
Posted on 19 Jan 2026. Share
సృష్టికర్తను భర్తను సృష్టిహర్త
నేనె నా మూడు ముఖము లీ నిజము తెలుపు
ఒక్కడనె కాన బ్రహ్మంబు ఒక్కటియగు
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥1॥
తా॥ ఈ సృష్టికి కర్తను, భర్తను, హర్తను నేనే. ఈ సత్యమును నా ఈ మూడు ముఖములు చాటుచున్నవి. నేను ఒక్కడినే. ముగ్గురు కాను. అనగా బ్రహ్మము ఒక్కటేనని తాత్పర్యము.
మూడు పనులను చేయును మూర్తి ఒకటి
బ్రహ్మమని చెప్పు వేదాలు పారజూడ
దీని తెలియక మంత్రాలు దేనికయ్య?
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥2॥
తా॥ వేదాలన్నీ జగత్తు యొక్క సృష్టి, స్థితి లయములను చేసేది ఒకే ఒక స్వరూపమైన బ్రహ్మము అని ఘోషిస్తున్నాయి. ఇట్లు వేదాలు బ్రహ్మమును గుర్తించు లక్షణమును చెప్పి, ఆ బ్రహ్మము నుపాసించి తరించమని చెప్పుతున్నాయి. ఆ లక్షణము ఏ రూపములో పూర్తిగా సమన్వయిస్తుందో ఆలోచించక బ్రహ్మమునే గుర్తించలేక, కేవలము వేదమంత్రాలను వృథాగా ఎందుకయ్యా, గొంతు లరిగిపోవునట్లు చదువుచున్నారు?
మూడు ముఖముల ముద్దుల మూట గట్టు
మూర్తి బ్రహ్మంబు సృష్ట్యాది మూడు పనులు
చేయునట్టిదే బ్రహ్మంబు, చెప్పదె శ్రుతి?
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥3॥
తా॥ మూడు ముఖాలతో ముద్దులు మూటగట్టు మూర్తియే బ్రహ్మము. సృష్టి-స్థితి-లయములను మూడు పనులను చేయునదే బ్రహ్మమని వేదములు చెప్పుట లేదా?
మూడు ముఖములు సూచించు మూడుపనుల
ఒక్కడేకాన బ్రహ్మంబు నొక్కటెయగు
వేదపూర్ణ సమన్వయవేత్త తెలియు
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥4॥
తా॥ మూడు ముఖాలూ, సృష్టి-స్థితి-లయములను మూడు పనులను చేయుట సూచించును. ఆయన ఒక్కడే కాన, బ్రహ్మము ఒక్కటే. వేదములు బ్రహ్మమును గురించి చేయు పూర్ణ సమన్వయము తెలిసినవాడే దీని నెరుగును.
త్రిముఖరూపంబు బ్రహ్మంబు తెలియ నరుడు
బ్రాహ్మణుడు వాడెచటను సంభవము కాని,
బ్రహ్మమును గుర్తుపట్టిన బ్రాహ్మణుడగు
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥5॥
తా॥ సృష్టి, స్థితి, లయములను మూడు ముఖములతో చేయు ఏక స్వరూపమైన బ్రహ్మమును గుర్తించిన వాడేకులమునకు చెందినవాడైననూ బ్రాహ్మణుడే అగును. బ్రహ్మమును గుర్తించి బ్రహ్మజాన్ఞమును కలిగినవాడే బ్రాహ్మణుడు గదా.
వేదాశాస్త్రాలు చదివియు వెర్రివారు
బ్రహ్మ విష్ణు శివ విభేద భావఖలులు,
బ్రహ్మమొక్కటే త్రిముఖంబు పండితునకు
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥6॥
తా॥ వేదశాస్త్రములు చదివియును వెర్రివారలై బ్రహ్మ - విష్ణు - శివులలో భేదభావమును కలిగి, దుష్టమతులై కలహించుచున్నారు. పండితునకు మూడు ముఖములతోనున్న బ్రహ్మమొక్కటే.
To be continued...
★ ★ ★ ★ ★