02 Aug 2025
రుద్రాభిషేకముతో వర్షము కురియుట.
నాగులవరం గ్రామంలో స్వామి 15 సం॥ వయస్సుగల బాలుడుగా ఉన్నప్పుడు ఒక సంవత్సరము కరువు వచ్చెను. వాన చినుకు కూడ పడదయ్యెను. ఊరిలోని బ్రాహ్మణులు పూజలు, అభిషేకములను చేసినా ఉపయోగము కనపడలేదు. ఒకరైతు స్వామితో “ఏం బాపనోళ్ళయ్యా? పూజలు, జపాలు చేసినా చినుకు పడలేదు” అని నిందించగా స్వామి బాధపడుచూ స్వయముగా ఉదయము నుండి బావిలోని జలముతో రుద్రాభిషేకమును చేయ ప్రారంభించెను. సాయంత్రము 3 గం|| అయినది. స్వామి అభిషేకమును ఆపడు. వాన చినుకు పడదయ్యెను. స్వామి పెదనాన్నగారు వచ్చి “నాయనా! లేచి భోజనము చేయరా! అంత పట్టుపట్టరాదురా” అని బ్రతిమలాడెను. కానీ స్వామి ఆ మాటను వినకుండ అభిషేకమును సాగించెను. సాయంత్రము 4 గం|| అయినది. అద్భుతం! ఆకాశమున కాలమేఘములు ఆవిర్భవించి వర్షము ఆరంభమయ్యెను. అప్పటికి గానీ స్వామి లేచి భోజనము చేయలేదు. ఆ వర్షము కుంభవృష్టియై చెరువు నిండి అలుగులు వారెను. దీని భావమేమనగా చేసే పూజలలో భక్తి ప్రధానమని స్వామి అందరికీ బోధించెను. “భక్తి లేక వృథ పూజలు జపములు - ప్రేమయె మార్గము ఓరన్నా” అని స్వామి భజన పాటలోని చరణమును స్మరింతుముగాక.
★ ★ ★ ★ ★