home
Shri Datta Swami

 25 Oct 2025

 

ప్రచ్ఛన్న బౌద్ధుడు

Updated with Part-2 on 26 Oct 2025


Part-1   Part-2


Part-1

[17-12-2002] శిష్యుల యొక్క సాధన స్ధితిని బట్టి ఏది చెప్పవలయునో, ఎచ్చట ఆరంభించవలయునో, ఎచ్చట ముగించవలయునో, ఎట్లు చెప్పవలయునో శ్రీ దత్త సద్గురునికి మాత్రమే బాగుగా తెలియును. శిష్యుడు ఉన్న మెట్టు నుండి పైకి ఎక్కవలసిన మెట్టును గురించి మాత్రమే సద్గురువు బోధించును. ఎక్కడో దూరముగ నున్న చిట్టచివరి మెట్టు గురించి బోధింపడు. అట్లు బోధించినచో ప్రయోజనము లేకపోగా శిష్యుడు ఉన్న మెట్టునుండి భ్రష్టుడగును. ఇది గురుబోధలో ఎంతో ముఖ్యమైన విషయము. ప్రత్యక్షమును తప్ప విశ్వసించని నాస్తికులగు బౌద్ధులకు ఎక్కడో పరోక్షమున వైకుంఠమున శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అని బోధించకూడదు. వానికి ప్రత్యక్షముగా అనుభవమునకు అందు వస్తువును చూపి ఇదియే భగవంతుడు అనవలయును. ఆ వస్తువు వీలగునంత వరకు భగవంతునితో ఎక్కువ పోలిక కలగియుండవలయును. సృష్టిలో ఉన్న అన్ని పదార్థములలోను అత్యంత శ్రేష్ఠమైన తత్త్వము చైతన్యము అనగా జీవుడు. కావున పరమాత్మ అసలు లేడు అను బౌద్ధులకు అత్యంత శ్రేష్ఠమైన చైతన్యమును చూపి ఇదియే పరమాత్మ అన్నారు శంకరుడు. చైతన్య తత్త్వము కొంత ఊహకు అందుచున్నది. కొంత అందుట లేదు. అన్నరసము యొక్క పరిణామము వలన ఏర్పడు అత్యంత సూక్ష్మ శక్తియే చైతన్యము. "అన్నాత్‌ పురుషః" అని శ్రుతి. అనగా అన్నము నుండి పురుషుడు పుట్టుచున్నాడని అర్ధము. అన్నము తినకున్నచో శరీరములోని చైతన్యము అస్తమించుచున్నది. ఇంత వరకు చైతన్యము యొక్క తత్త్వము ఊహకు అందుచున్నది. ఇక ఊహకు అందని తత్త్వము ఏది అనగా ఒక జడపదార్ధములో అన్నరసమును పోయగా చైతన్యము పుట్టుటలేదు. ఈ విధముగా చైతన్యము ఊహకు అందుట, ఊహకు అందకపోవుట అను రెండింటి మధ్య సంధి స్థానముగా యున్నది. ఊహకు అందుచున్నది కావున నాస్తికులు దీనిని అంగీకరింతురు. అనగా చైతన్యము ఉన్నదని చెప్పి, చైతన్యమే భగవంతుడు అని చెప్పి, కావున భగవంతుడు ఉన్నాడని నాస్తికులచేత అంగీకరింప చేయవచ్చును. ఇప్పుడు చైతన్యము యొక్క ఊహకు అందని విషయమును బోధించి భగవంతుడు ఊహకు అందడు అని చెప్పి వానిచేత క్రమముగా అంగీకరింప చేయవచ్చును. ఇట్లు శిష్యులు యొక్క స్థితిని బట్టి బోధయుండును. అంతేకాని ఒక్కసారిగా నాస్తికునకు వైకుంఠవాసియగు విష్ణువును అర్చించమని చెప్పినచో వాడు అంగీకరించడు.

Swami

క్రమముగా బౌద్ధులు జీవుడున్నాడనియు, జీవుడే అన్ని సృష్టి పదార్థములకు గొప్పవాడు కావున భగవంతుడనియు విశ్వసించిరి. ఈ నాస్తికులు ఆరాధన విధానములను నమ్మరు. తమకన్న గొప్పవాడగు భగవంతుడు ఉన్నాడని అంగీకరించరు. ఏలననగా వారిలో అహంకార మాత్సర్యములు అత్యధికముగ యుండును. కావున అట్టివారికి నీకన్న అధికుడైన భగవంతుడున్నాడని చెప్పినచో వాడు అంగీకరించడు. కావున వానికి జీవుడవైన నీవే పరమాత్మవని చెప్పవలయును. ఈ వాక్యము చేత వానిలోని అహంకార మాత్సర్యములు శాంతించును. పరమాత్మను పొందుటకు తపస్సు చేయమన్నచో వాడు చేయడు. కావున వానికి నీవే పరమాత్మవని తెలుసుకున్నంత మాత్రమున "పరమాత్మవు అగుదువు" అని చెప్పవలయును. నేనే బ్రహ్మమని తెలుసుకున్నంత మాత్రమున వాడు బ్రహ్మమగు చున్నాడు అను జ్ఞానమార్గముననే వానికి చెప్పవలయును. అట్లు కాక భగవంతుని పొందుటకు ప్రయత్నమును చేయవలెను అని చెప్పుటకు తనకన్న అధికుడైన భగవంతుడు వేరుగా ఉన్నాడని చెప్పవలెను. అట్లు చెప్పినచో అహంకార మాత్సర్యముతో భగవంతుడే లేడని వాడు పలుకును. కావున నాస్తికుడు శిష్యుడైనప్పుడు గురువుకు ఇంతకన్న వేరు మార్గము లేదు. నీవే బ్రహ్మము - దానిని మరరచిపోయినావు, అది తెలుసుకొన్నచో బ్రహ్మము అగుదువు అను అద్వైత మార్గమే అచ్చట ఏకైక శరణ్యము. దీనికి కారణము కూడా శంకరులు ప్రతిపాదించినారు. భగవంతుడు చైతన్యస్వరూపుడు జీవుడును చైతన్యస్వరూపుడు కావున జీవుడే భగవంతుడు అని చెప్పినప్పుడు నాస్తికుల విషయమున ఆస్తికత్వము నిలచియుండును. శంకరులు బౌద్ధులకు బోధించిన సిద్ధాంతమిది. కావుననే ఆయనను "ప్రచ్ఛన్న బౌద్ధుడు" అన్నారు. అనగా శంకరుల అద్వైత మతము వేదాంత ముసుగు ధరించిన బౌద్ధమతమే అని అర్ధము.

 

Part-2

నిజమే! శిష్యులు బౌద్ధులైనప్పుడు గురువు ప్రచ్ఛన్న బౌద్ధుడే కావలయును. బురదలోని వారలను పైకి లాగుటకు గురువు బురదలో దిగవలయును. ఇది గురువుకు తప్పదు. ఆ గురువుకు బురద అంటుకొనక తప్పదు. ఇట్లు నాస్తికులగు బౌద్ధులను ఆస్తికత్వమను మెట్టు ఎక్కించి శంకరులు నిష్ర్కమించిరి. శిష్యులు ఈ మతమును అపార్థము చేసుకొని నేనే భగవంతుడనని భ్రమించి వాగుచూ అహంకారము పరాకాష్ఠకు చేరి పతితులైనారు. శంకరులు నిష్ర్కమించక ముందే జీవులు భగవంతుడు కాదని కరిగిన సీసమును తాగి శిష్యులు అది తాగలేకపోగా యదార్థము బోధించినారు. అద్వైత పండితులు ఈ ఘట్టమును గురించి ఎప్పుడునూ మాట్లాడరు. శంకరుల భాష్యమంతయును వివరింతురే కాని శంకరులు ఒక్కరే సీసమును త్రాగినారని కావున శంకరులు అను జీవుడొక్కడే బ్రహ్మము అనియు, ఇతరులు బ్రహ్మము కాదనియు ఎప్పుడును పలుకరు. ఈ ఘట్టము వారి అహంకార, మాత్సర్య, మొండితనమునకు అనుకూలము కాదు. తమ కన్న అధికుడైన భగవంతుడు ఒకడున్నాడని చెప్పినంత మాత్రముననే ఓర్వలేని నాస్తికులు, ఆ భగవంతుడు నరరూపమున అవతరించును అని చెప్పిన నమ్ముదురా! కావున శంకరులు నేను బ్రహ్మము, నీవు బ్రహ్మము, ఇరువురము సమానమే అని చెప్పి నాస్తికులను మెల్లమెల్లగా సన్మార్గము వైపునకు లాగెను. ఈ సిద్ధాంతమునకు వారి అహంకారము, మాత్సర్యము సంతృప్తి చెందినది. కావున, ఈ సిద్ధాంతము చాలా బాగున్నదని వారు శంకరులకు శిష్యులైనారు. కొంతకాలము గడచిన తర్వాత వారిలో సాత్త్విక గుణము వృద్ధి చెందిన తరువాత కరిగిన సీసము తాను త్రాగి మీరు నేను బ్రహ్మమే కదా కావున మీరును త్రాగుడు అనెను.

ఇట్లు కొంతకాలము గడచిన తర్వాత మెల్లగా జీవుడి కన్నా పరమాత్మ అధికుడనియు, ఆ పరమాత్మ నరరూపమున కూడా అవతరించుననియు బోధించెను. ఇదే శంకరుల చిట్ట చివరి బోధ. ఈ బోధతో కొందరు శిష్యులు మనకన్న అధికుడైన భగవంతుడు ఉన్నాడు, ఆయన నరరూపములో కూడా వచ్చును అని విశ్వసించి తరించరి. కాని మరికొందరు మాత్రము మనకన్న అధికుడైన భగవంతుడు ఉన్నాడు కాని ఆయన నరరూపమున ఉండడు అని తలచినారు. అనగా వీరిలో అహంకార మాత్సర్యములు కొంత శాంతించినవి. అనగా అధికుడైన భగవంతుడు ఉన్నాడు అంతవరకు అవి శాంతించినవి. కాని సాక్షాత్తుగా తమవంటి నరరూపమున భగవంతుండు ఉండుననుట వారు ఓర్చుకొనలేకపోయినారు. కావున వీరికి అనుకూలముగా బోధచేయుటకు శ్రీదత్తుడు రామానుజ రూపమున అవతరించినారు. అధికుడైన భగవంతుడు వైకుంఠమున నారాయణ స్వరూపముగా ఉన్నాడు. ఆయనను జడ స్వరూపములైన పటములు, విగ్రహముల రూపమున అర్చించు విధానమును ఏర్పరచినాడు. తమవంటి నరుని భగవంతునిగా అర్చించుటలో అసూయ పుట్టునుగాని, జడములైన పటములు విగ్రహరూపములో అర్చించుట అంత అసూయ జనించదు. తన వంటి నర స్వరూపమున ఉన్న భగవంతుడు ఈ లోకమున లేడు ఎక్కడో వైకుంఠమున ఉండును. మన కంటపడడు. కావున మనము ఎట్టి నరుని అర్చించ పనిలేదు అను మతమును రామానుజుడు ప్రవేశపెట్టినాడు. ఎప్పుడు అసూయ పూర్తిగా నశించునో అప్పుడు అట్టి జీవుడు అనసూయ యగును. అట్టి జీవునకు నరస్వరూపమున ఉన్న పరమాత్మ దత్తుడగును. అనగా చిక్కును.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch