
Posted on 30 Jan 2026. Share
పిచ్చి బిచ్చగానిగ నేను వచ్చుచుందు
నాకు పెట్టిన భిక్ష అనంతమగును
అతడు ప్రతి జన్మ నన్నంబు నందుకొనును
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥67॥
తా॥ పిచ్చివాడగు బిచ్చగానిగా నేను వచ్చుచుందును. నాకు పెట్టిన భిక్ష అనంతమగును. దాని ఫలముగా, భిక్ష పెట్టినవాడు, ప్రతి జన్మలోను నా నుండి అన్నమును పొందుచున్నాడు.
జ్ఞానబోధను జేయంగ నే నవనికి
వచ్చితిని చిత్రరూపాల వదరుచుంట,
తెలియతరమె మునులకును దేవతలకు,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥68॥
తా॥ జ్ఞాన బోధలను చేయుటకు నేనీ భూమికి అనేక విచిత్ర రూపాలలో వచ్చియున్నాను. పిచ్చివాడిగ, పిచ్చి పిచ్చి మాటలు వాగుచున్నందున నన్ను పిచ్చివాడని భ్రమపడి ఋషులు దేవతలు కూడా నన్ను గుర్తించజాలరు. ఇక మనుష్యులకు నన్ను గుర్తించ తరమగునా?
ధనము నాదిరా, నీవును ధనమె పశువు,
ధర్మబుద్ధితో బ్రతుకుము ధర్మమొకటె,
వెంట జను రక్షసేయును వెర్రి వెధవా!
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥69॥
తా॥ ఈ ధనమంతయును నాదిరా. నీవును నా పశుసంపదలోని ఒక పశువు కాన నీవునూ, నా ధనమే కదా. ధర్మబుద్ధితో బ్రతుకుము ఓ వెర్రి వెధవా! ఒక్క ధర్మమే వెంటవచ్చి, అచ్చట నిన్ను రక్షించును.
గొర్రె తనను పెంచినవాని కూడ జనును
తల్లి తండ్రిగ భావించి దానిఁ జంపి
మాంసమును తినువాని నేమందు ఖలుని
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥70॥
తా॥ గొర్రె తనను పెంచినవానిని తల్లి, తండ్రిగా భావించి వాని వెంటపోవును. దానిని చంపి దాని మాంసమును తిను దుష్టుని ఏమందును?
కత్తితో కోయ క్రూరుండు కుత్తుకనిట
మౌన వేదనతో కొట్టుకొనుచు చచ్చు,
మాంస శబ్దార్థముఁ దెలిసి మానుకొనుడు,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥71॥
తా॥ దుర్మార్గుడు పశువు యొక్క గొంతును కత్తితో కోయగా, మౌనవేదనతో అరవలేక, ఆ పశువు కొట్టుకొనుచు చచ్చును. మాంస శబ్దమునకు అర్థము తెలుసుకొని మాంసాహారము మానుకొనండి. వచ్చే జన్మలో చంపు వాడును అట్లే చచ్చునని మాంస శబ్దతాత్పర్యమున్నది.
ఎన్ని పంటల ఫలముల నిచ్చియుంటి
ఎన్ని రుచుల నేర్పరచితి నిష్టములగు
పెంచి జీవుని తిన్న దుర్వంచకుడగు
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥72॥
తా॥ ఎన్ని పంటలను, ఫలాలను సృష్టించితిని? ఇష్టములగు ఎన్ని రుచులను సృష్టించితిని? వీటితో తృప్తిపడక పెంచిన జీవుని తినే దుష్ట వంచకుని గురించి ఏమని చెప్పుదును?
To be continued...
★ ★ ★ ★ ★