home
Shri Datta Swami

 30 Jul 2025

 

శివలహరి - 19

ఒకే సమయంలో రెండు ప్రదేశములందుండుట.

2001 సం. దత్తజయంతినాడు ఒక పెద్ద కుక్క మేడ పైకి హుటాహుటిగా వచ్చి స్వామి పాదాలపై తల ఉంచి నమస్కరించి ప్రదక్షిణము కావించి, స్వామి పాదాల వద్ద కూర్చున్నది. ఆ విచిత్రాన్ని ఫొటో కూడా తీశారు. ఆ ఫొటోను చూచి స్వామి ధర్మపత్ని శ్రీమతి కుమారి వేళాకోళంగా స్వామితో “ఈ విధంగా కుక్కను కూర్చుండ బెట్టుటకు మీ భక్తులు ఈ కుక్క చేత ఎన్నాళ్ళు రిహార్సల్సు చేయించారో!” అన్నారు. స్వామి యథాప్రకారంగా చిరునవ్వు చిందించారు.

డిసెంబరు 21 న స్వామి పనిచేయుచున్న కాలేజీ వార్షికోత్సవము రోజు. మరునాడు పగలు (22వ తేదీ) గుంటూరులో ఉండి సాయంత్రం 6 గం॥ కు ఇంటికి వస్తున్నానని స్వామి ఇంటికి ఫోన్ చేశారు. కానీ మరునాడు కాలేజీకి సెలవు ఇవ్వనందున స్వామి మరునాడు సాయంత్రం 6 గం॥ల వరకు గుంటూరులో ఉండిపోయినారు. ఆరోజు 6 గం. – 8 గం. వరకు 40 మంది కల భక్తసమూహానికి స్వామి ఉపన్యాసమిచ్చినారు. అయితే, అదేరోజు అదే సమయమున తాను ఫోన్ చేసిన ప్రకారముగా నరసరావుపేటలో స్వామి ఇంటికి వచ్చియున్నారు! ఇది ఇంట్లో అందరూ చూసినారు. స్వామి హఠాత్తుగా బయటనుండి మాయమైనారు. ఆనాడు నరసరావుపేటలో ఒక కాలేజీ వార్షికోత్సవము జరుగుచున్నది. స్వామి దానికి వెళ్ళినారని అందరూ భావించినారు. కాని ఇక్కడ గుంటూరులో స్వామి ఆ రోజు ఉపన్యాసమిచ్చిన తరువాత అక్కడే (22 వ తేదీ) నిద్రించి, 23వ తేదీ ఉదయం ఇంటికి వచ్చినారు. “నిన్న రాత్రి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినారు?” అని కుమారి ప్రశ్నించుట, స్వామి ఆ సమయంలో గుంటూరులో ఉన్నానని నిరూపించుటతో కుమారి ఆశ్చర్యంతో నిర్ఘాంతపోయినారు! స్వామి చిరునవ్వుతో “ఇదీ రిహార్సల్ అంటావా?” అని కుమారిని అడిగినారు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch