
Posted on 20 Jan 2026. Share
బ్రహ్మమును గుర్తుపట్టియు, బ్రహ్మలబ్ధి
పథము తెలిసినవాడె పో బ్రాహ్మణుండు,
విప్రసుతుడైన మాత్రాన విప్రుడగునె?
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥7॥
తా॥ బ్రహ్మమును గుర్తుపట్టి, బ్రహ్మమును పొందు మార్గమును తెలిసినవాడే బ్రాహ్మణుడు. అంతే తప్ప బ్రాహ్మణ పుత్రుడైనంత మాత్రాన బ్రాహ్మణుడగునా? కాడు కాడు.
అతిశయంబు గుణాఖ్యమౌ వ్యాకరణము
జ్ఞానమని చెప్పు, జ్ఞానిని జ్ఞానదాత
గురుడు బ్రహ్మంబు, చేతనా స్ఫురణమగునె?
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥8॥
తా॥ వ్యాకరణ సంప్రదాయ ప్రకారముగా ఒక గుణము ఎక్కువగా వున్నవానిని ఆ గుణము పేరుతోనే పిలుతురు. జ్ఞానదాతయగు ఆ గురుదత్తుడు జ్ఞానాతిశయము కలవాడయినందున, ‘జ్ఞానము’ ‘ప్రజ్ఞానము’ శబ్దములచేత ‘బ్రహ్మము’ అను విశేషణముతో శ్రుతులు చెప్పినవి. బ్రహ్మము అనగా జ్ఞానము. అనగా మహాజ్ఞాని గురుదత్తుడే. లోకములో జ్ఞానము అనగా చైతన్యము అని అర్థము స్ఫురించదు గదా.
(సత్యమైన, అనంతమైన, గొప్పదియగునది జ్ఞానమే అనగా జ్ఞానియే - సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ అని శ్రుతి).
బ్రహ్మనామమే సత్యంబు భక్తులకది
దత్తమయ్యెను దత్తాఖ్య, దాని కొరకు
తప్తులై దత్తమని చెప్ప తానె వెలిగె
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥9॥
తా॥ బ్రహ్మమే అసలు వేదనామము. ఆ బ్రహ్మము భక్తులకు దత్తమయ్యెను. కాన దత్తనామ మేర్పడినది. బ్రహ్మముకొరకు తపించినవారు ‘దత్తం దత్తం’ ‘చిక్కింది చిక్కింది’ అని అన్నారు. ఏది? అంటే బ్రహ్మమేనని వారికి అందరికీ తెలియును. కాన, వారి నోట దత్తనామమే వచ్చియుండెను. దత్తమంటే చిక్కినది అని అర్థము. ఇది ఒక వస్తువు యొక్క నామము కాజాలదు. బ్రహ్మమే దాని నామము.
(‘చిక్కినది’ అనుమాట ఒక వస్తు నామము కాదు. దత్తం = చిక్కినది, ఏది? అనగా బ్రహ్మమే అని బ్రహ్మము నన్వేషించువారికి తెలియును కాన బ్రహ్మమని చెప్పబడలేదు.)
నాల్గువేదాలు కుక్కలై నడచుచుండ,
గోవుగా ధర్మదేవతకూడ రాగ,
మూడు ముఖముల బ్రహ్మంబు పుడమి తిరుగు,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥10॥
తా॥ నాలుగు వేదములు కుక్కలుగాను, ధర్మదేవత రక్షణకోరి గోవుగా వెంటరాగా, మూడు ముఖములతో బ్రహ్మము భూమిపై సంచరించుచున్నది.
వేదమును నమ్మి బ్రహ్మంబు విదితమైన
గుర్తుబట్టుట జ్ఞానంబు మూర్తి నిచట
తెలియలేము, తత్త్వము గుర్తు తెలియగలము
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥11॥
తా॥ మూడు పనులు చేయు ఒకే స్వరూపము బ్రహ్మమని వేదము చెప్పుచున్నది కాన, వేదమును నమ్మినచో బ్రహ్మమును తెలియగలము. తెలియుట అనగా బ్రహ్మమెవరని గుర్తుపట్టుటయే తప్ప, బ్రహ్మముయొక్క తత్త్వమును తెలియుట కాదు. బ్రహ్మమును గుర్తుబట్టుటయే బ్రహ్మజ్ఞానము కాని బ్రహ్మతత్త్వమును తెలియుట అసంభవము.
కాల-కర్మ-గుణ విభేదకలన వలన
మూడు రూపాలఁ దోచును మూర్తి ఒకటె,
మాయచే కనపడును త్రిమూర్తులొకట
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥12॥
తా॥ సృష్టి - స్థితి - లయములను సమయాలలో, ఆ పనులలో ఆ గుణాలతో వున్నప్పుడు ఒకే మూర్తి మూడు రూపాలతో కనపడుతుంది. తన మాయాశక్తి చేత త్రిమూర్తులుగా వేరు వేరుగా ఉన్నట్లు బ్రహ్మము కనపడును. నిజంగా త్రిమూర్తులు లేరు. ఉన్నది ఒకే ఒక దత్త పరబ్రహ్మమూర్తి అని తెలియవలయును.
To be continued...
★ ★ ★ ★ ★