home
Shri Datta Swami

 10 Oct 2025

 

భగవంతుని కళ్యాణగుణ మాధుర్యపు రుచితో లౌకిక బంధములు నశించును.

[12.03.2003] సౌందర్యము అనునది ఒక కల్యాణగుణము. సౌందర్యము యొక్క ముఖ్యమైన స్థానము ముఖము. ముఖము మనస్సునకు అనుగుణముగా యుండును. అందుకే "face is the index of the mind" అన్నారు. జ్ఞానము, ప్రేమ, శాంతి మొదలగు కల్యాణగుణము లన్నియు మనస్సును ఆశ్రయించి యున్నవి. మనస్సు కల్యాణగుణములతో పరిపూర్ణమైనపుడు ముఖము నందు సౌందర్యము పరిపూర్ణమగును. ఆది శంకరుల మనస్సు అంతయు బ్రహ్మజ్ఞానముతో నిండియున్నది. కావుననే ఆయన ముఖము ఎంతో సుందరముగా బ్రహ్మవర్చస్సుతో నిండియున్నది. అట్లే కృష్ణుని మనస్సు ప్రేమతో నిండియున్నది. కావుననే ఆయన ముఖమునందున షోడశకళలు తాండవించుచుండును. రాముని మనస్సు శాంతితో నిండియున్నది. కావున ఆయన ముఖము ప్రసన్నముగా ఎంతో కోమలముగా యుండును. బుద్ధుని మనస్సు కరుణతో నిండియున్నది. కావున ఆయన ముఖము నందు అమృతము చిందుచున్నది. ఈ విధముగా ఆత్మసౌందర్యము బాహ్యసౌందర్యమునకు కారణమైయున్నది. దేహముతో పాటు బాహ్యసౌందర్యము నశించుచున్నది. కాని ఆత్మసౌందర్యము జీవాత్మను ఆశ్రయించి నిత్యముగా యుండుచున్నది. ఈ గుణములను బట్టియే ముఖములో కళలు ఉండుచున్నవి. కావుననే ముఖమును బట్టియే గుణములు చెప్పుట. Face reading వచ్చి యున్నది. కావున కల్యాణ గుణములలో ఒకే ఒక్క గుణము అగు సౌందర్యము దేహమును ఆశ్రయించి ఉన్నది. మిగిలిన కల్యాణగుణము లన్నియు మనస్సును ఆశ్రయించి యున్నవి. మనస్సు, వాక్కు, దేహము అనునవి త్రికరణములు. ఈ కల్యాణగుణములు వాక్కు నందు కూడ ప్రతిబింబించుచుండును. కావున పరమాత్మ యొక్క వాక్కు ఎంతో సుందరముగా యుండును. భగవద్గీతా శ్లోకముల యొక్క సౌందర్యము ఏ శ్లోకములకూ లేదు. శ్రీ కృష్ణ భగవానుడు పరిపూర్ణావతారము. కావున ఆయన మనస్సుతో సమానమైన ఆత్మ సౌందర్యము ఎచ్చటను కనుపించుట లేదు. అట్లే ఆయన వాక్కులగు భగవద్గీతా సౌందర్యము కూడా ఏ వాక్కులకును గోచరించదు. అదే విధముగా ఆయన రూపముతో సమానమైన బాహ్యసౌందర్యము ఎచ్చటను కనిపించదు. శరీరము యొక్క సౌందర్యము, ఆత్మసౌందర్యము యొక్క గుణములు, ఆహారము మీద కూడా ఆధారపడి యుండును. సాత్త్వికాహారము తేజస్సును ప్రసాదించును. శ్రీకృష్ణుడు ఎల్లప్పుడును సాత్త్వికాహారమగు పాలు, పెరుగు, వెన్న భుజించెడివాడు. ఆయన మాంసాహారమును ఎప్పుడును అంటలేదు. కావుననే భగవద్గీతలో సత్త్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణములను కలిగించు ఆహారమును గురించి స్వామి వివరించినాడు. సాత్త్వికాహారము సత్త్వగుణమును పెంచి తేజస్సును పెంచి బాహ్యసౌందర్యమును ఆత్మసౌందర్యమగు కల్యాణ గుణములను వృద్ధి చేయును.

Swami

శ్రీదత్తభగవానుడును ఎల్లప్పుడును గోక్షీరమునే స్వీకరించెడివాడు. కావున ఆయన ముఖమునందు బ్రహ్మవర్చస్సు ఒక సముద్రము వలె ఉప్పొంగు చుండెడిది. సత్త్వగుణము జ్ఞాన కారకము కనుక ఆయన కున్న జ్ఞానము ఎవరికి ఉండెడిది కాదు. దత్తుని యొక్క వాక్కు ఎంతో మాధుర్యముతో నిండి కోటి వీణలు మీటినట్లుండును. కావున ఆహారము దేహము యొక్క రూపమునకు, వాక్కుల యొక్క పద్ధతికి, గుణములకు ఎంతో ముఖ్యమైనది. సాత్త్వికాహారముతో పాటు యోగ్యత కూడ యుండవలెను. ఇది ఆహారము కన్నను ముఖ్యము. యోగము అనగా ఎల్లప్పుడును భగవంతుని గురించిన భావములు, వాక్కులు, క్రియలు ఉండుట. దీనిచే ఈ సృష్టిలో ఉన్న అన్ని వస్తువుల మీద అందరు వ్యక్తుల మీద బంధము తెగిపోవును. లోకములో వ్యక్తుల మీద వస్తువుల మీద బంధములే అన్ని చింతలకు కారణము. కాలిన ఇనుపకడ్డీని పట్టుకుని చేయి బొబ్బలెక్కుచున్నదని పామరుడు కేకలు పెట్టును. అతడు ఇనుపకడ్డీ వేడిని తీసివేయమనియు, లేక తన చేతికి బొబ్బలు రాకుండా చేయమనియు భగవంతుని ప్రార్థించుచున్నాడే తప్ప, ఆ ఇనుప కడ్డీని వదలలేకుండా యున్నాడు. ఇనుప కడ్డీ నుండి వేడిని తీసివేసి చేతికి బొబ్బలు ఎక్కకుండా చేయుట ఎంత కష్టము. ఇనుప కడ్డీని వదలి వేయుట ఎంత సులభము! సులభమైన పనులు చేసి చేయి కాలకుండా చేసుకొనుట జీవుడే స్వయముగా చేయవలయును. ఒక పని సులభముగా జరుగు అవకాశముండగా భగవంతుని కష్టపెట్టనేల? భగవంతునికి కష్టము కాదు అందురా? ఆ కష్టము కాని పనిని జీవుడే చేయవచ్చును గదా? అయితే ఈ లౌకిక బంధములను తెంచుకొనుట చేతకాక యున్నది అని జీవుని వాదము. అసలు జీవుడు ఏ ప్రయత్నము చేయకయే, ఈ లౌకిక బంధములు సులభముగా తెగిపోవు ఏకైక మార్గము గలదు. అదే యోగశాస్త్రము. దానికి అధినాథుడే శ్రీ దత్తాత్రేయుడు. అది ఏమి అనగా నీవు నీ మనో వాక్కాయ కర్మలన్నింటిని భగవత్పరము చేయుము. నీవు భగవంతుని మాధుర్యము రుచి చూడగనే ఈ లౌకిక బంధము లందు రుచి ఎట్టి ప్రయత్నము లేక స్వయముగనే నశించును. అమృతము త్రాగిన వాడు కాఫీని స్వయముగనే వదలివేయును. అప్పుడు కాఫీని వదలి వదలివేయుటకు ఎట్టి ప్రయత్నము అక్కరలేదు. అమృతము రుచి చూడకుండా కాఫీని వదలుట అసంభవము. కావున భగవద్యోగమునకై ప్రయత్నించుము. ఈ యోగము సిద్ధించిన వైరాగ్యము ప్రయత్నము లేకయే సిద్ధించుచున్నది. లౌకికబంధములు తెగిపోయినచో నీకు ఎట్టి చింతలు ఉండవు. ఈ చింతయే ఒక మహాగ్ని. అగ్నిలో కాలిన వాడు బాహ్యసౌందర్యమును కోల్పోవును. చింతలో కాలిన వానికి ముందు ఆత్మ సౌందర్యము కాలిపోయి, దాని ప్రభావము చేత బాహ్యసౌందర్యము కూడ నశించును. కావున లౌకికబంధములలో ఉండుచు యోగము ద్వారా చింతలు అను మంట అంటకుండ మెలుగువాడే యోగి, అట్టి యోగియే పరమసుందరుడు. ఈ లోకములో పరమసుందరుడు ఎవరు అనగా హనుమంతుడు. అందుకే ఆయనను గురించిన కాండకు “సుందరకాండ” అని పేరు వచ్చినది. ఆ కాండలో ప్రతిక్షణము క్లిష్టమైన సమస్యలలో హనుమంతుడు చిక్కుకుంటాడు. కాని ఆయనను ఏ చింతల మంట అంటలేదు. ఇదే హనుమంతుని తోకకు అగ్ని అంటించిననూ ఆయన కాలలేదు అను ఘట్టములోని అంతరార్థము. భగవద్గీతయను యోగశాస్త్రమంతయును ఆత్మసౌందర్యము, మరియు బాహ్యసౌందర్యములను కాపాడుకొను మార్గమే సౌందర్య ఆదిదేవుడైన శ్రీకృష్ణభగవానుడు బోధించియున్నాడు. కావున ఆయనను సత్యం, శివం, సుందరం అన్నారు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch