
Posted on 01 Feb 2026. Share
పరుల వంచన హింసయు నరక గతులు,
ఇచట వంచింపబడుదువు హింస నచట
పొందెదవు, వాటి వర్జింప పుణ్య సుఖము,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥79॥
తా॥ ఇతరులను మోసగించుట, ఇతరులను హింసించుట నరకానికి మార్గములు. ప్రతిఫలముగా ఇచట భగవంతుని చేత వంచింపబడుతావు. అచట హింసింప బడుదువు. ఈ రెండింటిని వదలినచో నీకు పుణ్యము వలన లభించు సుఖము కలుగును.
అన్న సొమ్మును కాజేసి అంతరించె
ధార్త రాష్ట్రుడు భరతుండు త్యాగికాన
సుఖపడెను వంశవృద్ధితో సూక్ష్మమదియె
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥80॥
తా॥ అన్న సొమ్మును కాజేసిన దుర్యోధనుడు వంశముతో సహా నాశనమయ్యెను. కానీ అదే అన్న సొమ్మును భరతుడు అంగీకరించలేదు. కాన భరతుడు తన వంశము వృద్ధిచెంద సుఖపడెను. రామాయణ, భారత గ్రంథములలోని సూక్ష్మమైన అర్థమును గ్రహించవలయును.
పాపి శిక్షించబడువాని పాపమెల్ల
అనుభవింతురు అది చూచి అలమటిల్లు,
వంశ నాశాంత రావణ వధయు జరిగె,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥81॥
తా॥ పాపి శిక్ష ననుభవించుటయే కాక, వాని బిడ్డలును ఆ శిక్ష ననుభవింతురు. దానిని ఆ పాపి చూచి వేదన చెందుటయు వాని శిక్షలోని భాగమే. వంశ నాశమును చూచిన తరువాతనే రావణ, దుర్యోధనాదులు బాధ నునభవించి నశించిరి.
తప్పు నంగీకరింపడు తన కృతంబె
ధర్మమని చెప్పు పదిమంది తన్ను చేరి
పొగడగా దురహంకార పూర్ణుడగుచు,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥82॥
తా॥ దుష్టుడు తన తప్పును అంగీకరించడు. తాను చేసినదే ధర్మమని వాదించును. పదిమంది మూర్ఖులు తనను చేరి పొగడగా, దురహంకారముతో నిండిపోవును.
దుష్టులును స్వామి బిడ్డలే దుష్టగుణము
దిద్దుకొను సమయంబు ఆ దేవుడిచ్చు
తుదకు శిక్షించు మూర్ఖుల తొందరేల?
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥83॥
తా॥ దుర్మార్గులు కూడ దేవుని బిడ్డలే కాన, వారి దుర్గుణాలను దిద్దుకునే అవకాశము నిచ్చును. దిద్దుకొనని వారిని చివరకు మొండివారని నిశ్చయించి శిక్షించును. తొందరపడనేల?
To be continued...
★ ★ ★ ★ ★