
29 Nov 2025
[శ్రీ దత్తస్వామి వారు మా దంపతులకు అనుగ్రహించిన దివ్య ఉపదేశామృతము ఇది].
శ్లో|| ఇంద్రియాదీనాం అగ్రాహ్యం బ్రహ్మ | కించిత్ గ్రాహ్యమ్ ఆశ్రిత్య విద్యుత్ తంత్రీవ అద్వైతం వర్తతే||
తాత్పర్యము: పరబ్రహ్మము ఇంద్రియాదులకు అందనిదైనా, వాటి చేత గ్రహింపబడు ఒకానొక పదార్థమును ఆశ్రయించి తీగయందు వ్యాపించిన కరెంటు వలె దాని కన్న వేరు కాక అద్వైతమై యుండును.
శ్లో|| "ఇహ చేదవేదీ దధ సత్య మస్తి నచేది వావేదీ న్మహతీ వినష్టిః" అని శ్రుతి.
ఈ సత్యమును గ్రహించి మనుష్య శరీరమును ఆశ్రయించిన పరబ్రహ్మమును బ్రహ్మముగా గ్రహించి ఉపాసించిన వారై కూడా, వారు మరల తమ శరీరముతో సమానమైన మనుష్య శరీరము గల నరావతారునిపై గల మాత్సర్యముతో అద్వైతభావమును వదలి మరల ద్వైతముగా చూచి, అపార్థము చేసుకొని ఆ నరావతారుని అవమానింతురు. ఇదే గీతలో శ్రీ కృష్ణభగవానుడు చెప్పిన సత్యము.
శ్లో।। అవజానంతి మాం మూఢా మానుషీం తను మాశ్రితమ్ ।
పరం భావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్ ।।
తాత్పర్యము: నా పరతత్త్వమును తెలియని మూఢులు, సర్వభూతములకు ప్రభువును మానవదేహమును ఆశ్రయించిన నన్ను అవమానించుచున్నారు. మనుష్యశరీరమును ఆశ్రయించిన పరమాత్మను గ్రహించినవాడే నిజముగా పరమాత్మను పొందుచున్నాడు. ఇంతకన్న వేరు మార్గము లేదు. కాన అట్టి నరాకారమును త్యజించినవాడు మహానాశనమును పొందుచున్నాడు. బ్రహ్మము ఆశ్రయించు పదార్థములలో శిలాది విగ్రహముల కన్ననూ సంభాషణ, సహవాసములను అనుగ్రహించు నరాకారమే పరిపూర్ణమైన ఆనందము నిచ్చును, కావున అత్యుత్తమము.
ఐతే పరబ్రహ్మమును నరాకారములో గుర్తించు మార్గమేది? బ్రహ్మమును గుర్తించుటకు అష్టసిద్ధుల ప్రదర్శనము ప్రధానము కాదు. జ్ఞానమే పరబ్రహ్మమును గుర్తించు లక్షణము అని “సత్యం జ్ఞానమ్ అనంతం బ్రహ్మ” అను వేదవాక్యము ద్వారా తెలుస్తోంది. జ్ఞానసాగరము ముందు అష్టసిద్ధులు అల్పాది అల్పములు. మండనమిశ్రుడు (సురేశ్వరులు) శ్రీశంకరులను పరబ్రహ్మముగా గుర్తించి జీవితాంతము శిష్యుడై సేవించుటకు కారణమేమి? అష్టసిద్ధుల ప్రదర్శనమా? కాదు. కాదు. ఆనాడు మండనమిశ్రుడు ఆబ్దికము పెట్టుటకు జైమిని, వ్యాస మహర్షులను ఆమంత్రణము చేయునప్పుడు, శంకరులు మూసియున్న ఇంటి తలుపులలోనుండి లోనికి ప్రవేశించుట అష్టసిద్ధుల ప్రదర్శనమే కదా! జైమిని, వ్యాసులకు ఆ ఆష్టసిద్ధులు క్రొత్తయా? అందుకే, వారేమీ ఆశ్చర్యచకితులు కాలేదు. మరి మండనమిశ్రుడు ఆశ్చర్యచకితులైనారా? కాలేదు, కాలేదు. పైగా “ఎవరు ఈ బోడిగుండు” అని శంకరులను సంబోధించినాడు గదా. కనుక పరబ్రహ్మమును గుర్తించుటకు అష్టసిద్ధులు లక్షణము కానేకాదు. మరేమి? అంటే దానికి జ్ఞానమే లక్షణము. మండనమిశ్రుడు శ్రీశంకరులతో 21 రోజులు నిర్విరామముగా జ్ఞానచర్చ చేసి ఆనందించి, పరవశుడై, జైమిని, వ్యాసులు “భేష్ భేష్” అనగా ఆ జ్ఞానసముద్రములో మునక వేసి శంకరులను పరబ్రహ్మముగా గుర్తించి, శిష్యుడై సన్యసించి సురేశ్వరాచార్యులుగా జీవించియున్నంత కాలము శిష్యుడై, సేవించి, తరించారు. కనుక జ్ఞానమే పరబ్రహ్మమును గుర్తించుటకు నిజమైన లక్షణము.

[20.08.2001 రాత్రి 10.30 గంటలకు]
విశ్రమిస్తున్న శ్రీదత్తస్వామి మా దంపతులను మందలిస్తూ ఇలా వచించారు. “నాయనలారా! ఏమిటి? మిమ్ము నేను పై మెట్టులో కుర్చోపెట్టి జ్ఞానసాగరమును అందిస్తూ ఉంటే, ఇంకా మీరు ఈ అష్టసిద్ధుల ప్రదర్శన కోసం తాపత్రయ పడుతున్నారేమి? కోట్ల విలువ గల జ్ఞానము అందిస్తూ ఉంటే, పది పైసల వంటి అష్టసిద్ధులకు తాపత్రయ పడతారేమి? అందుకే మీరు ఎంత చెప్పినా, ఎన్ని సార్లు కోరినా, మీకు ఈ పదిపైసల విలువ చేసే అష్టసిద్ధుల ప్రదర్శనం చేయటం లేదు. కనుక జ్ఞానాన్నే ఆశ్రయించి తరించండి," అని ముందు రాత్రే హెచ్చరించి మందలించారు స్వామి. తెల్లవారింది. వినాయకచవితి ఉదయం స్వామి దివ్యవాణిని అనుగ్రహించారు. ఎంతటి అద్భుతం! మధ్యాహ్నం శ్రీదత్తప్రభువులు శ్రీదత్తగణపతి రూపంలో మా భిక్షలందుకొని మమ్ము ధన్యుల చేసారు. శ్రీదత్తస్వామిలో శ్రీదత్తగణపతిని స్పష్టంగా దర్శించి మాకు తెలియపరచి మమ్ముల ధన్యుల చేసారు సీతమ్మగారు. ఎంతటి అద్భుతం! కనుక దీని సారాంశమేమి? అష్టసిద్ధుల ప్రదర్శనము వల్ల గాదు, జ్ఞానము వల్లనే పరమాత్మను గుర్తించాలి మరియు అష్టసిద్ధులను చిల్లరపైసలు ఆశించరాదు. జ్ఞానసాగరాన్ని జుర్రుకోవాలి. ప్రత్యక్ష నరావతారుని గుర్తించి, సేవించి, తరించాలి.
★ ★ ★ ★ ★