home
Shri Datta Swami

 04 Aug 2025

 

శివలహరి - 24

మహిమల గురించి బోధ.

నేను నా శ్రీమతి ఒకనాటి రాత్రి ఎంతో ఖేదంతో స్వామిని ఇలా అడిగినాము - “స్వామీ! మీరు అందరికీ మహిమలను చూపిస్తున్నారు, మాకు తప్ప. మేము దత్తసేవ ఎంతో చేస్తున్నామని మీరే పొగుడుతుంటారు అందరి ముందు! మాపై ఏల ఈ చిన్నచూపు? మాకేల మహిమను చూపరు?” అని. స్వామి చిరునవ్వుతో ఇలా అన్నారు. "కాలభైరవుడు వ్రాసిన ప్రణాళికపత్రం ప్రకారమే అంతా జరుగుతుంది. మీకు అంతిమక్షణంలో మా దర్శనం వల్ల మా స్మరణం కలిగి మీరు ముక్తులౌతారు. అయితే ఆ క్షణం తరువాత దర్శనం కలిగిందనీ, కలుగలేదనీ చెప్పే అవకాశము ఉండదు. కావున సంశయము రావచ్చును. నేను కాలభైరవుని ఒప్పిస్తాను. ఆ దత్తదర్శనం ఈ క్షణంలోనే ఇస్తాను". అన్నారు స్వామి.

దానికి మేము ఇలా అన్నాము. “వద్దు స్వామీ! మీపై మాకు పూర్ణవిశ్వాసమున్నది. అంత్యక్షణ దర్శనము ముక్తిదాయకము. దానిని ఇప్పుడే పొంది ముక్తిని పోగొట్టుకొనజాలము” అని అన్నాము. అప్పుడు స్వామి ఇలా అన్నారు “శంకరాచార్యులు తలుపులు మూసి ఉన్నా లోపలకు ప్రవేశించినారు. దానిని చూసి శ్రాద్ధము పెట్టుచున్న మండనమిశ్రుడు కానీ, భోక్తలుగా వచ్చిన వ్యాస, జైమినులు కానీ శంకరులను గౌరవింపలేదు. మహిమలు వారికి బ్రహ్మవిద్య కావు. రాక్షసులు, క్షుద్రమాంత్రికులు సైతము వాటిని ప్రదర్శింతురు. శంకరులు చేసిన 21 రోజుల జ్ఞానచర్చకు వారు ముగ్ధులైనారు. మండనమిశ్రుడు పాదాక్రాంతుడై శిష్యుడైనాడు. కావున జ్ఞానరత్నముల ముందు మహిమలు గులకరాళ్ళు. మీకు నేను ఎల్లప్పుడును జ్ఞానరత్నములనే ఇచ్చి యున్నాను. మీ చేత జ్ఞానప్రచారమునే చేయించి ఉన్నాను. మీ స్థాయి అది అని తెలుసుకొనుడు. మీరు నేనిచ్చిన రత్నరాశులకు ఆనందము చెందక, గులకరాళ్ళ కోసము అర్థించినచో ఎంత పామరస్థాయికి వస్తారో ఆలోచించుకొనుడు. విష్ణుదత్తుడవై, శ్రీనరసింహసరస్వతి శిష్యుడవైన నీ స్థాయి ఎంత ఉన్నతస్థాయి! భక్తి-జ్ఞానప్రచారములకే నిన్ను నేను అవతరింప చేసితినని తెలియుము” అన్న స్వామి వాగమృత గంగాధారతో మాకున్న కాస్త భ్రమా తొలగిపోయినది. శంకరాచార్యుల కులచాదస్తభ్రమను స్వామి కాశీలో తొలగించిన గురువుల గురువు కదా! మా కర్తవ్యమును తెలుసుకొని నాటి నుండి జ్ఞాన - భక్తి ప్రచారములను తీవ్రముగా చేయుచున్నాము. మేము ధన్యులమైతిమి.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch