24 Jul 2025
శ్రీసాయికి శ్రీదత్తస్వామికి భేదము లేదు
[శ్రీమతి పూర్ణ]
రాజమండ్రిలో నివసించు శ్రీమతి పూర్ణ స్వామి భక్తురాలు. స్వామిని దర్శించక చాలా కాలమైనందున, స్వామిని దర్శిస్తానని ఫోన్లో సోమవారం కోరినది. రాజమండ్రికి వచ్చిన స్వామి బుధవారం రమ్మన్నారు. సరేనని ఈలోగా, మంగళవారం రోజున ఒక షిరిడీసాయి భక్తురాలి వద్దకు పూర్ణ వెళ్ళినది. ఆ భక్తురాలిని షిరిడీసాయి ఆవేశిస్తారు. ఆవిడతో బుధవారం స్వామిని దర్శించటానికి పోతున్నానని పూర్ణ చెప్పినది. "సరే పొమ్ము. స్వామి దర్శనమిస్తాడు. కానీ ఇక నుండి నీ పూజా మందిరంలోనే కూర్చుని ధ్యానించుము. స్వామి అంతటా ఉన్నాడు" అని ఆ భక్తురాలి ద్వారా అన్నారట. పూర్ణ సరేనని అలానే స్వామి కోసం ఇంటి గడప దాటనని చెప్పినది. వాగ్దానమును చేయమన్నారట షిరిడీశాయి. అలానే చేసి పూర్ణ బుధవారం స్వామిని దర్శించటానికి వచ్చింది. పూర్ణను చూడగానే స్వామి తన ఫొటోనిచ్చి పూజించమని చెప్పుతూ "ఇక నుండి నా వద్దకు రానవసరము లేదు. ఇంటి గడప దాట పని లేదు. నీ పూజా మందిరంలోనే స్వామి ఉన్నారు. కృష్ణదత్తునికి, షిరిడీ సాయికి భేదము లేదు. సాయికి వాగ్దానము చేస్తే కృష్ణదత్తునికి వాగ్దానం చేసినట్లే. ఇరువురు పరమాత్మలు లేరు. ఒక్కడే పరమాత్మ" అని చెప్పినారు. ఇన్ని సంవత్సరాలలో స్వామి ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు అని మొదట పూర్ణ ఆశ్చర్యపడినా, క్రిందటి రోజు షిరిడీ సాయికి చేసిన వాగ్దానమును గుర్తు తెచ్చుకుని స్వామి సర్వజ్ఞత్వమును స్తుతించినది.
★ ★ ★ ★ ★