26 Apr 2025
[07-04-2004] దత్తుడు ప్రతిక్షణము జీవులను పరీక్షించుచుండును. ఎట్లు అనగా ఆయన ఆశ్రయించిన మనుష్యశరీరము ప్రతిక్షణము ప్రకృతి ధర్మములను ప్రదర్శించుచు జీవుల విశ్వాసమును కంపింపచేయుచున్నది. కావున ఆయన శరీరము నిత్యపరీక్షాస్వరూపము. త్రిమూర్తి స్వభావములైన త్రిగుణములతో రజోగుణ, తమోగుణములను తరచుగా ప్రదర్శించుచుండును. ఇవి జీవుల యొక్క విశ్వాసము యొక్క పునాదులనే పెకలించుచుండును. నిత్యపరీక్షకు 90 శాతము జారిపోవుదురు. మిగిలిన 10 మందిలో 9 మంది మరల ఈ పెద్దపరీక్షలలో జారిపోవుదురు. ఆ ఒక్క కోహినూరు వజ్రము మాత్రము నిశ్చలముగా నిలచి దత్త కైవల్యమును పొందును.
ఆయన సర్వజీవులకు తండ్రియని గీత. చెడ్డ పుత్రులను మార్చుటకు అవతరించి ప్రయత్నించుచుండును. కాని మారని చెడ్డ పుత్రులను వ్యామోహము లేక నరకములో పడవేయును. పుత్రులందరు చెడ్డవారైనపుడు కల్కి అవతారమున వచ్చి అందరను సంహరించును.
ఈశ్వరుడు వ్యామోహరహితముగా కర్తవ్యములు చేయును. జీవుడు వ్యామోహముతో కర్తవ్యములను చేయును. ఇదే ఈశ్వరునకు జీవునకు ఉన్న తేడా. ఇదే ధృతరాష్ట్రునకు, కృష్ణునకు తేడా. కృష్ణుడు నారాయణుడు. నారాయణుడే శివుడు. నారాయణుని ఏకైక పుత్రుడే మన్మథుడు. శివస్వరూపమున మన్మథుని దహించినాడు. కాని ధృతరాష్ట్రుడు దుష్టుడైన దుర్యోధనుని ఏ మాత్రము మందలించ లేకపోయినాడు. దుర్మార్గుడైనను భగవంతుని బిడ్డయే, కావున, ప్రతి జీవుని భగవంతుడు రక్షిస్తాడని మనమంటాము. కాని దుష్టులను శిక్షించుచున్నాడని గీత, కావున మన వ్యామోహగుణమును భగవంతునిపై నుంచుచున్నాము.
పరమాత్మ దర్శనము ప్రధానము కాదు. రావణుడు భగవంతుని దర్శించినా, అనుగ్రహించబడలేదు. జ్ఞానమును ఆచరించిన రాముడు భగవంతుని దర్శించకపోయినా అనుగ్రహించబడినాడు. సిద్ధులు చాక్లెట్లు వంటివి. అవి ఆస్తిక నాస్తిక సంధిలో ఉన్న బాలురు బడికిపోవునపుడు ఇచ్చునవి. చాక్లెట్ల వలన చదువు రాదు. జలుబు వచ్చును. అట్లే సిద్ధులను చూచిన స్వార్థము, అసూయ వచ్చునేగాని జ్ఞానము రాదు.
★ ★ ★ ★ ★