
Posted on 28 Jan 2026. Share
పరుల సొత్తు కాజేసి లాభంబు దలచు
కాని మూలధనములును కరిగిపోవు,
మోసగించిన వాడెపో మూర్ఖుడయ్యె,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥55॥
తా॥ పరుల ధనములను అపహరించి, తాను లాభమును పొందెనని మూర్ఖుడు తలచును, వాడు మూర్ఖుడు. ఏలననగా ఆ పరుల ధనము వాని మూలధనమును కూడ నాశనము చేయును. కాన అట్టివాడు బుద్ధిమంతుడు కాడు. సత్యము తెలియని పరమమూర్ఖుడే అగును.
పరుల సొమ్ముల భార్యలఁ బడయనేల?
ఆత్మనుపమాన మనుకొన్న అర్థమగును
నీకు సృష్టించితినిగదా నియతి రెండు
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥56॥
తా॥ పరుల భార్యలను, పరుల ధనముల నేల పొందగోరెదవు? నీ భార్యను, నీ ధనమును పరులు పొందగోరిన నీ కెంత బాధయో, అంతే బాధ పరులకుండును గదా! నీకు భార్యను, కావలసిన ధనమును నేను సృష్టించి, లోక నియమానుసారముగా నీకు ఇచ్చినాను గదా!
ధనము ధన మంచు నిత్యంబు దాహమేల?
వెంట జనునె నరకమందు విలువగలదె?
రక్ష సేయునే శిక్షల పక్షి వెధవ!
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥57॥
తా॥ నిత్యము ధనము ధనము అంచు ఈ దాహమెందులకు? ధనము నీ వెంట వచ్చునా? ధనమునకు నరకమున విలువ గలదా? నీకు పడు శిక్షల నుండి ఈ ధనము నీకు రక్షణము నిచ్చునా? ఓ పక్షి వెధవా! తెలుసుకో.
గుడ్డి మోహముతో నొక కుంక కొరకు
పాపములఁ జేతువా? పాప భాగమతడు
అణవు భోగించడచ్చట అంట్ల వెధవా!
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥58॥
తా॥ గుడ్డి వ్యామోహముతో ఒక కుంక కోసము నీవు అనేక పాపములను చేయుచున్నావా! నీ పాప భాగములోని ఒక అణువు శిక్షను కూడా ఆ కుంక నరకములో అనుభవించడని ఓ అంట్ల వెధవా! తెలుసుకొనుము.
భార్యపిల్లలకై ధనపాపములను
చేయుచుందురు నరకంబు చేరినపుడు
వారె గుర్తింపరాతడే పరమశుంఠ,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥59॥
తా॥ భార్యాపిల్లలకై ధనార్జనలో అనేక పాపాలను చేస్తారు. వారే నరకమున పడినపుడు ఆ భార్యాపిల్లలే అచట వానిని గుర్తించరు! ఇట్లు ఈ అజ్ఞానియే పరమశుంఠ అనబడును.
పరుల భార్యల సోదరీ భావమునను
పరుల సొమ్ముల విషముగా పారజూడ,
సారమిదియె రామాయణ భారతముల
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥60॥
తా॥ అన్యుల భార్యల సోదరీ భావంతోనూ, అన్యుల సొత్తును విషముగాను చూచుటయే రామాయణ, భారత గ్రంథముల సారము.
To be continued...
★ ★ ★ ★ ★