05 May 2025
[జూలై 13, 2003 సాయంకాలము] ప్రపంచములో ప్రతి మతము నీ దుర్గుణములను పూర్తిగా పోగొట్టుకున్నకాని ఆ మతములో చేరుటకు పనికిరావని చెప్పుచున్నది. ఇది ఆచరణలో అసాధ్యమగుచున్నది. ఏలననగా ఈ దుర్గుణములు అనేక పూర్వసంస్కారములతో కూడిన పర్వతములు. ఈ స్వల్ప మానవజన్మ వీటిని కదలించుటకు సైతము చాలదు. ప్రయత్నముచేత కొంతవరకు వాటిని నిగ్రహించవచ్చును. ఈ దుర్గుణములు ఋషుల మనస్సులలో కూడా నిప్పురవ్వలవలె మెరయుచున్నవి. ఎవరైననూ తనలో ఏ దుర్గుణమూ లేదని చెప్పినచో అది పరవంచన మరియు ఆత్మవంచనయే. ఇట్టి అసాధ్యమైన పనిని ప్రతిమతము కోరుచున్నందున అందరికి ఈ మతములపై ప్రీతి నశించుచున్నది. మతప్రవక్తలు మతమును ఆధ్యాత్మికమును కలిపి గందరగోళము (confusion) చేసినారు. విశ్వములో శాంతి, ధర్మములను స్థాపించుట మతము యొక్క ఉద్దేశ్యము. నీ దుర్గుణములు సజ్జనులను బాధించి, విశ్వశాంతికి భంగము కలిగించినచో స్వామి నిన్ను శిక్షించును. కావున పూర్తిగా తీసివేయుటకు సాధ్యము కాని నీ దుర్గుణములను కొంత నిగ్రహించుకొనుము. దీనితో మతము ఆగిపోవుచున్నది. కొన్ని మతములు ఇంతటితో ముగిసి, తరువాత భాగమగు ఆధ్యాత్మికమును అసలు బోధించుట లేదు.
ఇక ఆధ్యాత్మికము అనగా స్వామిని చేరుటకు చేయు సాధన (spiritual effort). దీనిలో దుర్గుణములను నిగ్రహించవలసిన అవసరము కూడా లేదు. స్వామికి నీ దుర్గుణములను గురించి ఎట్టి ఆక్షేపణము లేదు. అవి సాధనకు అడ్డురావు. అంతేకాదు వీటిని స్వామి వైపు మరలించినచో అవి నీకు సాధనలో సాయపడును. సాధనలో సాయపడుటకే అన్ని గుణములను స్వామి సృష్టించినాడు. కావున గుణములను సృష్టించుటలో కల అసలు ముఖ్యోద్దేశము గ్రహించినచో నీకు సాయపడుచున్న ఏ గుణమునైననూ నిగ్రహించరాదు. ఎంతటి మూర్ఖుడైననూ సాయపడువానిని అడ్డుకొనడు. కావున ఏ గుణమైననూ సాధనలో సాయపడునప్పుడు సద్గుణమే అగును. అట్లు కానిచో అది దుర్గుణమగును. కావున ప్రపంచమువైపుకు మరలింపబడిన ఏ గుణమైననూ దుర్గుణమే. సాధనలో భక్తిని సంపాదించుటకు ప్రయత్నము చేయవలెను. కాని గుణములను నిగ్రహించుటకు, తొలగించుటకు కాదు. భక్తి, జ్ఞానము చేత లభించి వృద్ధి పొందును. బొంబాయి నగరము ఉన్నది అని తెలియగనె చూడగోరుదుము. కాని దాని విశేషములు ఇంకను తెలియు కొలదీ దానిని చూచు కోరిక వృద్ధి అగును. కావున జ్ఞానము పెరిగిన కొలదీ కోరిక లేక భక్తి పెరుగుచున్నది. కృష్ణుడు భూమిపై అవతరించి ఉన్నాడని రుక్మిణి ముందు తెలుసుకున్నది. నారదుని నుండి ఆ కృష్ణుని గురించిన విశేషములను మరీ మరీ తెలుసుకున్నకొలదీ కృష్ణునిపై ప్రేమ అపారముగ వృద్ధి చెందినది. నారదుడు అనగా జ్ఞానమును ఇచ్చువాడు అని అర్థము. భక్తిచే భగవంతుడు లభించునని “భక్త్యా త్వనన్యయా” అని గీత చెప్పుచున్నది.
కావున దత్తమతములోనికి ప్రవేశించుటకు అర్హత:- నీవు ఒక ప్రాణివై ఉన్నచో చాలును. ఎట్టి గుణములు ఉన్ననూ మృగములు సైతము దైవప్రేమల ద్వారా దైవమును చేరవచ్చును. ఏనుగు, సాలీడు, సర్పము కూడా శ్రీకాళహస్తిలో ముక్తిని పొందినవి. సర్పము చాలా దుష్టప్రాణి. దీని దుర్గుణములను వదులుకొమ్మని స్వామి దానికి బోధించలేదు. బోధించిననూ దానికి అర్థము కాదు. అట్టి సర్పమునకే మోక్ష అర్హత ఉన్నప్పుడు ఒక దుష్ట మానవునకు ఏల అర్హత లేదు. మతములు విధించు ప్రవేశ అర్హతలో మానవులు నిరుత్సాహమును పొంది ఉన్నారు. తల తెంచుకున్నకాని ప్రవేశార్హత లేదని ఒక సంస్థ చెప్పినచో ఆ సంస్థ లోనికి ఎవరు చేరగలరు? అట్లే మతములు దుర్గుణములను తొలగించుకొనుట అన్నది విధించినచో ఎవరికిని సాధ్యము కాదు. కాకున్న, లోకశాంతికి భంగము రాకుండా నిగ్రహించుకొన వచ్చును. అట్టి నిగ్రహము దత్తమతములో కూడా విధించబడియే ఉన్నది. కావున దత్తమతములో లోకశాంతి కొరకు నీ దుర్గుణములను నిగ్రహించుకొన్నచో, స్వామిని చేరు సాధనలో మాత్రము అవి అడ్డు కానందున, మరియు సాయపడుటవలన, సాధనలో వాటి నిగ్రహము కూడా అవసరములేదు.
సాధనలో సాయపడునట్లు దుర్గుణములను స్వామి వైపుకు ఎట్లు మరల్చవలయును? ప్రతి జీవునిలో కోట్ల జన్మల నుండి పేరుకుపోయిన ఆరు దుర్గుణములు ఉన్నవి. అవి కామ, క్రోథ, లోభ, మద, మోహ, మాత్సర్యములు. ఇందులో క్రోథ, లోభ, మద, మాత్సర్యములు రజోగుణములు. కామ, మోహములు తమోగుణములు. స్వామి వైపుకు దుర్గుణములను మరలించు విషయములో ఒక చిన్న ఉదాహరణ: సినిమా పాటలలో ఉన్న ప్రేమను ఆ పాటలలో చిన్న మార్పుల ద్వారా స్వామి వైపుకు మరలించవచ్చును. ఆ పాటలలో ఉన్న మధురమైన శక్తివంతమైన లయ, రాగములు నిన్ను స్వామి వద్దకు తీసుకొని పోవు వాహనములుగా మారుచున్నవి. “చురాలియా హై తుమ్ నే...” అను సినిమా పాటను తీసుకొని ‘సనమ్’ అను శబ్దమునకు బదులు ‘హరే’ శబ్దమును పెట్టుము. ఇప్పుడు నీ ప్రేమమాధుర్యము అంతయును విష్ణువగు కృష్ణునిపై కేంద్రీకరించబడి ఉన్నది! చూచితిరా! ఒక సినిమా పిచ్చివాడు తన దుర్గుణములలో ఎట్టి మార్పులను చేయనవసరము లేకయే మహాభక్తునిగా మారినాడు. ఈ పాటను వాడు ప్రార్థనగా పాడుచున్నప్పుడు ఎట్టి బలవంతము లేక పాడును. బలవంతము లేని సహజమైన ఆరాధనయే సత్యము.
బిల్హణుడు అను కవి ప్రియురాలి మైకములో పోవుచుండగా దారిలో ఉన్న ఒక ఋషికి తన కాలు తగిలినది. ఋషి ఆగ్రహించినాడు. అప్పుడు బిల్హణుడు ఇట్లు అడిగినాడు: “ప్రియురాలి మైకములో ఉన్న నాకు, నా కాలు నిన్ను తగిలినట్లు తెలియలేదు. భగవంతుని మైకములో ఉన్న నీకు ఎట్లు తెలిసినది?” అప్పుడు ఋషి సంతసించి ఇట్లు చెప్పినాడు. “నీ ధ్యానము అద్భుతము. కాని నీ లక్ష్యము మంచిది కాదు. నీ ప్రియురాలి స్థానములో కృష్ణుని ఉంచుకొన్నచో నాకన్న ముందు నీవు స్వామిని చేరుదువు”. ఆ క్షణమునుండి బిల్హణుడు కృష్ణభక్తునిగా మారి సంన్యాసి అయినాడు.
జ్ఞానము, కరుణ మెదలగు గుణములు సత్త్వగుణములు. అనగా సద్గుణములు. రజస్సు, తమస్సు అనునవి దుర్గుణములు. రుక్మిణి సత్త్వగుణము. సత్యభామ రజోగుణము. రాధ తమోగుణము. గుణముల వరకు చూచుకొన్నచో ఒకదాని కన్న మరియొకటి ఎక్కువ. కాని ఆ ముగ్గురిలో ఉన్న భక్తితీవ్రతను చూచినచో రుక్మిణికన్న సత్యభామ, సత్యభామ కన్న రాధకు ఎక్కువ ఉన్నది. కావున మహాలక్ష్మీ స్వరూపిణియగు రుక్మిణికి హృదయస్థానమును, వరాహ అవతారమున భూదేవి అగు సత్యభామకు దానికన్న పై స్థానమగు మూతిపై స్థానమును, దాని కన్న పైస్థానముగా గోలోకమున తన తలపై రాధకు స్థానమును స్వామి ఇచ్చినాడు. స్వామి భక్తికి విలువను ఇచ్చినాడే కాని గుణములకు కాదు. కామమును స్వామి సౌందర్యముపై అట్లే మోహమును స్వామి ప్రవర్తన ఎట్లు ఉన్ననూ స్వామి మీదనే ఉంచుము. మోహము అనగా గుడ్డి ఆకర్షణ. ఈ రెండు దుర్గుణములను పాత్రలలో రాధ తన ప్రేమను పోసినది. ఇక సాక్షాత్కరించలేదని కోపమును స్వామిపై చూపుము. సంసారమునకు కాలమును, శక్తిని వ్యయము చేయక దాచుటలో లోభివి కమ్ము. అవసరములకు కూడా ఖర్చు పెట్టని మహాలోభి గుణము కర్తవ్యములకు సైతము కాలశక్తులను ఖర్చు చేయని మహాభక్తిగా మలచవలయును. ‘‘స్వామి భక్తుడను నాకేమి?’’ అను ధైర్యములో మదమును మలచవలయును. మహాభక్తులను చూచి మాత్సర్యము పొంది నీ భక్తిని పెంచుకొనవచ్చును. ఈ నాలుగు దుర్గుణములను పాత్రలలో దైవప్రేమను సత్యభామ పోసినది.
★ ★ ★ ★ ★