home
Shri Datta Swami

 Posted on 29 Jan 2026. Share

మరచిపోకుము దత్తుని మంచిమాట (Part-12)

మేటి కర్తవ్యముల జేసి మిగులు సమయ
మందు భగవదర్చన సేయ నరయు సిద్ధి,
అపుడు వ్యర్థవ్యసనముల నరిగిచెడును
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥61॥

తా॥ కర్తవ్యములు చేసుకుంటూ, ఖాళీగా ఉన్న సమయమునందు భగవంతుని అర్చించిన చాలును. తప్పక సిద్ధిని పొందును. ఖాళీగా ఉన్న సమయము లందు టి.వి మొ॥ వృథా వ్యసనముల పాలైనచో చెడును.

ఇచట సాయపడును గురువెంతగానో
సాయపడడట బోధించ సాయపడును,
సాయపడడు పరీక్షలో చాల కోపి,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥62॥

తా॥ ఈ లోకంలో సాధనలో నీకు భగవంతుడెంతగానో సాయపడును. ఆ లోకములో నీ కర్మఫలాలను పరీక్షించి తీర్పు ఇచ్చునపుడు ఏ సాయము చేయక కోపముతో నుండును. గురువు బోధించునపుడేమి అడిగినా చెప్పును. పరీక్ష సమయములో మాత్రం అడిగితే కోపించును.

నేను లేనఁట! విశ్వంబు నిలచునంట!
స్వయముగ తనకు తానె నీ బంధము లిటు
వాగుచుందురు నాస్తిక వ్రాత్యులవని
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥63॥

తా॥ ఈ లోకములో పతితులైన నాస్తికులు నేను లేననియూ, జగత్తు తనకు తానే స్వయముగా ఏ ఆధారమూ లేకుండా నిలుచుననియూ వాగుచుందురు.

మహిమఁ జూపిన గారడి మనిషి యనుచు
ఈర్ష్యతోఁ జచ్చు నాస్తికునే మనందు?
పరులగొప్ప సహింపడు పాడు మనిషి
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥64॥

తా॥ నేను మహిమలను చూపిననూ నన్ను గారడిచేయు ఇంద్రజాలికుడని ఈర్ష్యతో నాస్తికులు ఏడ్చి చస్తూ ఉంటారు. వారిని ఏమని అందును? ఈ పాడు మానవుడు ఎప్పటికీ పరుల గొప్పతనమును ఓర్వజాలడు. అందుకే భగవంతుని గొప్పతనమును ఈర్ష్యతో సహించలేకున్నాడు.

ముండమోపులు కొందరు బండనెక్కి
ఇనుడు లేడని తీర్మానమును సలుపగ,
సూర్యకాంతిలో నణు వైన శూన్యమగునె?
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥65॥

తా॥ కొందరు ముండ మోపులు రచ్చబండనెక్కి, సూర్యుడు లేడని తీర్మానము చేసినంత మాత్రాన సూర్యకాంతిలో అణువు కూడా తగ్గదు కదా. అట్లే నాస్తికుల తీర్మానముల వలన నా మహిమ అణవు కూడా తరగదు.

దేవుడన పిచ్చివానిగా భావముండు
మ్రొక్కి వరముల గొనిపోవ మోసగాండ్రు,
అతడి ప్రజ్ఞకు నంతంబు నరయలేరు,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥66॥

తా॥ దేవుడంటే ఏదో ఒక పిచ్చివాడనుకుంటారు. మోసగాండ్రు అయిన జీవులు మ్రొక్కి వరములను పొందాలని అనుకుంటారు. కానీ ఆయన యొక్క తెలివితేటలు అంతము లేవని తెలియలేరు.

To be continued...

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via