
Posted on 02 Feb 2026. Share
తప్పు రూపించ నాస్వేచ్ఛ దారి యనును,
జీవుడెప్పుడు నియతుండు దైవవశుడు,
వాని సొత్తు ఈ విశ్వంబు వాడె భర్త,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥84॥
తా॥ దుష్టుని తప్పులను నిరూపించినపుడు, అప్పుడూ తప్పులను అంగీకరించక, నా స్వేచ్ఛ ఇది అనును. కాని జీవుడు దైవశాసితుడు. ఈ విశ్వమంతయును దైవము సొమ్ము. దైవమే సర్వభర్త. జీవుడు స్వతంత్రుడు కాడు. దైవాధీనుడే.
తానె సర్వజ్ఞుడని తన తప్పులన్ని
ధర్మములుగ వాదించు దుష్కర్మ ఖలుడు,
పాప నిర్ణేత పరమాత్మ ఫలదు డతడు
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥85॥
తా॥ దుర్మార్గుడు తానే సర్వజ్ఞుడననుచు, తన పాప కర్మము లన్నియు ధర్మములని వాదించును. వాని కర్మములు పాపములా? కావా? అని వాటి నిర్ణయించి ఫలాలనిచ్చే పరమాత్మ ఉన్నాడు.
దిద్దుకొన గలిగిన తప్పు దిద్దుకొన్న
దిద్దు కొనలేని తప్పులు రద్దు అగును,
భాగమిచ్చిన రారాజు బాగుపడడె?
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥86॥
తా॥ దిద్దుకోవడానికి వీలుగా ఉన్న తప్పులను దిద్దుకొన్నచో, దిద్దుకోవడానికి వీలులేని తప్పులు కూడా భగవంతునిచే క్షమించబడును. దుర్యోధనుడు పాండవుల కెన్నో ద్రోహాలు చేశాడు. అవి దిద్దుకోలేని తప్పులు. వారి రాజ్య భాగము వారి కిచ్చుట దిద్దుకొన గలిగిన తప్పు. అది ఇస్తే మిగిలిన తప్పులు కూడా క్షమించబడి సుఖంగా బ్రతికేవాడు గదా.
దిద్దుకొన సాధ్యమౌ తప్పు దిద్దుకొనిన
పాపమంత శమించును పాపియతడు,
సీత నిచిన చాలను చెడుట తప్పు!
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥87॥
తా॥ దిద్దుకోవడానికి వీలుగా నున్న తప్పులను దిద్దుకుంటే చాలును. దిద్దుకోవడానికి వీలులేని తప్పులు కూడ క్షమించబడును. రావణుడు ఎన్నో పాపాలు చేశాడు. అవి దిద్దుకోవడానికి వీలుకాని హత్యలు, పరస్త్రీ - మానభంగాలు. అయినా, సీతను తిరిగి ఇస్తే ఆ పాపాలన్నీ క్షమించబడి బాగుండేవాడు గదా.
ధర్మజుడు క్షమించినను అధమునిఁ ద్రుంచె
క్షమను చేయజాలరు నరులమలురయ్యు,
ఆతడే అధికారి, అయ్యదియె పథము
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥88॥
తా॥ దుర్యోధనుడు తన తప్పులను దిద్దుకొన నిరాకరించెను. అయిననూ దుర్యోధనుని క్షమించి ధర్మరాజు రాజ్యమును విడనాడఁ దలచెను. అయితే భగవానుడందులకు అంగీకరించలేదు. దుర్యోధనుని సకుటుంబముగా సర్వ నాశనము చేసెను. కావున, పాప క్షమాపణాధికారము మానవులకు లేదు. పాప క్షమాపణమును చేయు అధికారము ఒక్క భగవంతునకే కలదు. ఆ భగవంతుడు పాప క్షమాపణమును ఎట్లు చేయుననగా దానికి ఒకే ఒక మార్గము. పాపమును అంగీకరించి మరల ఆచరింప కుండుటయే.
నిర్ణయానుగ్రహములను నిగ్రహమును
బ్రహ్మ విష్ణు శివ వదన పరములగును
దిద్దుకొనిన క్షమించును దివ్యపథము
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥89॥
తా॥ బ్రహ్మ స్వరూప ముఖముతో పాప - పుణ్య నిర్ణయము, విష్ణు ముఖముతో పుణ్యాత్ములను అనుగ్రహించుట, రుద్ర ముఖముతో పాపాత్ములను నిగ్రహించుట, ఈ మూడు పనులను పరమాత్మ - పరబ్రహ్మ స్వరూపమగు శ్రీదత్తదేవుడే చేయును. పాపమును తెలుసుకొని, వీలున్నచో దిద్దుకొనిన, మరల దానిని ఆచరించని యెడల, ఆ పాపము క్షమించబడి శ్రీదత్తదేవుడనుగ్రహించును. ఇది ఒక్కటియే దివ్యమైన మార్గము. (బ్రహ్మ స్వరూపం కృత నిర్ణయాయ, రుద్ర స్వరూపం ఖల నిగ్రహాయ, విష్ణు స్వరూపం సదనుగ్రహాయ, తస్మై నమస్తే త్రిగుణాత్మకాయ.)
పాప రహిత దేవత, మారుపాపి నరుడు,
తెలిసి పాపి దైత్యుండు, ఆ తెలివి లేని
పాపి పశువు, దైత్య సురులు పరగ నరులె
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥90॥
తా॥ ఏ పాపమూ చేయని వారు దేవతలు, పాపము చేసి తెలిసికొని దిద్దుకొనువాడు నరుడు. పాపము చేసి, తెలిసియు, దిద్దుకొనని అహంకారులే రాక్షసులు. పాపము చేసి తెలియని పశువులు వేరుగా, వేరు రూపాలతో కనబడుచున్నవి. ఇక, కనిపించని దేవతలు, రాక్షసులు మనుజులలోనే ఉన్నారు.
To be continued...
★ ★ ★ ★ ★