
21 Oct 2025
Updated with Part-2 on 22 Oct 2025
Part-1
[11-12-2002] శ్రీ దత్తుని శివస్వరూపమే శంకరులుగా అవతరించినది. అప్పటి పరిస్థితులు చాలా దారుణముగా ఉండెను. అందరును భౌద్ధమతమును స్వీకరించిరి. బుద్ధుడు కూడా దత్తావతారమే. బుద్ధుడు అవతరించిన సమయమున తత్త్వవిచారణ లేక కేవలము యజ్ఞములను చేయుచు యజ్ఞములలో పశువులను వధించుచున్న రోజులవి. బుద్ధుడు పశువధలనే కాక యజ్ఞములను కూడ మాన్పించినాడు. ఏలననగా దానయోగ్యులగు వారి జఠరాగ్నిలో హుతము చేయవలసిన శ్రేష్ఠమగు ఆహారమైన ఆవునేతిని అగ్నిలో పోసి అంతరార్థము తెలియక వాతావరణ కాలుష్యమును పెంచుచున్న కాలమది. జ్ఞానము అను అగ్నిలో కోరికలు అను ఆజ్యమును హుతము చేయవలసిన బ్రహ్మ యజ్ఞమును చేయక తత్త్వవివేక శూన్యులై మూఢులై దురహంకారులైయున్న కాలమది. "కామ ఆజ్యం మన్యుః పశుః" అని శ్రుతి చెప్పుచున్నది. అనగా జ్ఞానము అను అగ్నిలో కోరికలను ఆజ్యమును హుతము చేయవలెను. మరియు మన్యువును అనగా మొండితనముతో కూడిన మూర్ఖత్వము గలిగిన పశువును అనగా తన పశుత్వమును అని తెలియవలెను. ఇది తెలియక కోరికలతో, మూర్ఖత్వముతో యజ్ఞములను చేసిన రోజులవి. అందుకే బుద్ధుడు సర్వ దుఃఖములకు కారణమైన కోరికలను త్యజించమన్నాడు. యజ్ఞములను, పశువధలను మాని అన్నార్తులైన ప్రాణుల యొక్క జఠరాగ్నిలో ఆహారమును హుతము చేసి కరుణను కలిగి దైవత్వమును సాధించమని బుద్ధుడు బోధ చేసినాడు. తర్కమునకు సైతము అందని భగవంతుని విషయమున బుద్ధుడు మౌనము వహించినాడు. ఏలననగా వాక్కుకు పరబ్రహ్మము అందదు. ఇట్లు బ్రహ్మమును గురించి వివరించలేమని మౌనము ధరించువాడే ముని. మౌనము చేతనే పరబ్రహ్మ తత్వమును చెప్పవలెననే శంకరులు "మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వమ్" అని అన్నారు. బుద్ధుడు భగవంతుని విషయమున మౌనము వహించినాడు. ఈ మౌనమునకు అర్థము భగవంతుడు లేడని బుద్ధుని అభిప్రాయమని శిష్యులు అపార్థము చేసుకున్నారు. అందుకే బౌద్ధులందరు నాస్తికులైనారు. పశువధ ఆగినను నాస్తికత్వమను పెద్ద ప్రమాదము వచ్చినది. సన్నిపాత జ్వరము శాంతించి పక్షవాతము వచ్చినట్లైనది. ప్రతి అవతారమునకు ఇదే గతి పట్టుచున్నది. ఆయన చెప్పేదొకటి జీవులు చక్కగా వక్రీకరించి ఆచరించునది మరియొకటి. అందుకే ఆయన అవతారములను ఎత్తి ఎత్తి విసుగు జనించి చివరకు కంఠశోషయే మిగిలినది అన్నాడు.

ఈ నాస్తికత్వమును నివారించుటకు శ్రీ దత్తుడు శంకరులుగా అవతరించినారు. నాస్తికత్వములో అహంకారము విపరీతముగా యుండును. అహంకారులైన బౌద్ధులను సరియగు దోవకు తీసుకునిరావలయునన్న చాలా కష్టము. దీని కొరకు శంకరులు తన మేథాశక్తినంతయు ఉపయోగించినారు. మదించి పరిగెత్తుచున్న ఒక వృషభమును ఆపుటకు దాని చిక్కమును పట్టుకొని, కొన్ని అడుగులు దానితో పాటు వేసి తరువాత ఒక అడుగులో దానిని నిలుపవలయును. దురహంకారులైన బౌద్ధుల విషయములో శంకరులు ఇదే పద్ధతిని ఉపయోగించినారు. బౌద్ధులలో మాధ్యమిక మతాచార్యుడగు నాగార్జునుడు శూన్యవాదమును స్థాపించినాడు. ఈ వాదము ప్రకారము అంతయును శూన్యమే. వారి మతము ప్రకారము మట్టిరేణువులను (mud atoms) విడదీసినచో కుండ శూన్యమగుచున్నది. ఒక మట్టిరేణువులోనున్న మట్టి పరమాణువును విడదీసినచో మట్టిరేణువు శూన్యమగుచున్నది. ఈ విధముగా మనము సృష్టిలోని పదార్థములను విడదీయుచు పోయినచో అంతయును శూన్యమే అగును. కావున జగత్తు శూన్యము. భగవంతుడును శూన్యమే. ఈ మతమును శంకరులు ఇట్లు ఖండించినారు.
Part-2
"ఓయీ! అంతయును శూన్యమే. కాని అంతయును శూన్యమే అని తెలియువాడు ఒకడుండవలయును గదా. అట్టి వాడు లేనిచో అంతయును శూన్యమేయని ఎట్లు చెప్పగలవు? కావున అంతా శూన్యము అని తెలియు చైతన్యము ఒకటి ఉన్నది అని అంగీకరించవలెను. ఈ వాదముతో బౌద్ధమతమును భారతదేశపు పొలిమేరలను దాటించి తరిమికొట్టినాడు. కావున ఈ భారతదేశములో భగవంతుడు ఉన్నాడు అను అస్తికత్వమునకు ఆదిగురువు శంకరులే. బౌద్ధ పండితుడైన దిఙ్నాగాచార్యుడు శంకర మతమును అంగీకరించి బౌద్ధమతమనే శూన్యవాద మతము నుండి ప్రజ్ఞావాద మతముగా మార్చినాడు. ప్రజ్ఞ యనగా చైతన్యము. చైతన్యము ఉన్నది అన్న వాదమే ‘ప్రజ్ఞావాదము’. శంకరుల గురువైన గౌడపాదులు జగత్తు శూన్యమనియు ఈ శూన్యమును గ్రహించు చైతన్యము అనగా ప్రమాత ఉన్నదనియు, ఈ జగత్తు అసలు పుట్టనే లేదనియు, కోరికల ద్వారా ‘అజాతి వాదము’ను స్థాపించినాడు. అజాతి అనగా పుట్ట లేదని అర్థము. కాని శంకరులు ఈ వాదమును కొంచెము సవరించినారు. జగత్తు పూర్తిగా లేదు అని అనరాదు. పూర్తిగా ఉన్నది అని అనరాదు. జగత్తు అసత్యము గాదు, సత్యము కాదు. ఈ రెండింటి కన్నను భిన్నమైనది. అనగా మిథ్య. "సదసద్ విలక్షణా మిథ్యా" అన్నారు శంకరులు. జగత్తులేదు అని ఆయన ఎప్పుడు అనలేదు. జగత్తు లేనిచో "స ఇదం సర్వమసృజత" అనగా పరమాత్మ ఈ జగత్తును సృష్టించెను అన్న శ్రుతి వ్యర్థము కావలసి వచ్చును.
మిథ్య అనగా అత్యల్పమైన సత్యము. నీ వంటి మీద ఒక చీమ ఉన్నప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను అందువే కాని ఇద్దరు జీవులము ఉన్నాము అని అనవు. కావున అత్యల్పమును అసత్యముగా పరిగణించ వచ్చును. నీలగతీసినచో (on doing analysis) సత్యమే. ఈ విధముగా బౌద్ధుల శూన్యవాదమును చాలా వరకు సంతృప్తి పరచినాడు. మొండిగా యున్న అజ్ఞానులను వారి మొండితనముకు చాలా దగ్గరగా యున్న మార్గము లోనికి మరలించుట సులభము. కావున జగత్తు అసలు లేదు అను బౌద్ధులను జగత్తు దాదాపు లేనట్లే అను వాదమునకు మార్చుట సులభము. వారిని వారి మొండి శూన్యవాదము నుండి మిథ్యావాదమునకు మరలించినాడు. అట్లే భగవంతుడు లేడు అను నాస్తికులను భగవంతుడు ఉన్నాడు అను మార్గమునకు తీసుకొనిరాలేము. ఏమీ లేదు అనువారికి దేవుడు ఉన్నాడు అని చెప్పినచో వినరు. వారిచే దేవుడు ఉన్నాడు అని ఎట్లు చెప్పించవలెను. “ఏమయ్యా! ఏమీ లేదని గ్రహించి చెప్పే నీవు ఉన్నావా? లేవా? అని అడగవలయును. నేను కూడా లేను అన్నచో మరి నేను లేను అని గ్రహించి చెప్పేవాడు మరియొకడు ఉన్నాడా? లేడా? ఉన్నాడని అంగీకరించక తప్పదు. ఏమీ లేదను వారి చేత కనీసము జీవుడు అను చైతన్యము ఉన్నది అని అంగీకరింప చేసినారు శంకరులు. ఆ జీవుడే అనగా ఆ చైతన్యమే భగవంతుడు. ఇప్పుడు చెప్పుము భగవంతుడున్నాడా? లేడా? భగవంతుడున్నాడని వాడు అంగీకరించక తప్పదు. ఈ విధముగా జీవుడు ఒకడు ఉన్నాడు అని స్థాపించునప్పటికే తల ప్రాణము తోకకు వచ్చినది. కావున ఆ పరిస్థితిలో జీవుడే బ్రహ్మము అనవలసి వచ్చినది.
★ ★ ★ ★ ★