home
Shri Datta Swami

 01 Aug 2025

 

శివలహరి - 21

స్వామి సర్వవ్యాపి.

[శ్రీ ఆంజనేయులు, శ్రీమతి సుజాత డి. ప్రసాద్, శ్రీమతి సుందరి ప్రభాకర్, శ్రీమతి మాలతి]

కృష్ణలంకలో శ్రీమతి సుజాత, శ్రీమతి సుమతి, శ్రీమతి సుందరి అను భక్తులు స్వామిపై పూర్ణవిశ్వాసమున్నవారు. సుజాత తల్లిగారు స్వామిని దర్శించిన (కృష్ణ భక్తురాలు) ప్రతిసారీ “సమయానికి తగు మాటలాడెనే” అనే పాటను స్వామితో పాడించుకొని ఆనందించేది. ఆమె ఇంట్లో వివాహమునకు రమ్మని స్వామిని అర్థించినది. కానీ స్వామి రాలేదు. ఆమె ఎంతో బాధతో మనస్సులో స్వామి రాలేదని ఆలోచిస్తూ కూర్చున్నది. ఆ సమయంలో మేళగాళ్ళు కూర్చుని ఏవో పిచ్చాపాటి మాటలాడుకుంటున్న వారల్లా హఠాత్తుగా లేచి వాద్యములను తీసుకొని “సమయానికి..” అనే కీర్తనను అద్భుతంగా వాయించినారు. ఆమె దానితో స్వామి వచ్చారని సంతృప్తి చెందినది. అయినా, సుజాత మాత్రము భోజన సమయంలో స్వామి రాలేదని బాధపడెను. వెంటనే ఆమె నుదుటి మీద ఎర్రని కుంకుమరేఖ తిలకము గోచరించెను. స్వామి ఎప్పుడూ భక్తులకు అలానే తిలకమును పెట్టుతారు. ఆమె కుమారుడు మౌళి వెంటనే అమ్మా! స్వామి వచ్చారా? నీ నుదుటిపై కుంకుమరేఖ పొడవుగా ఉన్నదే” అని స్వామి వచ్చినారన్న విషయమును సూచించినాడు. సుజాత నమ్మలేక అద్దము చూసుకొన్నది. పరమానంద భరితురాలైనది. అలా మౌళి ద్వారా మాటలాడినది స్వామియే గదా!

ఒకసారి సుమతికి శ్రీ వెంకటేశ్వర విగ్రహములో స్పష్టముగా స్వామి కనపడినారట. ఎంతో సంతోషించినది.

ఒకసారి సుందరి పెండ్లి పిలుపుతో బయలుదేరి నరసరావుపేటకు వెడుతూ స్వామికి నమస్కరించగా “నీవు పోవలసినదేనా? ఏదో ఒక సాకుతో ఈ ప్రయాణము మానుకోరాదా? ” అన్నారు. “సరే, పొమ్ము” అని మరల కొంత ఆలోచించి అన్నారు. వెళ్ళిన సుందరి మేడమెట్ల మీద జారిపడగా కాలికి దెబ్బ తగిలింది. అయితే అచట ఒక దత్తభక్తునితో దత్తసత్సంగము నిర్విరామంగా జరిగి ఎంతో ఆనందించినది. స్వామి తరువాత చెప్పినారు – “నిన్ను ఆపి ఉన్నట్లయితే ఈ కర్మఫలం వడ్డీతో కలిపి మరుజన్మలో యాక్సిడెంటు వలన కాలు పూర్తిగా విరిగిపోవును. మరియు ఆ సత్సంగము జారి పోవును కదా అని పొమ్మన్నాను”.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch