home
Shri Datta Swami

 Posted on 21 Jan 2026. Share

మరచిపోకుము దత్తుని మంచిమాట (Part-4)

మూడు ముక్కలు కాలేదు, మూడు కాదు,
మూడు మూర్తులలోనున్న, మూర్తి ఒకడె,
మాయ చలన చిత్రములోన మనిషి ఒకడె,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥13॥

తా॥ బ్రహ్మము మూడు ముక్కలు కాలేదు. మూడు బ్రహ్మములూ లేవు. త్రిమూర్తులలోనున్నది ఒక్క మూర్తియే. ఆయన మాయ ఇది. సినిమాలో ఒకే నటుడు ఒకే సమయములో మూడు పాత్రలలోను, ఒకే నటుడు తన ముఖమునే మూడు ముఖాలతోనున్నట్లు కనిపించును గదా!

నేతి బీరకాయకు లోన నేయియున్న
బ్రహ్మమును గుర్తుపట్టక బ్రాహ్మణుడగు,
మూడు పనులను జేసెడి బ్రహ్మమొకడె,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥14॥

తా॥ ‘బ్రహ్మము ఎవరు?’ అని గుర్తు తెలియని వాడును బ్రాహ్మణుడే అయినచో, నేతిబీరకాయలో నేయి ఉన్నట్లే. సృష్టి స్థితి లయములను మూడు పనులను ఒక్కడే అగు బ్రహ్మము చేయుచున్నది.

సురభి రహిత పుష్పము, ఫలశూన్య తరువు
శుష్క సలిల కాసారంబు, శ్రుతులు చెప్పు,
బ్రహ్మమును గుర్తుబట్టని బ్రాహ్మణుండు
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥15॥

తా॥ వేదములు చెప్పు బ్రహ్మమును గుర్తించని బ్రాహ్మణుడు, వాసన లేని పూవు, ఫలములు లేని వృక్షము, నీరు లేని చెరువు ఒక్కటే.

మూడు పనులను చేసెడి ముఖము లొప్పు
బ్రహ్మమును తెలిసిన వాడె బ్రాహ్మణుండు
మూడు పోగులు వేయంగ వాడు ద్విజుడె?
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥16॥

తా॥ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయములను చేయు మూడు బ్రహ్మ, విష్ణు, శివ ముఖములతో వెలుగు బ్రహ్మమును తెలుసుకున్నవాడే బ్రాహ్మణుడు. మూడు జందెము పోగులు వేసినంత మాత్రాన బ్రాహ్మణుడగునా?

బ్రహ్మవేషముల తెలిసి బ్రహ్మసహిత
వేషములఁ బట్టు సర్వదేవేష్టుడగుచు,
వేషి వేషములను చిక్కు విజ్ఞుడగుట,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥17॥

తా॥ బ్రహ్మమును తెలిసిన జ్ఞాని, సర్వదేవతలూ బ్రహ్మము యొక్క వేషాలని తెలసి, ఆయా వేషములలో నున్న  బ్రహ్మమును పట్టుకొనును. ఇట్టి జ్ఞానికి వేషమూ - వేషము వేసినవాడూ, చిక్కును. అట్టి వాడే నిజముగా సర్వదేవతారాధకుడు. వేషములతో సహా బ్రహ్మము వానికి లభించును.

బ్రహ్మవేషములనుబట్టి బ్రహ్మ మసలు 
ఎవరొ గుర్తును తెలియని హీనులకిట
వేషములె చిక్కును నటుండు విడిచిపోవ,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥18॥

తా॥ బ్రహ్మమును తెలియక, బ్రహ్మ వేషములగు సర్వదేవతలను పట్టుకున్నవారు అల్పులు. వారికి చివరకు నటుడైన బ్రహ్మము జారిపోగా, వేషములే చిక్కును.

To be continued...

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via