05 Aug 2025
భక్తురాలికి అత్యుత్తమమైన గోలోకమును చూపించుట.
చంద్రశేఖర్ గారు, గాయత్రిగారు, వారి పిల్లలు ప్రియాంక, మానసలతో స్వామిని దర్శించుటకు కువైట్ నుండి వచ్చినారు. చంద్రశేఖర్ వారి మొదటి అనుభవమును ఇట్లు వచించినారు. "స్వామికి ఫోన్ ఎన్నిసార్లు చేసినా, వేలలో కావలసిన బిల్లులు, 5-10 రూ॥ల లోగానే వచ్చినవి!" స్వామి, ఆ కుటుంబముతో కోట్ల జన్మల బంధమున్నదని చెప్పినారు. ఆ కుటుంబము కూడ స్వామిపై అట్లే అపారప్రేమతో ఉండిరి. స్వామి, వారితో 24 రోజులు రాత్రులంతా మేల్కొని భాషించినారంటే స్వామి ప్రేమ వర్ణనాతీతము కదా!
ఇక గాయత్రి గారు స్వామిభక్తిలో పరాకాష్ఠకు చేరియున్న మహాభక్తురాలు. ప్రియాంకను మీరావేషంలో ఫొటో తీయమన్నారు స్వామి. అంతా సిద్ధమైనది. స్వామి కృష్ణకీర్తన పాడినారు. అంతే! ప్రియాంక అలౌకికమైన సమాధిస్థితిని పొందినది, స్వామి పాడిన మొదటి చరణంలోనే! ఆమెకు రెండవ చరణము కూడా వినిపించలేదట. ఆమె శబ్దము వినపడని స్థితిలోనికి పోయినది. కొంత సమయము తరువాత లౌకిక స్థితిలోనికి వచ్చినది ప్రియాంక. ప్రియాంక ఏమీ చెప్పకముందే, స్వామి “ఈమెను గోలోకానికి తీసుకుపోయాను. ఆకాశమును దాటి తరువాత చీకటిలోనికి ప్రవేశించినది. అదే విశ్వలయస్థితి. ఆ తరువాత, అద్వైతానంద యోగిరాజ దత్తలోకమైన సత్య బ్రహ్మలోకము. దానిపైనున్నది గోలోకము. ఆ గోలోకము మాధుర్యమిళితమైన బ్రహ్మానందముతో నుండు రాధాకృష్ణ లోకము. ప్రియాంక సత్యలోకమును దాటి రెప్పపాటు కాలము మాత్రమే అక్కడ ఉన్నది. మరొక రెప్పపాటు కాలము అచట నున్నచో మరల తిరిగిరాదు. అందుకే, పైకి పోవునపుడు (ఆరోహణము) మధ్య స్థితులు ఆమెకు గోచరించినా, దిగి వచ్చునపుడు (అవరోహణము) ఎంతో వేగంగా వచ్చినందున మధ్య స్థితులు గోచరించలేదు” అని అన్నారు. ప్రియాంక తన అనుభవాన్ని ఇలా చెప్పినది. “స్వామి చెప్పినది సత్యము. స్వామి పాడిన పాటలో మొదటి చరణము తరువాత ఏ శబ్దమూ వినపడని స్థితిలో ఆకాశాన్ని దాటి పోయాను ("శబ్దగుణక మాకాశం" - శబ్దము ఆకాశగుణము అన్నారు స్వామి). ఆ తరువాత గాఢాంధకారము. హృదయమంతా ఎంతో బరువెక్కింది. ఎంతో మాధుర్యం గల ఆనందాన్ని రుచి చూసాను. తిరిగిరావటం హఠాత్తుగా వచ్చాను. వచ్చిన తరువాత ఈ లోకం అంతా కలుషితమైన చెత్తకుండీలాగా, మనుష్యులందరూ ఈగల్లాగా కనిపించినారు!” అని చెపుతూ , “ఎందుకు తీసుకవచ్చారు నన్ను క్రిందకు?” అని స్వామితో దెబ్బలాడింది. “24 రాత్రులు నీవు స్వామి వైపే చూస్తూ అశ్రుధారలతో తపస్సు చేసావు. అందుకే ఆ ఫలాన్ని ఇచ్చాను. గోలోకం పైన మరియొక లోకం లేదు. అది అత్యుత్తమ ఫలము. ఈ అవతారంలో నేనింతవరకు ఈ అత్యుత్తమ ఫలాన్ని ఎవరికీ ఈవ్వలేదు. ఆధ్యాత్మికములో అత్యుత్తమ ఫలాన్ని పొందినావు. అలానే ఐహికంలో నీ కర్తవ్యాలను నెరవేర్చటంలో కూడా ప్రథమ స్థానాన్ని పొందు” అని కువైట్లో 11వ తరగతి చదువుచున్న ప్రియాంకను స్వామి ఆశీర్వదించినారు.
★ ★ ★ ★ ★