home
Shri Datta Swami

 03 May 2025

 

గురుపూర్ణిమ సందేశము (ఉదయము)

Updated with Part-2 on 04 May2025


Part-1   Part-2


Part-1

సంకలనము — శ్రీమతి ఎస్.గాయత్రి & చంద్రశేఖర్, కువైట్ 2003.

[జూలై 13, 2003] ఈనాడు మీరు అందరును ఈ దివ్య దత్త జ్ఞాన-భక్తి ప్రచారసేవకై నా చరణముల వద్ద గురుదక్షిణలను సమర్పించినారు. గురుపూర్ణిమ నాటి పూర్ణ చంద్రబింబము బంగారము లేక వెండి నాణెమును అనగా ధనమును సూచించుచున్నది. ఇది నీవు గురువుకు సమర్పించవలసిన గురుదక్షిణలను గుర్తుచేయుచున్నది. ప్రతి నెలా గురుదక్షిణనీయవలెనని ప్రతిపూర్ణిమ నీకు చెప్పుచున్నది. గురువు నరుడు కారాదు. అతడు నరరూపమున వచ్చిన నారాయణుడగు సద్గురువు కావలెను. అప్పుడే నీ గురుదక్షిణకు సద్వినియోగము జరుగును. ధనమే నీ సత్య ప్రేమను నిరూపించుచున్నది. నీవు ధనమును ఎవరికి ఇచ్చుచున్నావు? నీ సంతానమునకు ఇచ్చుచున్నావు. కావున నీ నిజమైన ప్రేమ నీ సంతానముపైనే ఉన్నది. అదియే చక్కని నిజమైన పరీక్ష. నీకు భగవంతునిపై అట్టి నిజమైన ప్రేమ ఉన్నచో నీవు ధనమును భగవంతునకే ఇచ్చెదవు. దీనిలో ఇంక వాదము లేదు. ఇది క్రియాత్మకమైన పరీక్ష. మనస్సుతో ధ్యానము, నోటితో స్తోత్రము నీ అసత్యమైన దైవ ప్రేమను ఇతరులకు సత్యమని చూపించు వంచనయే. అయితే కంచములో అన్నము ఉన్నచో పక్కన ఉన్న ఊరగాయ ముక్కలవలె ఈ ధ్యాన, స్తోత్రములు గురుదక్షిణలకు పక్కనే చేరి ఉన్నచో సార్థకములగును. ఈ గురుదక్షిణలే కర్మఫలత్యాగము అని గీతలో అడుగడుగనా ఘోషించబడినది. కర్మయొక్క ఫలమును ఆశించక దానిని ఈశ్వరార్పణము చేయుటయే కర్మఫల త్యాగము లేక గురుదక్షిణ. గురుదక్షిణ లేని ధ్యాన స్తోత్రములు కేవలము ఊరగాయ ముక్కలు మాత్రమే ఉండి అన్నము వడ్డించని విస్తరి వలె ఉండును. గురుదక్షిణ సార్థకము అగుటకు సద్గురువును గుర్తించవలెను. "సత్యం, జ్ఞానం"  అని వేదము సద్గురువును సత్యమైన, అనంతమైన జ్ఞానముచేత గుర్తించవలయును అని చెప్పుచున్నది. నాలుగు వేదముల మహావాక్యములలో మొదటి మూడు వాక్యములు పరమాత్మ నావలె, నీవలె, వానివలె మనుష్యాకారమున ఉండునని చెప్పుచున్నవి. నాలుగవ మహావాక్యము అట్టి నరావతారుడు ఎట్టి నరులు చెప్పలేని విశేష జ్ఞానముతో ఉండునని పలుకుచున్నది. పండితులు చెప్పు జ్ఞానము తల నొప్పిని కలిగించును. అవతరించిన సద్గురువు చెప్పు జ్ఞానము మాత్రమే హృదయములోనికి చొచ్చుకొని పోయి ఆనందమును కలిగించుచున్నది.

ఆనందము బ్రహ్మమని వేదవాక్య ప్రమాణము. వేడిచేత అగ్నిని గుర్తించినట్లు ఆనందప్రదమైన జ్ఞానము చేత సద్గురువును గుర్తించవలెను. మహిమలు గుర్తులు కావు. రావణుడు మొదలగు రాక్షసులు సైతము మహిమలను ప్రదర్శించెను. మొండిబిడ్డలగు ఈ రాక్షసులు తపస్సు అను మొండి  పట్టుదలద్వారా స్వామికి సొమ్ములవలెనున్న ఈ మహిమలను స్వామి నుండి పొందెదరు. వారు స్వామి నుండి జ్ఞాన, గుణములను పొందలేరు. కావున వారు స్వామి కాలేరు. మహిమలచేత వారు దేవుడని ప్రకటించుకున్నను ఈ కారణమువలన ఋషులు అంగీకరించలేదు. ఈశావాస్య ఉపనిషత్తులలో మొదటి మంత్రము: "ఈ విశ్వమంతయు ఈశ్వర ధనము. నీకు అవసరమైన ధనమును మాత్రమే గ్రహించుటకు ఈశ్వరుడు అనుమతించియున్నాడు. దానికన్న ఎక్కువ తీసుకున్నచో స్వామికి తిరిగి ఇచ్చివేయమని" చెప్పుచున్నది.

గోపికలు తమ సర్వకర్మఫలమగు వెన్నను నరాకారమున ఉన్న కృష్ణునకు పెట్టి వారి పిల్లలకును పెట్టక అత్యుత్తమమైన గోలోకమును పొందినారు. ప్రారబ్ధ కర్మఫలమగు శరీరములను సైతము స్వామికి సమర్పించి ధర్మభంగమునకు, నరకమునకునూ భయపడక సర్వార్పణ త్యాగమును చేసి అత్యుత్తమస్థితిని పొందినారు. వారు గురుదక్షిణగా స్వామికి అర్పించనిది ఏమున్నది?

స్వామి గోపికలతో ఉన్నాడే తప్ప పురుషులతో కలసి ఏల ఉండలేదు? అని స్వామిని స్త్రీలోలునిగా నిందించుచున్నారు. దీనిలోని రహస్యమేమి? పురుషుడు అహంకార రజోగుణములతో ఉండును. స్త్రీ ఎప్పుడునూ వినయము, భయము మొదలగు సాత్త్వికమైన మోక్షగుణములతో ఉండును. అందుకే ఋషులు గోపికలుగా జన్మించినారు. ఏ జీవుడైనా ముక్తికి ముందు కడపటిజన్మగా స్త్రీజన్మను పొందవలసినదే. అయితే దీని అర్థము ప్రతి స్త్రీజన్మ చివరిజన్మ అని కాదు.

Swami

కన్నప్ప అను కిరాతుడు దేహములో ప్రధానమైన కన్నులను స్వామికి సమర్పించినాడు. అది అత్యుత్తమ గురుదక్షిణ. నీకు నీ కుటుంబమునకు కావలిసిన ధనమును ఆర్జించుకొనుటకు స్వామి అనుమతించును. నీవు ఎక్కువ తీసుకొన్నచో దానిని స్వామికి ఇచ్చివేయమని వేదము బోధించుచున్నది. నీవు మిత్రుని ఇంటికి పోయినప్పుడు కప్పుతో పాలను ఇచ్చినాడు. పాలను త్రాగుము. కాని కప్పును దొంగిలించకుము. దొంగిలించినచో నీవు దొంగవు, పాపివి అగుదువు అని వేదము చెప్పుచున్నది. ఆ ఎక్కువ పాపధనము నిన్ను కష్టముల పాలు చేయుచును. కొందరు భక్తులు వారి కనీసధనమును కూడా మొత్తము లేక కొంత స్వామికి సమర్పించుచున్నారు. పాటిల్ పండించిన సంవత్సర ధాన్యమంతయు షిరిడీ సాయిబాబాకు తెచ్చి ఇచ్చి ఆయన ప్రసాదించినది తీసుకొని పోయెడివాడు. ఒక ధనికుడు బ్రహ్మజ్ఞానమీయమని సాయి వెంటబడగా సాయి “నాకు కావలసిన ఐదు రూపాయలను నీ జేబు నుండి తీసి ఇవ్వలేనివాడవు నీవు బ్రహ్మమును ఎట్లు తెలుసుకొందువు?” అని చెప్పినాడు. ఈ కర్మఫలత్యాగమును నేర్పుటకే సాయి అందరినీ గురుదక్షిణ అడిగెడివాడు.

అసలు స్వామికి నీ ధనము అక్కరలేదు. నీవు తీసుకొన్న పెచ్చు (extra) ధనమును ఇచ్చటనే వదలి ఆ పాపముతో ఒక్కడవే పైకి పోవుచున్నావు. ఈ విశ్వమంతయును స్వామి ధనాగారమే. ఆయన ధనాగారములోనే నీవు తీసుకొనుట, అనుభవించుట, వదలివేయుటయు జరుగుచున్నది. నీవు దొంగిలించిన హెచ్చు ధనము నీ చేతులతో స్వామికి సమర్పించని పాపమును మాత్రమే మూటగట్టుకుని, ఆ హెచ్చుధనమును ఇచ్చటనే వదలిపోవుచున్నావు.

శబరి శ్రీరామునికి ఆమె ఆహారమగు రేగిపండ్లను సమర్పించినది. తిన్నడు వేటాడి తెచ్చిన పచ్చిమాంసమగు పాపధనమును శివునికి సమర్పించినాడు. శివుడే విష్ణువని వేదము.  కావున ఇరువురు ఒక్కరినే చేరినారు. ఇరువురిలోను భక్తితీవ్రత సమానముగ ఉన్నది. నీవు పాపధనమును సైతము గురుదక్షిణగా స్వామికి ఇచ్చినచో నీ పాపము లెక్కింపబడుటలేదు. పాపముతో సంపాదించిన వేట మాంసము తాను తినక స్వామికి అర్పించిన తిన్నడు ముక్తుడైనాడు. తాను భుజించిన, పాపమును పొందును.

 

Part-2

తిరుపతిలో స్వామికి నీ కష్టములో సాయము లభించిన తరువాత ధనమును గురుదక్షిణగా ఇచ్చుచున్నావు. ఆ ధనము స్వామిదే. అది నీవు దొంగిలించిన పెచ్చుధనమే, దానిని క్షమాపణ కోరుచూ వాపసు (return) చేయుటకు బదులు దానితో స్వామితో పనిచేయించుచున్నావు. పని చేసిన తరువాతనే డబ్బు ఇచ్చుట! నీ విశ్వాసము ఇది! నాస్తికులు కూడా డబ్బు ఇచ్చి ఇతరుల చేత పని చేయించుచున్నారు. వారి కన్న నీవు ఏమి ఎక్కువ? ఆ స్వామిలో వేషధారిగా ఉన్న గురుదత్తుడు ఈ రోజు మీరు దిద్దుకొనుటకై సత్యజ్ఞానమును బోధించుచున్నాడు.

ఈనాడు గురుదత్తుడు, స్వామి ధనమునుండి దొంగిలించిన పెచ్చుధనమును స్వామికి గురుదక్షిణగా సమర్పించి నీ పాపముల గొలుసునుండి విముక్తిని పొందవలెనని బోధించుచున్నాడు. నీవు ఒక దుకాణము నుండి దొంగిలించిన ధనమును ఇచ్చివేయవలెను. కాని దానితో ఏ వస్తువునూ దుకాణములో కొనరాదు. నీవు క్షమాపణ చెప్పి ఇంటికి పోయినచో దత్తుడు ప్రసన్నుడై నీ ఇంటిలో వంద వస్తువులు ఉండునట్లు చేయును. పాలుతాగి దొంగిలించిన కప్పును ఆ కప్పుయొక్క యజమానికే ఇచ్చివేయవలెను. అలాగే పెచ్చు ధనము స్వామికే సమర్పించవలెను. ఇదే గురుదక్షిణ. దీనిని సమర్పించినప్పుడు క్షమాపణ, భయము ఉండవలెను. కాని గర్వము ఉండరాదు. “భియా దేయమ్” అని వేదము. అనగా భయముతో స్వామికి ఇమ్మని అర్థము. “సంవిదా దేయమ్” అని వేదము. అనగా జ్ఞానముతో స్వామికి ఇమ్మని అర్థము. అనగా జ్ఞానము అను గుర్తుతో స్వామిని గుర్తించమని అర్థము. “శ్రద్దయా దేయమ్”’ అని వేదము. అనగా స్వామిని గుర్తించువరకు ఓర్పుతో వేచి ఉండమని అర్థము. దీని అర్థము కప్పును దాని యజమానికే ఇచ్చునట్లు సమస్త ధనమునకు యజమానియగు స్వామికే నీవు దొంగిలించిన ధనమును గురుదక్షిణగా ఇమ్మని అర్థము.

దానములో తొందర పనికిరాదు. సద్గురువు లభించువరకు ఓర్పుతో నీ ధనమును కూడబెట్టుకొనుచూ లభించగానే మొత్తమును గురుదక్షిణగా ఇమ్ము. ఆరోజే నిజమైన గురుపూర్ణిమ. ప్రతిరాత్రి  ఒక్కొక్క కళతో చంద్రబింబము ఈనాటికి పూర్తి అగునట్లు నీవు కూడబెట్టిన ధనముతో నీ హుండి పూర్తి కావలయును. దానములో దేశము (place), కాలము (time), పాత్ర (receiver) అను మూడు అంగములు ఉండును. పాత్ర చాలా ముఖ్యము. గురుపూర్ణిమ (కాలము) రోజు, కాశీ (దేశము)లో దానము చేయుట ముఖ్యము కాదు. యోగ్యునకు (పాత్ర-deserving receiver) దానము చేయుట ముఖ్యము. ఆ పాత్ర సద్గురువు అవునా? కాదా? అని నీవు విచారించుట లేదు. సద్గురువగు గురుదత్తుడు లభించినప్పుడు నీవు కూడబెట్టిన ధనమును గురుదక్షిణగా అర్పించిన ప్రదేశమే కాశీ. ఆ రోజే నిజమైన గురుపూర్ణిమ.

సద్గురువు లభించనిచో దీనుడైన దత్తభక్తునకు దానము చేయము. నారద భక్తిసూత్రము “తన్మయా హి తే” ప్రకారముగా స్వామి అవతార పురుషునిలోనే కాక భక్తులలోను ఉన్నాడు. అయితే భక్తులలో స్వామి బోధించినది ఆ జీవుడు బోధించి ఆచరిస్తాడు. అప్పుడు దోషములు రావచ్చును. ఉదాహరణకు నీవు ఒక భక్తసమాజమునకు గురుదక్షిణ ఇచ్చితివి. దానితో వారు శివరాత్రినాడు కాశీలో వంద మందికి అన్నదానమును చేస్తారు. అయితే సద్గురువు, పాత్రుడైన ఒకనికి వంద రోజులు అన్న దానమును చేసి నీ గురుదక్షిణకు పూర్ణఫలమిచ్చును. సద్గురువు విషయములో, ఆయన శరీరములో స్వామి ఒక్కరే ఉంటారు కావున ఆయన బోధలో కాని, పనిలో కాని ఏ దోషమూ రాదు. షిరిడీసాయి వచ్చిన గురుదక్షిణలను బీద భక్తులకు ఇచ్చేవారు. సర్వజ్ఞుడగు ఆయనను ఎవరు మోసగించలేరు. బిచ్చగాళ్ళు నిన్ను మోసగించగలరు.

గురుదక్షిణలను ఇచ్చిన తరువాత దానిని సద్గురువు ఏమి చేయునని పరీక్షించరాదు. పూర్ణవిశ్వాసముతో ఇవ్వవలెను. ఆయనను సద్గురువుగా నిశ్చయించిన తరువాత మరల పరీక్ష ఏల? అగ్ని అని నిశ్చయించిన తరువాత దానలో మరల వేలు పెట్టి పరీక్షించరాదు. నీ విశ్వాసము పూర్ణము కానిచో కోతిపిల్ల తన తల్లిపొట్టను పట్టుకొన్నట్లు ఉండును. ఒక స్థలము నుండి మరియొక్క స్థలమునకు తీసుకొనిపోవు బాధ్యత మాత్రమే తల్లిది. పట్టు బాధ్యత పిల్లది. కావున పడిపోవచ్చును. ఇదే మర్కట కిశోర న్యాయము. విశ్వాసము సంపూర్ణమైనచో మార్జాల (cat) కిశోర న్యాయముగా పిల్లి తనపిల్లను నోట కరుచుకొని తీసుకొని పోయినట్లు తీసుకొని పోవును. సాయిబాబా గురుదక్షిణ ఖర్చు గురించి ఏ ఒక్కరు సాయిబాబాను ప్రశ్నించలేదు. ఒక ఇన్ కంటాక్స్ (income tax) అధికారి ప్రయత్నించి విఫలుడయ్యెను. కటిక పేదవాడగు మహల్సాపతికి సాయి ఏమియును ఇచ్చుట లేదని భక్తులు బాధపడినారు. సాయి మహల్సాపతియొక్క స్థిర భక్తిని పరీక్షించుచున్నాడని భక్తులకు తెలియదు. సాయము చేసినచో ఆ పరీక్ష పాడగును. పరీక్ష లేకున్నను మీ స్థితి స్వామికి తెలియును. కాని మీరు చాలా గొప్ప స్థితిలో ఉన్నట్లు ఊహాలోకమున విహరించుచున్నారు. స్వామి బోధించిననూ నమ్ముటలేదు. పరీక్షలలో నిరూపింపబడినకాని నమ్మరు. కావున దత్తపరీక్షలు నీశ్రేయస్సుకే కాని సర్వజ్ఞుడగు స్వామికొరకు కాదు. ఈ పూర్ణిమ చంద్రుడును మీరు కూడబెట్టిన ధనమునే కాక, దానిని గురుదక్షిణగా ఇచ్చినప్పుడు మీకు ఉండవలసిన పూర్ణవిశ్వాసరూపమగు మనస్సును సూచించున్నాడు. చంద్రుడు ధనమును, మనస్సును  కూడా సూచించున్నాడు. “చంద్రాం హిరణ్మయీమ్”, “చంద్రమా మనసో” అని వేదము చెప్పుచున్నది. సాయి తనకు దక్షిణలను ఇచ్చువానిని నేరుగా తాను ఈయదలచుకున్నవారికి ఇప్పించి ఉండవచ్చును కదా! వీటిని తీసుకుని ఆయన రహస్యముగా పంచెడివాడు. అట్లు చేయుట ద్వారా తనకు గురుదక్షిణలను ఇచ్చిన వారి యొక్క పూర్ణవిశ్వాసమును పరీక్షించెడివాడు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch