home
Shri Datta Swami

 Posted on 06 Feb 2026. Share

మరచిపోకుము దత్తుని మంచిమాట (Part-20)

కాలదేశ విధానాలు కానరావు
సత్య నిస్స్వార్థ భక్తుని సరణిలోన,
తల్లి పసిపాప రీతిగా తత్త్వభక్తి,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥109॥

తా॥ నిజమైన స్వార్థము నాశించని భక్తిలో ఒక సమయము, ఒక ప్రదేశము, ఒక విధానము ఉండదు. తల్లి తన పసిపాపపై ప్రేమను చూపునట్లు, భక్తి, కాల - దేశ - విధాన - స్వార్థములకు అతీతము.

ప్రతిది నాది నీ బిడ్డపై పలుకు నొకటి
పలుకుచుందువే? నన్నేల పలికెదవటు,
సహజ రాగముఁ జూపుము సత్యభక్తి,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥110॥

తా॥ ప్రతిరోజు ఉదయము నీ బిడ్డపై ఒకే ఒక మాటతో నీ ప్రేమను చూపుచున్నావా? మరి, ప్రతిరోజు నన్ను ఒకే స్తోత్రములో నేల పూజిస్తున్నావు? అంటే నా పైన సహజమైన ప్రేమ లేదు. సహజ ప్రేమయే సత్యమైన భక్తి. దానిని నాపై జూపుము.

కాలమునఁ దోచు పలుకుల కర్మతోడ
బిడ్డనెట్లు ప్రేమింతువో పిలచి, అటుల
నన్ను ప్రేమించుము సహజమున్న నిజము,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥111॥

తా॥ ఆ సమయములో ఏ మాటలు తోస్తే ఆ మాటలతోను, ఏ చేష్టలు తోచిన ఆ చేష్టలతోను, నీ బిడ్డను పిలచి ఎట్లు ప్రేమను చూపుదువో అట్లే నాపై ప్రేమను చూపుము. సహజమైనది సత్యము. ఒక కాలము, ఒక విధానము, ఒక స్తోత్రము అసహజములు కాన అసత్యములు.

ఆచరణమున శూన్యుడై అరవనేల?
అరువది కృతుల వ్రాసియు నతడు శుంఠ,
రావణాసుర పాండిత్య మవని వృథయె
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥112॥

తా॥ అచరణములో ధర్మము శూన్యమైయుండ అరువది గ్రంథములను రచించియు, వాటిని ఘోషించిననూ వ్యర్థమే. అట్టివాడే శుంఠ. అట్టివాని పాండిత్యము రావణాసురుని పాండిత్యమనబడును. అది వ్యర్థము.

దేవుడున్నాడని తెలిసి భావమందు
లేని రీతిగ కర్మలు, వాని నతడు
భావతుష్టితో శిక్షించు ప్రతికృతియగు
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥113॥

తా॥ దేవుడున్నాడని మనసులో తెలియును. కానీ ఆచరణములో దేవుడు లేనట్లుగా పాపములను జీవుడు చేయుచున్నాడు. జీవునికి ప్రతిబింబమే పరమాత్మ యొక్క చేష్టలుండును. భగవంతుడు, అట్టి జీవుడి స్తోత్రములకు మనసులో అభినందించుచూ, ఆచరణములో ఆ జీవునికి వాని పాపశిక్షలను వేయుచుండును.

అతడి ఆజ్ఞచే భూతంబు లదరినడచు
సూర్యవాతాదులే, నలుసులగు నరులు
నడువవలె రాజులైన వినయముతోడ,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥114॥

తా॥ దేవుని ఆజ్ఞచేత పంచభూతములే అదరి నడచుచుండును. సూర్యుడు, వాయువు మొ॥నవి కూడ భయపడుచుండును. ఇక ఈ మనుషులు నలుసుల వంటివారు. అట్టి మానవులకు అహంకారమేల? రాజులైననూ ఆ దేవుని స్మరించి, వినయముతో ప్రవర్తించవలెను.

మనసు మనసుతో వాక్కును మాటచేత
సేవ సేవతో చెల్లించు దైవమెపుడు
ఊరి ఊరికి దూరంబు ఉన్నదొకటి,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥115॥

తా॥ మనసుతో ఆరాధించిన వానికి మానసికానందమునిచ్చి, వాక్కుతో పొగిడిన వానికి జ్ఞాన వాక్యములను చెప్పి, క్రియాత్మకముగా సేవచేసిన వానికి క్రియాత్మకముగానే సేవ చేయు మేధావి దేవుడు. నీ ఊరి నుండి అతడి ఊరికి ఎంత దూరమో, అతడి ఊరి నుండి నీ ఊరు అంతే దూరము.

To be continued...

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via