07 Aug 2025
కాలభైరవుని శాసనము
[02-10-2002]
రెండు నెలలనుండి వాన చుక్కలేదు. "భగవంతుని విస్మరించినందున వానలు పడవని ఒక ఎద్దు మనుష్యభాషలో మాట్లాడి మరణించినది" అని నరసరావుపేటలో ఒక వార్త బయలుదేరినది. అపుడు స్వామి “అది కాలభైరవుని శాసనము” అని పలికినారు.
స్వామి గతంలో విజయవాడలో గ్రీష్మ ప్రతాపమును శమింపచేయుటకు వరుసగా 2 సం॥లు భజన చేయించి అప్పటికప్పుడే వర్షమును కురిపించుట యీ గ్రంథములో వివరించినాము గదా. ఆ సమయంలో “కాల, కర్మ చక్రాలలో ఇక జోక్యం చేసుకోనని, అది సరియైనది కాదు” అని భక్తులకు హితవు కూడ చెప్పినారని చెప్పినాము గదా.
ఇపుడు భక్తులు వర్షంకోసం తహతహలాడుచున్నారు. స్వామి తాను జోక్యం చేసుకోనన్న మాట తప్పరు. ఈ సమస్యకు స్వామి పరిష్కారాన్ని ఆలోచించినారు. స్వామి ఒక నిర్ణయానికి వచ్చినట్లు గోచరించినారు. వెంటనే భక్తులచేత “శ్రీదత్తదేవం...” భజనతోను “భవానిశంకర…” నామాల భజనతోను, శివలింగమునకు అభిషేకము చేయించినారు! ఇక ఆజ్ఞ ఇచ్చినారు స్వామి. భజన పూర్తికాగానే స్వామి కాలభైరవునితో వాదించిన ప్రకారమిట్లున్నది. (స్వామి చెప్పగా తెలుసు కొన్నది).
కాలభైరవుడు: స్వామీ, మీరు కాల కర్మలలో జోక్యం చేసుకొననని మాట ఇచ్చి, మరల ఇదేమి, ఇలా చేసినారు? నేను ఆ వృషభరూపంలో వానలు కురవవని ప్రకటించినాను గదా! ఇది ఏమిటి స్వామీ?
స్వామి: వెనుక నేను చేసిన భజనకు గదా వర్షము వచ్చినది. ఇప్పుడు భజన నేను చేయలేదు కదా. కావున నేను మాట తప్పలేదు. అయితే, నా భక్తుల భజనకు ఇప్పుడు ఫలము రావలయునుగదా. నాకన్న, నాకు నా భక్తులెక్కువని నీకు తెలియని విషయమా? భక్తుల పరాభవమును నేను సహించలేను గదా. స్వామి భక్తుడవైన నీవు ఈ విషయమును కొంచెమూ ఆలోచించకున్న ఎట్లు?
ఈ వాదనతో కాలభైరవుడు చాల ఆనందించినాడు. అప్పుడే హఠాత్తుగా వచ్చిన మెరుపులతో వర్షము పడినది! ఇక అప్పటినుండి వర్షాలు ప్రారంభమైనవి.
భజన సమయములో సీతమ్మగారికి స్వామి సింహాసనాసీనుడై విష్ణువేషంలో కనపడి చేతి నుండి ప్రవహించు గంగతో శివలింగమునకు అభిషేకము చేయుచున్నట్లును, శంకరుడు, గౌరితో, సుబ్రహ్మణ్యునితో “ఆ భజన ఎంత బాగున్నదో చూడండి” అని చెప్పుచున్నట్లును కనిపించినది. ఆమె మిగిలిన భక్తులకు చెప్పగా విని ఆనందంతో, ఆ అమృతవర్షంలో తడుస్తూ “శ్రీ దత్త దేవం...” భజన పాడుతూ నృత్యము చేసినారు!
★ ★ ★ ★ ★