08 Aug 2025
స్వామి హృదయంమీద శివలింగము దర్శనమిచ్చుట
[29-09-2002]
నరసరావుపేట, బ్యాంక్ కాలనీ వాస్తవ్యురాలు శ్రీమతి భారతీదేవి ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్టు. ఆమె స్వామి ఇంటికి ప్రతి ఆదివారము సత్సంగములకు వచ్చేది. ఆమె స్వామితో ఒక వారము “స్వామీ! మీరు విజయవాడ భక్తులకేనా మహిమలు చూపుట. మాకు చూపరా?” అని దెబ్బలాడినది. అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వినారు. అంతే! ఆమెకు స్వామి హృదయంమీద దివ్యకాంతితో శివలింగము దర్శనమిచ్చినది. ఆ లింగము పెరుగసాగినది. స్వామి ధరించిన లాల్చీ హృదయము మీద ఎత్తుగా లేచినది. ఆ అద్భుత దర్శనంతో ఆమె స్తంభించి లేచి స్వామి ముఖమును చూచినది. స్వామి ముఖము మీద 3 కాంతి చారలు కనిపించి క్రమంగా దివ్య తేజస్సుతో 3 ముఖములు కనిపించినవి! దానితో ఆమె పరవశించి నమస్కరిద్దామనుకొనుచుండగా, స్వామి చేతిలో పంచరంగుల విష్ణుచక్రం మహావేగంతో తిరుగుతూ దర్శనమిచ్చినది. ఆ వేగము ప్రపంచములో ఏ వస్తువుకూ లేదట! ఆ చక్రం అంచు నొక్కులతో ఉండి అంచునందు ఎరుపు - నీలం - తెలుపు రంగులు మాత్రమే ఉన్నవి. ఆ చక్రం మీద ఆమె దృష్టి 15 ని॥లు ఉన్నది. కనురెప్ప మూతపడలేదు. ఇది కంటి భ్రమకాదు గదా అని సంశయించి, దగ్గరకు వచ్చి ఆ చక్రం మధ్యభాగములోకి చూపుడువ్రేలును దించినది. ఆ వ్రేలు కరెంటు షాకును పొంది స్తంభించి స్పర్శను కోల్పోయినది. జిల్లు, జిల్లుమని నరాలు లాగనారంభించినవి. దానితో ఆమె అరగంట పాటు మూర్ఛనొందినది. ఉపచారములు చేయగా తేరుకొన్నది. తరువాత స్వామి పాదములవద్ద రెండు టెంకాయలను కొట్టి అందరకీ ప్రసాదమునిచ్చినది. "నీవు హృదయములో శివలింగమును, ముఖములో బ్రహ్మవర్చస్సును, చేతిలో విష్ణు చక్రమును చూచినావు ఒకేసారి! ఆ చక్రములోని పంచరంగులే పంచభూతములు. అదియే కాల-కర్మ-సృష్టిచక్రము. చక్రము యొక్క శక్తి అంతయు అంచులోనుండును. అంచులో కనిపించిన 3 రంగులే త్రిమూర్తులగు శ్రీదత్తశక్తి" అని స్వామి బోధించిరి. ఆమె విజయవాడ భక్తులకు ఫోన్లు చేసి మరునాడు కూడ ఆ చూపుడు వ్రేలు అలానే స్తంభించియున్నదని తెలిపినది. "బ్రహ్మ తేజము - విష్ణుచక్రము - శివలింగమును చూపియుంటిని" అన్న ఈ భజన (భక్తిగంగ స్వామి భజనల లోనిది) నిరూపణమును ఈ దర్శనము ద్వారా శ్రీమతి భారతీదేవి గారికి అనుగ్రహించినారు స్వామి! ఆమె ధన్యురాలు.
★ ★ ★ ★ ★