home
Shri Datta Swami

 07 Nov 2025

 

శ్రీదత్తజయంతి సందేశము

Updated with Part-2 on 08 Nov 2025


Part-1   Part-2 


Part-1

జ్ఞానులైన మరియు భక్తులైన భగవత్ సేవకులారా

అత్రి అనసూయలకు మానవస్వరూపములో అందరాని పరబ్రహ్మము అందినరోజే దత్తజయంతి. ‘జయంతి’ అనగా ఆ మానవాకారము సంభవించిన రోజు. అనగా సాక్షాత్కరించిన దినము. అనగా అట్టి మానవాకారములో ఉన్న సద్గురువు నీకు లభించిన రోజు. అట్టి సద్గురువును దర్శించు ప్రతిదినము దత్తజయంతే. అట్టి సద్గురువు సాన్నిధ్యములో ఉండి ఆయనను నిత్యము సేవించు ప్రతిరోజు దత్తజయంతియే. దత్తుడనగా ‘లభించినవాడు’ అని అర్థము.

జయంతి అన్ననూ అదే అర్థము. ‘మార్గశీర్షము’ అనగా మార్గమునందు శీర్షమును ఉంచుట. అనగా భగవంతుని చేరు సత్యమైన మార్గమునందు బుద్ధిని ప్రసరింపచేయుట అని అర్థము. నేడు మృగశిరా నక్షత్రము పూర్ణిమతో చేరినందున మార్గశీర్షమైనది. ‘మృగశిర’ అనగా మృగము యొక్క శిరస్సు. అనగా ‘పశుబుద్ధి’ అని అర్థము. ‘నక్షత్రములు’ అనగా అల్పజ్ఞానము గల జీవులు అని అర్థము. ‘పూర్ణచంద్రుడు’ అనగా వారి మధ్య పూర్ణజ్ఞానము గల సర్వజ్ఞుడగు పూర్ణచంద్రుడయిన అవతారపురుషుడని అర్థము. అట్టి అవతారపురుషుడు లోకమునకు అందించబడిన పరమాత్మయే కావున దత్తుడనబడుచున్నాడు. అయితే అట్టి అవతారపురుషుని లోకమునకు అందించిన వాడు ఎవరు?

అందించబడిన వాడే అందించినవాడు. అనగా స్వయముగా తనను తాను దత్తము చేసుకొనినవాడు అని అర్థము. ఇట్లు పరమాత్మ తనను తాను అందించుకున్న స్వరూపమును అసూయ, అహంకారములతో విడచిపెట్టి ఒక మానవుడు ఊహించి, చెక్కిన శిల్పములను, గీచిన చిత్రములను సేవించుట ఎంతటి వెర్రితనము. ఇవి అన్నియు ఊహాచిత్రములే కాని కనీసము తీసిన ఫోటోలు కూడా కావు. కావున మానవుడు అందించిన ఊహారూపములగు జడములను సేవించుట పామర లక్షణము. భగవంతుడు నిర్మించిన రూపములగు ప్రాణులలో సాత్త్వికులగు సాటి మానవులకును, పశుపక్ష్యాదులకును సేవ చేయుట ఉత్తమధర్మమగు ప్రవృత్తిమార్గము.

Swami

ఇక నివృత్తిమార్గములో ఇట్టి చైతన్యసహితములగు విగ్రహములకు ప్రతినిధిగా ఒకానొక స్వరూపముతో పరమాత్మయే అవతరించియున్నాడు. అట్టి అవతారపురుషుని గుర్తించి, సేవించు మోక్షమార్గమే “నివృత్తి” అనబడుచున్నది. “ప్రవృత్తి” అనగా సర్వసాధుప్రాణివర్గమును సేవించి లోకమునకు శాంతిని అందించుట. నివృత్తి అనగా ప్రాణులలో ఒకానొక ప్రాణి రూపమున ఉన్న పరమాత్మను సేవించి తరించుట. మానవుడు సాటి మానవుని ద్వేషించుచున్నప్పుడు, ఇక మానవరూపములో యున్న పరమాత్మను ఎట్లు గుర్తించి సేవించగలడు? కావున ప్రవృత్తియే తెలియని వానికి నివృత్తి ఎట్లు లభించును? ఉట్టికి ఎక్కలేని అమ్మ స్వర్గమునకు ఎక్కునా? దీనికి గీత “ప్రవృత్తిం చ నివృత్తిం చ”అని చెప్పుచున్నది.

ఈ ప్రవృత్తికి, నివృత్తికి మధ్య అడ్డుగోడలే అసూయ, అహంకారములు. అసూయ లేని జీవుడే అనసూయ. మూడు గుణముల అహంకారము లేనివాడే అత్రి. చైతన్యస్వరూపమైన జ్ఞానగర్వమే ‘సాత్త్విక అహంకారము’. శక్తిస్వరూపమైన బలము యొక్క మదమే ‘రాజస అహంకారము’. జడమైన శరీరదర్పమే ‘తామస అహంకారము’. అట్లు అసూయ అహంకారములు లేని సాధకుడే అనసూయ, అత్రి స్వరూపుడు. అట్టి సాధకుడే సాటి మానవరూపములో యున్న సద్గురువును పొందగలడు. అట్టివానికే సద్గురువు దత్తమైనాడు లేక లభించినాడు.

 

Part-2

ఇట్టి అంతరార్థమును తెలుసుకొనక, ఆచరించక అత్రి, అనసూయ అను దంపతులకు ఒక శిశువు జన్మించు ఉత్సవమును పిండివంటలతో చేసుకొనుట పసిబాలుర వినోదము కొరకు చెప్పబడిన ఒక అవిచారిత రమణీయమైన కల్పన. ఇట్టి కల్పనల స్థాయికి ఉత్తమసాధకులు కూడా దిగజారుట వారికి ఎంత అవమానమో వారికే తెలియకున్నది. ఉద్యోగములో పై పదవి నుండి క్రింద పదవికి లేక ఒక విద్యార్థి పైతరగతి నుండి క్రింది తరగతికి దిగజారుట అను డిమోషన్‌ ఎంత అవమానమో ఇదియును అంతే.

కావున ఇట్టి మానవాకారమున అంది వచ్చిన దైవస్వరూపములను సేవించుట తప్ప మరియొక మార్గము లేదు అను శ్రుతి “నాన్యః పంథా” అని చెప్పుచున్నది. అజ్ఞానాంధకారమును పోగొట్టు జ్ఞానసూర్యునిగా సద్గురువును వేదప్రమాణముల ద్వారా తెలుసుకొనవలెనని వేదము "వేదాహ మేతం పురుషమ్” అని చెప్పుచున్నది.

అట్టి సద్గురువును గుర్తించుటకు నాలుగు మహావాక్యములను ఆధారముగా తీసుకొనవలయును. ఇందులో మొదటి మూడు మహావాక్యములైన “అహం బ్రహ్మాస్మి”, “తత్త్వమసి”, “అయమాత్మా బ్రహ్మ”, ఆయన బాహ్యాకారము ఇతర మానవులవలె మానవస్వరూపమే అని చెప్పుచున్నవి. ఇక నాలుగవ మహావాక్యమైన “ప్రజ్ఞానం బ్రహ్మ” ఆయన ఇతర జీవులకు సాధ్యము కాని అతివిశిష్ట బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అని చెప్పుచున్నది. “సత్యం జ్ఞానమ్, ఆనందో బ్రహ్మ” అను శృతులు ఆయన బోధించు బ్రహ్మజ్ఞానము ఇతర పండితులవలె చెప్పు శిరోవేదనాకరమగు జ్ఞానము కాదని చెప్పుచున్నవి.

గీత కూడా “మానుషీం తనుమాశ్రితమ్‌” అని మానవుల కొరకు పరమాత్మ మనుష్యశరీరమును ఆశ్రయించి వచ్చునని చెప్పుచున్నది. మరియును గీత “భూతేజ్యా యాన్తి భూతాని” అను శ్లోకములో జడములగు పంచభూతముల స్వరూపములగు విగ్రహాదులను సేవించువారు జడములగుదురు, అనగా జడములగు పాషాణాది జన్మములలో జన్మింతురనియు, నరాకారమును గుర్తించి సేవించిన నరజన్మమును పొందుదురనియు చెప్పుచున్నది. విగ్రహములు, పటములు కేవలము దర్శనయోగ్యములే కాని సేవాయోగ్యములు కావు. దూరదేశమున ఉన్న బంధువుల ఫోటోల వంటివే. అట్టి ఫోటోలను దుమ్ము దులిపి శుభ్రముగా ఉండునట్లు విగ్రహములకు స్నానోపచారములు తప్ప మిగిలిన ఉపచారములు అక్కరలేదు.

శివలింగము అన్ని విగ్రహములకు మూలపదార్థము అగు శిలను సూచించుచున్నది. దానికి అభిషేకము తప్ప ఇంకొకటి అక్కరలేదు. కావున విగ్రహాదులు సాధనలో పరిమిత ప్రయోజనము కలిగియున్నవి. వాక్కులకు, మనస్సుకు, బుద్ధికి, ఊహకు కూడా పరమాత్మ అందడని వేదములు ఘోషించుచున్నవి. “న తత్ర వాగ్గచ్ఛతి”, “న మనో గచ్ఛతి”, “అప్రాప్య మనసా సహ”, “న మేధయా”, “నైషా తర్కేణ”, “న చక్షుషా” అను వేదవాక్యముల చేత చెప్పబడిన అట్టి పరమాత్మ మనుష్యశరీరమును ఆపాదమస్తకము వ్యాపించి భక్తులకు దర్శనము, స్పర్శ, సంభాషణము, సహవాసములను అనుగ్రహించుటకును, బ్రహ్మజ్ఞానము భోధించుటకును, తన భక్తుల పాపకర్మఫలములను తానే అనుభవించి అటు ధర్మదేవతకు న్యాయము చేయుచూ, ఇటు భక్తులను కర్మవిముక్తులను కావించుటకును, మానవ రూపములో అవతరించి “దత్తుడ”నబడుచున్నాడు.

వాతావరణములో కంటికి కనిపించని ఎలక్ట్రానులే అందరాని పరబ్రహ్మ స్వరూపము. ఆ ఎలక్ట్రానులే ఒక తీగెలో వ్యాపించి ప్రవహించునప్పుడు ఆ విద్యుత్తీగెయే అవతారమైన దత్తుడు. విద్యుత్తీగెను ఎచ్చట ముట్టుకున్నను షాకు కొట్టుచున్నది. కావున ఆ విద్యుత్తీగెయే మనకు స్పర్శనందించు అనుభవమును ఇచ్చు విద్యుత్తు. విద్యుత్తుకు, తీగెకు అద్వైతమే ఉన్నది. కావున విద్యుత్తే తీగ, తీగయే విద్యుత్తు. అట్లే మానవరూపియగు దత్తుడే పరమాత్మ. పరమాత్మయే మానవరూపుడైన దత్తుడు.

శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఏసు, మహమ్మద్‌, బుద్ధుడు, మహావీరుడు, గురునానక్‌, శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీనరసింహ సరస్వతి, మాణిక్యప్రభువు, స్వామి సమర్థ, సాయిబాబా మొదలగు అవతారపురుషులే ఈ లోకమునకు అందించబడిన మానవరూపులగు దత్తస్వరూపములు.

ప్రతి మనుష్యతరమునకు ప్రతి దేశప్రాంతమునకును, అందరికినీ సులభముగానుండుటకు ఈ దత్తరూపములు గురువులుగా అవతరించుచునేయున్నవి. ఒక మానవతరమునకే ఒక దేశప్రాంతమునకే పరిమితమైనచో పరమాత్మకు పక్షపాతదోషము వచ్చును. ఈ అంతరార్థమును తెలుసుకొని ఆచరణలో తెచ్చుకున్న పవిత్రదినమే నిజమైన దత్తజయంతి.

To be continued...

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch