థకము గదా!

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch