06 Aug 2025
భక్తురాలి తలనొప్పిని తీసుకొనుట
[గురువారము రాత్రి 26-09-2002] మంగళగిరిలో సీతమ్మగారింటికి వచ్చారు స్వామి. సీతమ్మగారి కోడలు భావన విపరీతమైన శిరోవేదనతో మధ్యాహ్నం నుండి విలవిలలాడుతూ ఏడుస్తున్నది. ఔషధములు పని చేయలేదు. స్వామి వారు తన సంచీలో నుండి శొంఠికొమ్మును సాది గంధమును తలకు వ్రాయమన్నారు. సీతమ్మగారు శొంఠి గంధమును తీయుచున్నది. భావన వచ్చి స్వామి పాదములకు నమస్కరించినది. స్వామి విభూతిని భావన నుదుటికి వ్రాసినారు. వెంటనే ఆమెకు శిరోవేదన అదృశ్యమైనది. భావన “శొంఠిగంధం తీయవద్దు, నెప్పి పోయింది” అని సంతోషముతో కేకలు పెట్టసాగింది. అప్పుడు స్వామి అన్నారు "ఆపవద్దు. శొంఠి గంధమును తీయండి. నాకు విపరీతమైన శిరోవేదనగా ఉన్నది" అన్నారు. భావన దీనంగా "స్వామీ! నా తలనొప్పిని తీసుకున్నారా?" అన్నది. స్వామి "అవును. ఎవరో ఒకరు అనుభవించవలసినదే. నీకు జరిమానా శిక్ష పడినపుడు నీవు కట్టలేక బాధపడుచున్నచో, నీవారు దానిని కట్టి నిన్ను విడిపించుచున్నారు గదా. అలానే, స్వామియు తన భక్తుల కర్మ ఫలాలను తాను అనుభవించి వారిని కర్మవిముక్తులను చేయుచున్నాడే తప్ప వాటిని రద్దు చేయడు. ఈ రహస్యమును తెలియని వారు స్వామి తన అధికారశక్తితో మన కర్మఫలములగు కష్టములను రద్దు చేసినాడని భావించుచున్నారు" అని బోధించినారు.
★ ★ ★ ★ ★