home
Shri Datta Swami

 Posted on 07 Feb 2026. Share

మరచిపోకుము దత్తుని మంచిమాట (Part-21)

సాధువంచనా హింసలే సత్యమఘము,
తన్నివారణ పుణ్యంబు, ధర్మకర్మి
సహకరించిన పరమాత్మ సంతసించు,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥116॥

తా॥ సాధువులను వంచించుట, హింసించుటయే నిజమైన పాపము. అట్టి పాపమును జరుగకుండా నివారించుటయే పుణ్యము. ఈ పుణ్యమును చేయువాడే ధర్మమును ఆచరించినవాడు. పరుల విషయము నాకెందుకని ఉపేక్షసేయక, కలుగజేసుకొని, శక్త్యనుసారము ధర్మరక్షణ చేయవలెను. అది భగవంతుని కర్తవ్యములో ఆయనకు సహకరించుట. ఇది ఆయనకు చాలా ప్రీతికరము.

మాయ నాటకంబిది నీకు జాయ ఎవరు?
పుత్రులెవరురా నీకు? సద్భుద్ధి కనుము
పాత్రలన్నియు మారును పరభవమున
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥117॥

తా॥ ఇదంతయును మాయానాటకము. నీకు భార్య ఎవరు? పుత్రులెవరు? సద్భుద్ధితో ఆలోచించుము. వచ్చే జన్మలో ఈ జీవులు, వేరు, వేరు పాత్రలను నటులవలె ధరించి మరొక మాయా నాటకమున పాల్గొందురు.

నీకు నేనె బాంధవుడను, నిత్యమిచట
జన్మలన్నింట బంధంబు సాగుచుంట,
సర్వబంధువులును నేనె సత్యమిదియె,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥118॥

తా॥ ఈ జగత్తులో నీకు నిత్య బంధువును నేనొక్కడనే. ఏలనన ప్రతి జన్మలోనూ నీకు నాకూ ఇప్పటి బంధమే కొనసాగును. కాన సర్వ బంధువులు నీకు నేనే. ఇది సత్యము.

రాధ త్రాగగా కందెను బాధ తోడ
అవియె రుక్మిణి త్రాగును అదియె వేడి
స్వామియైనను సన్నిధి చవక యగును
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥119॥

తా॥ రోజూ త్రాగే వేడిపాలనే రుక్మిణి, రాధ, మధురకు రాగా రాధ కిచ్చినది. రాధ త్రాగగా స్వామి కందిపోయి బాధపడెను. రాధా హృదయవాసినని నిరూపించెను. రుక్మిణి రోజూ త్రాగుచున్ననూ కందిపోలేదు. నిత్య సాహచర్యము వల్ల స్వామి విలువను పూర్తిగా రుక్మిణి గ్రహించలేకపోయెను. కాన దగ్గరగా ఉన్నచో భగవానుడైననూ విలువ కోల్పోయి చవక యగును.

విలువఁదెచ్చు వియోగంబు వేదనమున
విలువ పోగొట్టు యోగంబు విశ్వమందు
రాధ దూరాన రుక్మిణీ రమణి వెంట
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥120॥

తా॥ దగ్గరలేని వ్యక్తిపై విలువ కల్గించు వేదన పుట్టును. అదే వ్యక్తి దగ్గరనున్నచో ఈ లోకములో విలువ పోతుంది. దూరంగా రేపల్లెలో నున్న రాధ స్వామిపై ఎంతో విలువ కలిగియుండెను. దగ్గరగానున్న రుక్మిణికి స్వామిపై విలువ తగ్గెను గదా!

కృష్ణ శాసన మొల్లక వృష్ణి జనము
కొట్టుకొని చచ్చె సురను గ్రోలి మున్ను,
నిత్యసన్నిధి నిర్లక్ష్య సత్యకరము
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥121॥

తా॥ కృష్ణుడు సురాపానము చేయరాదని శాసించి భారత యుద్ధమునకు పోయెను. కాని కృష్ణుని ఆజ్ఞను నిర్లక్ష్యము చేసి మద్యపానము చేసి యాదవులు కొట్టుకొని మరణించిరి గదా! కావున నిత్యము కలసి ఉండుట వలన, స్వామి పైనను నిర్లక్ష్యమేర్పడి అనాదరము కల్గును. కావుననే దేవుడు కనపడక దూరముగనున్నాడు. ఇది నరుల సహజ స్వభావము.

స్వామి కీర్తిని చాటుట స్వకృతములకు
స్వామి కర్తగా చెప్పుట స్వార్థరహిత
సేవయే స్వామి ప్రీతికి సిద్ధ పథము
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥122॥

తా॥ తనను గురించి ఆలోచింపకుండా స్వామిని గురించి ప్రచారము చేయుచు, తాను చేయు అన్ని పనుల యొక్క గొప్పతనమునకు స్వామి కర్తయని స్వామికే కీర్తి నర్పించుట అను సేవయే స్వామికి ప్రీతికరము. అదియే సిద్ధిప్రద మార్గము.

దత్త గురువాక్య దీపాలు, ధర్మతైల
దీప్తములు, తత్త్వవేదాన్త దీధితులును,
ఇహ పరాధ్వము దర్శించ నివియె సఖులు,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥123॥

తా॥ ఈ పద్యములు శ్రీదత్తగురుదేవుల వాక్యములు. ఈ వాక్యములు, ధర్మశాస్త్రమను తైలముతో వెలుగుచు, తత్త్వమగు వేదాంతశాస్త్రమను కాంతిని వెదజల్లునవి. ఇహమునందును పరమునందును మార్గమును దర్శింపచేయుటకు జీవునకు మిత్రులవంటివి. ఇట్టి శ్రీదత్తుని మంచిమాటలను మరచిపోకుము.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via