home
Shri Datta Swami

 04 Oct 2025

 

శ్రీ కృష్ణ భగవానుని స్వరూపమే భగవద్గీత

Updated with Part-2 on 05 Oct 2025


Part-1   Part-2


Part-1

శ్రీ కృష్ణ భగవానుని ఒక్క స్వరూపమే భగవద్గీత. కృష్ణుడు అనగా ఆకర్షించువాడు అని అర్థము. ఆయన యొక్క అంతఃస్వరూపమే నారాయణుడు. నారాయణుడు అనగా జ్ఞానమునకు ఆధారమైనవాడు అని అర్థము. కావున ఆయన యొక్క నిజమైన ఆకర్షణ ఆయన ఎత్తిన భగవద్గీత మూలమునే యున్నది. ఆయన గోకులములో పుట్టి పామరులకు సైతము ఆనాటి వ్రజభాషలో ఎంతో విలువ గల జ్ఞానవాక్యములను చెప్పుచుండెడివాడు. ఆయన చెప్పిన వాక్యములే గీతలో శ్లోకములుగా వచ్చినవి. కృష్ణుడు ఎల్లప్పుడును తక్కువ వాక్యములనే పలుకుచుండెడివాడు. అయితే గోకులమున పుట్టిన గోపికలు పూర్వజన్మమున బ్రహ్మర్షులు కావున ఆయన చెప్పు తత్త్వవాక్యములకు ఎంతో ఆకర్షించబడి స్వామి వద్దకు వచ్చెడివారు. గోపికలకు ఉన్న శ్రద్ధ మిగిలిన యాదవులకు అంతగా ఉండెడిది కాదు. ఏలననగా ఆ యాదవులు సామాన్య జీవులు. కృష్ణుడు ఎప్పుడును హృదయాంతరముల స్పందిపజేయు మధురాతి మధుర గీతములను పాడుచు వాటిని మురళితో వాయించెడివాడు. ఆ గీతములన్నియును పరమాత్మనే లక్ష్యముగా చేసుకొని సత్యమైనభక్తిని బోధించెడి అమృతధారలుగా ఉండెడివి. ఆ గీతములన్నియును భగవత్‌ ప్రేమతో నిండియుండుట వలన వాటిని విని స్వామితో వంత పాడుచు గోపికలు మైమరచెడివారు. ఆ భక్తిగీతములతో గోపికలు బ్రహ్మానంద సముద్రమున మునిగిపోయెడివారు. ఇదియే బృందావనములోని రాసకేళి. రాసకేళి అనగా ఒక దివ్యమైన మధురాతి మధురమైన భజన. కాని నేడు రాసకేళి గురించి అవి ఏవో సినిమా డ్యూయట్‌ సాంగ్‌లని అపార్థము చేసుకొనుచున్నారు. అక్కడ ఉన్న కృష్ణుడు సాక్షాత్‌ పరమాత్మ. ఆ గోపికలు యుగయుగములు తపస్సు గావించిన బ్రహ్మర్షులు. అదియే వారి చివరిజన్మ. కృష్ణుడు ఆనాడు తాను వచించిన జ్ఞాన వాక్యములనే పాటల రూపములలో రాసకేళిలో పాడెడివాడు. అదియే “జ్ఞానము” మరియు “ప్రేమ” అను భగవంతుని రెండు కల్యాణగుణముల కలయిక. ఆ గోపికలు మహాపండితులైన ఋషులు. వారు జ్ఞానమును కఠినములైన వాక్యశాస్త్రముల ద్వారా అప్పటి వరకు చర్చించి వచ్చినవారు. వారు అప్పటి వరకు జ్ఞానమును వాక్యములలో మరియు శ్లోకములలో చర్చించెడివారు. ఆ వాక్యములే యజుర్వేదములు. శ్లోకములే ఋగ్వేదము. అదే జ్ఞానము మధురమైన గీతముల ద్వార ఉన్నపుడు సామవేదమగును. అందుకే కృష్ణుడు "వేదానాం సామవేదోఽస్మి" అన్నాడు. ఆయనకు జ్ఞానము మధురమైన ప్రేమయు చాల ఇష్టముగనుండును. కురుక్షేత్రములో ఆయన అర్జునునకు వినిపించినవి కూడా పాటలే. కావుననే దానిని “భగవద్గీత” అన్నారు.

Swami

భగవద్గీత అనగా భగవంతునిచే పాడబడిన గీతలు లేక పాటలు అని అర్థము. ఈ పాటలను ప్రతిదినము బృందావనమునందు గోపికలకు వినిపించినాడు. ఈ పాటలనే యమునా తటమున తమాల (గానుగ) వృక్షశాఖపై ఆసీనుడై ఏకాంతముగా మురళితో పాడెడివాడు. కావున ఆయన యొక్క వేణుగీత గాని రాసకేళిలో పాడిన పాటలు గాని భగవద్గీతా శ్లోకములే. భగవద్గీత రజోగుణముతో కూడిన అహంకారముతో నున్న క్షత్రియుడైన అర్జునుడికి చెప్పబడినది. అర్జునుడు కూడ పూర్వజన్మమున నరుడు అను ఋషియే. కాని క్షత్రియకులమున పురుషునిగా పుట్టినాడు. పార్థునికి కుల అహంకారము, లింగాహంకారము ఉన్నది. అంతే కాదు, తాను మహావీరుడన్న అహంకారము కూడ ఉన్నది. కావున పార్థునికి చెప్పిన భగవద్గీతలో కొంచము కాఠిన్యము ఎక్కువగా కనిపించుచు మిరపకాయ బజ్జీ వలె ఉన్నది. కాని గోపికలు స్త్రీ జన్మనెత్తి, గొల్లలను శూద్రకులమున పుట్టి, లింగాహంకారము కులాహంకారము లేక, సంపూర్ణ శరణాగతి చేసినారు వారు. కావున గోపికలకు చెప్పిన జ్ఞానగీతలు పంచదార రసగుల్లాల వలె నున్నవి. ఆ గీతల యొక్క నామధేయమే రాసకేళి. రాసము అనగా మధుర ప్రేమరసముతో నిండిన సముద్రము. కేళి అనగా దాని యందు ఈదులాడుచూ స్నానము చేయుట. ఆ సమయము స్వామి ఆపాదమస్తకము మధుర ప్రేమ స్వరూపమున ఉండెడివాడు.

 

Part-2

ఆ స్వరూపము గురించియే "మధురాధిపతే రఖిలం మధురమ్" అని అన్నారు. సాత్త్వికులైన బ్రహ్మర్షుల యొక్క జ్ఞానముతో కూడిన గోపికల మధురప్రేమ వాతావరణమే బృందావనము. జీవుని యొక్క గుణముల బట్టియే వాతావరణము మరియు స్వామి స్వరూపము కూడ ఉండును. పార్థుని యొక్క గుణముల బట్టియే కురుక్షేత్ర వాతావరణమున గీతను చెప్పవలసి వచ్చినది. రజోగుణము అహంకారమయమైన యుద్ధ వాతావరణమున స్వామి కూడ పాంచజన్య శంఖమును పూరించుచు రణోత్సాహముతో వీరావేశముతో పరుష స్వభావముగానున్నారు. గుణమును బట్టియే మనస్సు మరియు వాతావరణము మరియు దానికి అనుగుణముగా వాక్కు ఉండును. మరి ఆనాటి రాసకేళి గ్రంథమును వ్యాసుడు ఏల గ్రంధస్థము గావించలేదు. అది ద్వాపరయుగాంతము. అతి స్వల్పకాలములోనే కలియుగము రాబోవుచున్నది. ఆ రాసకేళి గీతముల శ్రవణము చేయు అర్హత గల జీవులు లేరు. అందరును రజోగుణముతో అర్జునుని తాత ముత్తాతల వంటి జీవులు ఉన్నారు. కావున ఈ జీవులకు యోగ్యమైనది పార్థునికి చెప్పిన ఈ భగవద్గీతయే. ముందు భగవద్గీత యను ఉట్టికి ఎక్కినచో తరువాత మాట రాసకేళి యను స్వర్గమునకు ఎక్కుట. మరియు అయోగ్యులగు ఈ జీవులు ఆ రాసకేళి గీతలను అపార్థము చేసుకొనెదరు. విమర్శింతురు. అర్జునుడే విమర్శంచినాడు కృష్ణపరమాత్మను. గయోపాఖ్యాన సందర్భమున "సతుల యేమార్చి గొల్లభామల మరుగుట కాదు" అన్నాడు. ఆ రాసకేళి గీతములను అర్జునుడు వినలేదు. పరమభక్తుడగు నారాయణుని వెంట నీడ వలెనున్న నరుడు అనబడు ఋషియగు అర్జునుడే తన ఉపాధి అగు క్షత్రియ వీర పురుషజన్మ ప్రభావము చేత ఇట్లు పలికినపుడు ఇక మిగిలిన శిశుపాల దుర్యోధన జరాసంధాది రాజుల సంగతి చెప్పనేల? ఆనాడు రాసకేళి గీతములలో చెప్పిన అనేకానేక అద్భుత జ్ఞాన రహస్యములను కరుణామయుడగు స్వామి ఈనాడు జ్ఞాన సరస్వతి ద్వారా జీవులకు అందించుచున్నాడు. ఇవి అన్నియును వేదములలో కలవు. కావున ఆ వేదములు ఖిలమై పోయినవి. "అనంతా వై వేదాః" అనగా వేదములకు అంతము లేదు.

భరద్వాజుడను ముని 300 సంవత్సరములు వేదములను చదివినాడు. ఆయనకు స్వామి సాక్షాత్కరించి మూడు మహా పర్వతములను చూపినాడు. ఒక్కొక్క పర్వతము నుండి ఒక్కొక్క పిడికిలి మట్టి తీయమన్నాడు. స్వామి ఇట్లు చెప్పినాడు. ఓ భరద్వాజ! నీవు చదివిన వేదము ఈ మూడు పిడికిళ్ళ మట్టి మాత్రమే, ఇంకనూ చదవవలసిన వేదము ఆ మహా పర్వతములు అన్నాడు. ఈ కథ వేదము నందే కలదు. "భరద్వాజో హ వై" అను మంత్ర పాఠమున కలదు. భరద్వాజుడు 300 సంవత్సరములలో చదివిన వేదములలో ఒక సంవత్సరము మాత్రమే చదివిన వేదము మనకు ఈనాడు మిగిలియున్నది. మిగిలిన 299 సంవత్సరముల వేదము ధారణ చేయలేక మరచిపోయినారు. దీనిని "ఖిల వేదము" అందురు. “ఖిలము” అనగా అంతరించినది అని అర్థము. కావున స్వామి యొక్క జ్ఞానము అనంతమైనది. గోపికల రూపములో ఋషులు ఎందుకు అంతగా ఆకర్షించబడినారు. స్వామి గీతలలో చెప్పెడి జ్ఞానము వారు అధ్యయనము చేసెడి వేదములలో ఉండెడిది కాదు. అది అంతవరకు శ్రవణము చేయని విజ్ఞానము. కావున వారికి ఎంతో శ్రద్ధ ఉండెడిది. ఆ శ్రద్ధయే కృష్ణునిపై ఏర్పడిన ఆకర్షణ. ఆ శ్రద్ధ ముందు అన్నపానీయములు కాని, నిద్ర కాని, అత్తమామలు కాని, పతిపుత్రులు కాని, గృహ, పశు, క్షేత్ర బంధములు కాని నిలువలేక పోయినవి. కావున రాసకేళి అనగా మహా పవిత్రమైన వేదాధ్యయనము. అది ఈశ్వర-జీవులు, గురు-శిష్యులు కావుననే భాగవతము ఏడు దినములలో మోక్షమునీయగల మహా పవిత్ర గ్రంథమైనది.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch