
Posted on 04 Dec 2024. Share
దత్తుడు అంటే – లోకమునకు నరావతారముగా అందించబడినవాడే. “మానుషీం తనుమాశ్రితమ్” – మానవశరీరమును ఆవహించి అవతరించినవాడు. మనకు దర్శన, స్పర్శన, సంభాషణ, సహవాసము అనుగ్రహించెడివాడు. మానవులకు జ్ఞానమును బోధించాలంటే మానవకారమునే ఆశ్రయించి రావాలి. అంతేకాని పటములోనుండిగాని, శిల్పములోనుండిగాని, జంతువు రూపములోగాని వస్తే జ్ఞానాన్ని బోధించటానికి వీలు లేదు. అయితే విగ్రహములు ఎందుకు వచ్చినట్లు? మానవులు సాటిమానవుని పరమాత్మగా అంగీకరించలేరు కనుక ముందుగా నరరూపములోని పటములు, శిల్పములు వచ్చాయి. మానవులలోని అసూయ, అహంకారము పోయినపుడు ఆ పటములు, శిల్పములు పరమాత్మకు ప్రతీకలు మాత్రమే అని తెలుసుకోగలగాలి. నిరాకారధ్యానము కష్టము, దుఃఖకరము కనుక, సాకారము అనగా పటములు, శిల్పములు వచ్చాయి. కావున అవి ప్రతీకలు మాత్రమే అని గుర్తించాలి.
“ఆదిత్యం బ్రహ్మేతి” అన్నారు. అంటే సూర్యుని ఆరాధించు అని అర్థము. అయితే సూర్యుడు గోళము కదా. హీలియం గ్యాస్ కదా. కనుక ఈ సూర్యమండలము పరమాత్మ కాదు. ప్రతీక ఆరాధన మాత్రమే. ఆకారాన్ని నిలుపుకోవటానికి మాత్రమే అని వేదములో చెప్పారు గదా. కనుక ప్రతిమలు దర్శనానికే గాని షోడశోపచారములకు కాదు, దీపారాధనలు, పూజలు, నైవేద్యములు అవసరము లేదు. ఈ షోడశోపచారములు నరావతారమునకే గాని, పటములకు కాదు అని స్పష్టముగా తెలుసుకోవాలి. కర్పూరనీరాజనము వేదములలో లేదు. “న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః” అని స్పష్టముగా చెప్పినారు. అంటే ఏమిటి? నాయనా! నీవు వెలిగించే దీపము సూర్యభగవానుని ముందు ఎంతరా అని! ఆ కాలములో చీకటి పడినాక విద్యుత్ దీపాలు లేవు కనుక దీపారాధన చేసేవారు. ఇప్పుడు ఆ అవసరము లేదు. సూర్యుని ఆరాధించు అంటే మనకు కనిపించే సూర్యుని ప్రతీకగా ఆరాధించు అని అర్థము. కాని గురువుగారు చెప్పినది తెలియక ఆ సూర్యగోళాన్నే సూర్యనారాయణునిగా, పరబ్రహ్మముగా ఆరాధించినాడు శిష్యుడు. అప్పుడు గురువుగారు ఏం చెప్పినారు? నాయనా విను! సూర్యుడు అంటే ఈ కనిపించే సూర్యబింబము కాదు. ఇది ప్రతీక మాత్రమే, ఆదిత్యుని ప్రతీకగా ఆరాధించు అని బోధించినారు.

ముక్తిని సాధించాలంటే మార్గము ఏమిటి? కర్మఫలత్యాగమే. గీత 12వ అధ్యాయములో 12వ శ్లోకములో శ్రీకృష్ణభగవానుడు ఇలా చెప్పియున్నాడు.
“శ్రేయో హి జ్ఞానమభ్యాసా – జ్జ్ఞానాద్ధ్యానం విశిష్యతే |<
ధ్యానాత్కర్మఫలత్యాగ స్త్యాగా చ్ఛాన్తిరనన్తరమ్ ||”
అభ్యాసము కంటెను జ్ఞానము శ్రేష్ఠము. జ్ఞానము కంటెను ధ్యానము శ్రేష్ఠమైనది. ధ్యానము కంటెను కర్మఫలత్యాగము ఉన్నతము. చివరకి కర్మఫలత్యాగముచే శాంతి కలుగును. ఇట్లే, “న కర్మణా” – పూజల చేతగాని, “న ప్రజయా” – సంతానము చేతగాని అమృతత్త్వము లభించదు, “ధనేన త్యాగేనైకేన” – కేవలము ధనము త్యాగము చేయుట చేతనే “అమృతత్వ మానసుః” అమృతత్వము లభించును అని వేదము చెప్పుచున్నది. కనుక కర్మఫలత్యాగము అంటే మనము కష్టించి సంపాదించిన ధనమునుండి శక్తివంచన లేకుండా సద్గురువుకు గురుదక్షిణ సమర్పించుట కర్మఫలత్యాగము అనబడును.
★ ★ ★ ★ ★