home
Shri Datta Swami

 Posted on 04 Feb 2026. Share

మరచిపోకుము దత్తుని మంచిమాట (Part-18)

కర్మఫలములు తప్పవు కాలునకును,
స్వేచ్ఛతో పాపమునుఁ జేయ శిక్షనొందె,
శివుడ నేనె మార్కండేయు డవతరించె,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥97॥

తా॥ యమునికి కూడ కర్మఫలములు తప్పలేదు. సావిత్రికి స్వతంత్రించి ప్రాణదానము చేసి, మార్కండేయుని విషయమున పట్టుబట్టగా శిక్షింపబడెను. యముని శిక్షించుటకే శివుడనైన నేను మార్కండేయునిగా అవతరించాను. కర్మఫలము ననుభవించ వలయునన్న పట్టుదల ధర్మదేవునికి, మార్కండేయ విషయమున కలిగినది. అందువల్లనే, ముందు తన కర్మఫలమును తాననుభవించుటయు, తన పట్టుదల వల్లనే జరిగినది.

నాటినుండి కర్మఫలము నరుడు పొందు
భక్తఫలముల నేననుభవము నొంద
ఒప్పుకొంటిమి అన్యోన్య మప్పుడచట,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥98॥

తా॥ ఆ సమయములో నేనూ, ధర్మదేవుడూ ఒక ఒప్పందమును కుదిరించుకొంటిమి. ఏ జీవుడైనా కర్మఫలములను అనుభవించవలసినదే కాన నేను ఆ నియమమునకు అడ్డు రాను. అయితే, నా భక్తాగ్రేసరుల పాపకర్మల ఫలాలను నేను మానవరూపములో అవతరించి, వారికి బదులుగా నేను అనుభవించినచో, నా భక్తులను ఈ కర్మ నియమము నుండి విడిచి పెట్టవలయును. ఈ ప్రకారముగా, నేను సైతము లొంగిపోయి, ధర్మదేవునకు ఎదురులేకుండా చేసియున్నాను.

నన్నె శిక్షించుకొందు నధర్మమైన
వాలి వధకు  నా పదమున వ్యాధశరము,
ధర్మమే గొప్ప బ్రహ్మంబు తక్కువ గద!
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥99॥

తా॥ నేను ఒకవేళ పరిస్థితులను బట్టి అధర్మము చేసినా, నన్ను నేనే శిక్షించుకుంటాను. నేను చేసిన వాలి వధకు, చెట్టుచాటు నుండి బోయవాని బాణమున పాదములో కృష్ణావతారమున కొట్టబడితిని గదా! బ్రహ్మము కన్న ధర్మమే ఎక్కువ అని లోకమునకు చాటి చెప్పితిని.

ఇచ్చితి విమర్శతో తీర్పునచ్చట మును,
చూచుచుందురు మునులును సురులు నన్నె,
నన్నె శిక్షించుకొంటి నన్య శరహతుడ,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥100॥

తా॥ ఆ లోకములో ఎంతో పరిశీలించి తీర్పులనిచ్చాను. నన్ను సదా ఋషులు, దేవతలూ  రెప్పవాల్చకుండా చూస్తుంటారు. పక్షపాతమును చూపలేను. అధర్మఫలముపై నాపై నేనే తీర్పులు ఇచ్చుకొని కృష్ణావతారములో వ్యాధుని బాణముతో ప్రాణత్యాగమ చేసాను గదా!

పాపకర్మల వివరణ బద్ధ కరముల
చెప్పగా వలె జీవుండు చెల్లవచట
మాయవాక్కులు లోకుల మాయఁజేయ
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥101॥

తా॥ నీవు చేసిన పాపకర్మలకు, అచట చేయి కట్టుకొని స్వామి ఎదుట సమాధానముల నీయవలెను. ఇచట లోకులను మాయ చేయునట్టి మాయ మాటలు అక్కడ చెల్లవు.

కొడుకు వినడని తప్పించుకొనియె రాజు,
అగ్ని వినడని చెప్పెను అడవి హరియు,
తెలివితేటలా పరమాత్మ తెలివిముందు!
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥102॥

తా॥ శ్రీకృష్ణభగవానుని రాయబారమున, కొడుకు ఎంత చెప్పినా వినుటలేదని కొడుకుపై నెపము నెట్టి ధృతరాష్ట్రుడు, శాసించే అధికారము కలిగియు, తప్పించుకున్నాడు. ఆ తరువాత అతడు చివరలో అడవిలో దావాగ్ని మధ్యలో చిక్కి కృష్ణుని రక్షించమని అర్థించినాడు. అప్పుడు కృష్ణుడు సాక్షాత్కరించి అగ్నిని శాసించగలిగియు ‘రాజా! ఎంత చెప్పిన, అగ్ని నా మాట వినుటలేదని’ తప్పించుకొన్నాడు. మానవుడు తన తెలివితేటలను పరమాత్మ ముందు చూపించినచో అవి నిలుచునా?

To be continued...

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via