home
Shri Datta Swami

 Posted on 27 Jan 2026. Share

మరచిపోకుము దత్తుని మంచిమాట (Part-10)

పులుపు కారము లుప్పులు తిలభవములు
రోగదములు, తగ్గించ నారోగ్యవృద్ధి,
జిహ్వగుహ్య చాపల్యము చెడుపథములు,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥49॥

తా॥ పులుపు, కారము, ఉప్పు, నూనెలు మొదలగు రోగకరములగు పదార్థముల నెంత తగ్గించిన అంత ఆరోగ్యము వృద్ధియగును. దాని వలన దైవానుగ్రహసాధన చక్కగా జరుగును. మానవుని చెడగొట్టు దారులు రెండే రెండు. ఒకటి జిహ్వచాపల్యము రెండవది గుహ్యచాపల్యము. ఈ రెండింటిని నిగ్రహించిన సాధన త్వరగా సిద్ధించును.

మద్య ధూమపానములు దుర్మార్గములగు,
రోగకరములు సాధన ఆగిపోవు,
సీసమును త్రాగ గలవారి చేతవేరు,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥50॥

తా॥ మద్యపానము, ధూమపానము - రెండూ దుష్ట మార్గములు. వీటి వలన రోగము వచ్చును. దాని వలన భగవదనుగ్రహమును సాధించు సాధన ఆగిపోవును. సిద్ధపురుషులు కొందరు మద్య - ధూమపానములను చేతురు. వారిని అనుకరించరాదు. వారు కరిగిన సీసమును కూడా త్రాగ గల యోగశక్తి కలవారు. వారి చేతలలో అంతరార్థము వేరుగనుండును.

సుఖము మద్య మహంకార శుష్కుడగును,
కష్టములు తిక్త గుళికలు కలుగు బలము
కష్టములఁ గోరె కుంతి సద్గతినిఁబడయ,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥51॥

తా॥ సుఖములు సారాయి వంటివి. వాటి వలన అహంకారము పెరిగి మానవుడు శుష్కించిపోవును. కష్టాలు చేదుమాత్రలు, వాటివలన జ్ఞానబలము పెరుగును. సద్గతిని పొందగోరిన కుంతి, కష్టములనే కోరినది గదా!

ఔత్సుకోద్రేక మతిరోగ మౌను వాని
పెంచు చలనచిత్రముల జూడ పిచ్చిగాదె?
ఇచట వద్దని అచ్చట నేలమరల?
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥52॥

తా॥ ‘ఏమి జరుగునో?’ అను ఔత్సుక్యము, ఉద్రేకములు - రోగములను పెంచునని వైద్యులు చెప్పుదురు. వీటిని పెంచు సినిమాలను చూచుట పిచ్చిగాదా? జీవితములో ఔత్సుక్యమును, ఉద్రేకమును ఇష్టపడడు. ఇవి లేనపుడే శాంతి సుఖములుండును. మరి వీటినే సినిమాలలో చూచి పొందాలని ఇష్టపడుచున్నాడు జీవుడు! ఇది నిజముగా పిచ్చికాదా?

హర్షశోక ప్రకంపంబులామయములు,
అవియె భగవత్పరములైన అమృతములగు,
చలన చిత్రాలబడి వృథ చావనేల?
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥53॥

తా॥ సంతోష – శోకముల వలన గలుగు ఉద్రేకములు మహారోగ కారణములని వైద్యశాస్త్రముల నిర్ణయము. అయితే, ఈ సంతోష – శోకాలే భగవంతుడి విషయములో భక్తిలో కలిగితే అవియే అమృతములగును. ఎంత మాత్రమూ ఆరోగ్య భంగకరములు కావు. సంతోష - శోక - ఉద్రేకాలే నీ కిష్టమైనచో భక్తిలో పొంది తరించుము. వృథాగా సినిమాలలో వాటిని పొంది ఆరోగ్యమును చెడగొట్టుకొని చావనేల?

టి.వి, సినిమాలు, ముచ్చట్లు, డిత్థ కథల
పుస్తకంబులు, తపముల నస్తమింప
జేయ వచ్చిన రంభాది చిత్రకృతులు
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥54॥

తా॥ టి.వి లు, సినిమాలు, అనవసరమైన ముచ్చట్లు, వ్యర్థ కథలతో కూడిన పుస్తకాలు - ఇవే తపస్సును పాడుచేయుటకు భూమిపై కలిలో వచ్చిన రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ మొ॥ అప్సరసలు చిత్ర చిత్ర రూపాలతో ఉన్నారు.

To be continued...

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via