
Posted on 18 Jan 2026. Share
శ్రీదత్తభగవానుడు
న దత్తా దపరో దేవః న ప్రేమ్ణః పరసాధనమ్॥
తా॥ శ్రీదత్తుని కన్నా వేరు దైవము లేదు. దైవ ప్రేమకన్నా వేరు సాధనము లేదు.
ఏక మేవ అద్వితీయం బ్రహ్మ
యతో వా ఇమాని భూతాని
జాయన్తే యేన జాతాని జీవన్తి
యత్ర్పయన్త్యభి సంవిశన్తి
అనగా బ్రహ్మ మొక్కటే. రెండవది లేదు. దేని నుండి ఈ పంచభూతములు పుట్టి దేనిచే నిలచి, దేనియందు లయించుచున్నవో అదే బ్రహ్మము. “యత్సాక్షా దపరోక్షా ద్బ్రహ్మ” - అనగా పరబ్రహ్మము ప్రత్యక్ష మగుట కూడా శ్రుతిచే చెప్పబడినది. కనుక త్రిముఖ షడ్భుజ రూపమే పరబ్రహ్మము. మిగిలిన రూపాలు బ్రహ్మము యొక్క వేషాలే కాని అసలు రూపాలు కావు.
తొలిపలుకు
[20-04-1999, శంకరజయంతి] ఈనాడు పవిత్ర దినము. శ్రీదత్తభక్తులు శ్రీ జన్నాభట్ల వేణుగోపాలకృష్ణమూర్తిని ఆవహించి శ్రీదత్తభగవానులు ధారాపాతంగా వర్షించిన శ్రీదత్తబోధామృతము - పద్యకావ్యము ‘మరచిపోకుము దత్తుని మంచిమాట’. ఈ ధారామృతమును గ్రంథస్థం చేసి భక్తులకు అందించే భాగ్యాన్ని శ్రీ దత్తభగవానులు మా దంపతులకు ప్రసాదించారు. ధన్యులము. ఇందు వేద నిర్వచనమైన శ్రీ పరబ్రహ్మ స్వరూపము - సాధన - జీవుడు స్వార్థముతో కోరికలతో పాపముల నాచరించుట - కష్టములు రాగానే భగవంతుని కాళ్ళపై బడుట - కష్టములు తీరగనే భగవంతుని మరచిపోవుట. మరల యథాప్రకారముగా పరుల ధనములకు - పరుల భార్యలకు ఆశపడుట - పులుపు - కారము తిని చాపల్య చిత్తుడగుట - టీవిలు, సినిమాలకు అలవాటు పడుట - ఉద్రేకము పెంచుకొనుట - కొందరు భగవంతుడే లేడను నాస్తికత్వమునకు పాలగుట - తాను పెంచిన గొర్రెను తానే చంపి భుజించుట - పతితులగుట చక్కగా వచించినారు. శ్రీదత్తభగవానులు ఇట్టి జీవుల నుద్ధరించుటకే అనేక రూపాలతో ఈ మర్త్యలోకమున అవతరించి - నాలుగు కులాలకు బ్రహ్మము చేరుటకు మార్గము లున్నవనియు – వంచకుడు శిక్షింపబడుననియు పాపము చేసినవారికి శిక్షతప్పదనియు, యమధర్మ రాజంతటి వానికి కూడా శిక్ష తప్పలేదనియు - వచించి - జీవునికి ధర్మ మార్గమును విశ్లేషించి అనుగ్రహించిరి. నాయనలారా! మీ బిడ్డలపై ఎట్టి ప్రేమను చూపగలుగుచున్నారో అట్లే భగవంతుని పై చూపిన ఉద్ధరింపబడగలవని ఉద్ఘాటించిరి. దగ్గరగా నున్న వ్యక్తిపై విలువ తగ్గుననియు, దూరముగా ఉన్న వానిపై విలువ పెరుగుననియు - కనుక భగవంతుని ఎట్టి కోర్కెలు లేకుండా నిస్వార్థముగా అచంచల భక్తిలో సేవించి తరించవలెనని బోధించారు. ఆహా ! స్వామీ ! ధన్యులము.

శ్రీదత్తభక్తుల పరిచయము
నరసరావుపేట వాస్తవ్యులు, సుప్రసిద్ధ సిద్ధాంతి, జ్యోతిష్కులు శ్రీ జన్నాభట్ల వీరభద్రయ్య, హనుమాయమ్మ పుణ్యదంపతుల పుత్రరత్నమే దత్తభక్తులు శ్రీ వేణుగోపాలకృష్ణమూర్తిగారు. వీరు , M.Sc., PhD., కెమిస్ట్రి ప్రొఫెసరు. ప్రస్తుతం కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగు కాలేజీలో పనిచేయుచున్నారు. వీరు శ్రీదత్తభగవానుల సాక్షాత్కారాన్ని, అనుగ్రహాన్ని పొందిన మహనీయులు. వీరు సంస్కృతములో 60కి పైగా గ్రంథాలు రచించిన ధన్యజీవులు. శ్రీదత్తభగవానులు ప్రత్యక్ష దర్శనమొసగి వచించిన దివ్యవాణియే శ్రీ దత్తగ్రంథమాలగా వెలువడినది. శ్రీదత్తవేదము, శ్రీదత్తగురు భగవద్గీత ప్రధానములు. శ్రీవారు ఇప్పుడు ఉపనిషత్తులు వచించుచున్నారు. త్వరలో వానిని ప్రచురించి భక్తకోటికి అందించు భాగ్యమునకై ఎదురు చూచుచున్నాము.
“ఆరంభ గుర్వీ క్షయిణీ క్రమేణ
లఫ్వీు పురా వృద్ధి ముపైతి పశ్చాత్”
సత్కార్యము సాయంకాలపు నీడవలె ఆరంభమున స్వల్పముగ నుండి క్రమముగ విస్తరించును. అసత్కార్యము ఉదయకాలవు నీడవలె ముందు ఎక్కువగా నుండి క్రమముగ క్షీణించును. అట్లే శ్రీదత్తభక్తులు మా ఇంటిలో శివరాత్రి భోజనాంతరము ఆరంభించిన సత్సంగ సంభాషణము ఈనాటికి ఇన్ని గ్రంథములుగా విస్తరించినది. ఇక భవిష్యత్తులో ఎంత విస్తరించునో !
భక్తకోటికి శ్రీవారి సేవలో ఇప్పటి వరకు 1) శ్రీదత్త సత్యసాయి అష్టకము, 2) శ్రీదత్త వేదము, 3) గురుస్తుతి, 4) శివ మహిమ్నః స్తోత్రము, 5) శ్రీదత్త ఉమామహేశ్వర స్తోత్రము, 6) భోగభాగ్య గుళికలు, 7) శ్రీదత్త సూక్తులు, 8) శ్రీదత్తామృతము, 9) శ్రీపాద శ్రీవల్లభులు, 10) శ్రీనరసింహ సరస్వతీ స్వామి, 11) శ్రీమాణిక్య ప్రభువు, 12) శ్రీఅక్కలకోట మహారాజ్, 13) శ్రీ సాయినాథుడు, 14) శ్రీదత్తగురు భగవద్గీత మున్నగు గ్రంథములు అందించి తరించాము.
ఇప్పుడు ‘మరచిపోకుము దత్తుని మంచిమాట’ అను శతకమును సమర్పించుచున్నాము.
ఈ శతకములో శ్రీదత్తభగవానులు జీవోద్ధరణ కొరకు తాపత్రయము వెలిబుచ్చుచు అక్కడక్కడ ‘అంట్ల వెధవ’ మొదలగు వచనములు ప్రయోగించుట జీవుల యొక్క దుర్గుణములకే వర్తించునుగాని జీవులను నిందించుట కాదని మనవి. భక్తమహాశయులు సహృదయముతో స్వీకరించి, పఠించి, ఆనందించి, తరింతురుగాక అని వినతి.
ఇట్లు
శ్రీగురుదత్త భగవానుని సేవలో
చిలుకూరి బాలకృష్ణమూర్తి
శ్రీమతి భవాని
విజయవాడ
★ ★ ★ ★ ★