
Posted on 22 Jan 2026. Share
రూపవంతుడు ఆత్మ నిరూపణమట
నేను నీవను భావి సన్నిధిని చెప్పు
ఇటు మహావాక్య తాత్పర్య మెరుగవలయు
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥19॥
తా॥ ఒక రూపము కల వ్యక్తి, ప్రశస్తమైన వేదాంత జ్ఞానము అతిశయముగా కలవాడు, కాన ‘అయ మాత్మా బ్రహ్మ’ ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అనియు, అతి సమీప భవిష్యత్తులో నేను, నీవూ బ్రహ్మము కావలయునని కోరికను సూచించు వర్తమాన ధాతువులతో ‘అహం బ్రహ్మాస్మి’ ‘తత్త్వమసి’ వాక్యాలను తెలియాలి. అనగా చాలా త్వరగా నేను, నీవు బ్రహ్మము అవుతాము అని ఇక్కడ వ్యాకరణ సమ్మతమైన అర్థముగా తెలియాలి. ఈ విధంగా నాలుగు మహావాక్యాల తాత్పర్యమును తెలుసుకోవాలి.
శ్రుతియు ప్రజ్ఞాన ఘనుడని చూపునతని
గుణ మహత్త్వార్థ గుణ వాచ్య గుణియె గురువు,
బ్రహ్మమే గురురూపంబు భావమిదియె,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥20॥
తా॥ ‘ప్రజ్ఞాన ఘనః’ అని శ్రుతి. ప్రజ్ఞానము ఎక్కువగా ఉన్నందున ప్రజ్ఞానఘనుడని శ్రుతి. గుణము ఎక్కువగా ఉన్నప్పుడు గుణి, గుణశబ్దముతోనే పిలువబడతాడు. ఉదా॥ అధిక తేజస్వి ‘తేజస్సు’ అని పిలువబడుట వ్యాకరణ మతమే. కావున సృష్టి, స్థితి, లయములు చేయునది, ప్రశస్తమైన అతిశయించిన వేదాంత జ్ఞానమును బోధచేయు గురురూపమే బ్రహ్మము. దీని భావము - త్రిమూర్తి ముఖములతో సృష్టి, స్థితి, లయములను చేయుచు అనంత వేదాంత జ్ఞానమును ఉపదేశించి గురు స్వరూపుడగు శ్రీదత్తభగవానుడే బ్రహ్మమని తేలినది.
గురువు ప్రజ్ఞాన శబ్దార్థ భావమగును
గుణ మహత్తచే పిలుతురు గుణము గుణిగ,
చేతనకు రూఢిగాదది చెప్పరటుల,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥21॥
తా॥ ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అని శ్రుతి. ప్రజ్ఞానము అనగా ప్రజ్ఞానము కలవాడు. గుణము ఎక్కువగా ఉన్నపుడు గుణ శబ్దముతోనే గుణిని పిలుస్తారు. ప్రజ్ఞానము అనగా ప్రశస్త వేదాంతజ్ఞానమే తప్ప కేవల చైతన్యము కాదు. ప్రజ్ఞానమును చైతన్యమని లోకంలో ఎవరూ పిలుచుట లేదు. కాన ప్రజ్ఞానియే ప్రజ్ఞాన శబ్దముతో పిలువబడును.
పిలుచు తన్వం శుకస్థుని పేరుతోడ,
లోహ పేటిస్థుని పిలువ లోహమగును
సర్వగతుడా తడును సిద్ధ సాధకులను
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥22॥
తా॥ పలుచని గుడ్డలోనున్న వ్యక్తిని వ్యక్తి పేరుతో పిలిచెదము. ఇనుపపెట్టెలో వ్యక్తి ఉన్నా కనపడడు, కాన పెట్టె పేరుతోనే పిలుస్తాము. ఇట్లు సిద్ధపురుషులందు భగవంతుడు ప్రకాశించును కాన వారిని భగవంతుని పేరుతోనే పిలుస్తారు. సామాన్య జీవులందునూ భగవంతుడున్నాడు. కాని వారి రాజస తామస గుణముల వలన కనిపించడు. కాన వారిని వారి వారి పేర్లతోనే పిలుస్తారు.
అధముడవతార పురుషుని అధికతఁగని
మోసగాడని నిందించి మురియుచుండు,
ఈర్ష్యతో పరతత్త్వంబు నెరుగలేక,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥23॥
తా॥ అవతార పురుషుని ఆధిక్యమును చూచి అధముడు ఆ దివ్యపురుషుని మోసగాడని నిందించి, తన తెలివికి తానే మురిసిపోవును. వాడు ఆ పరమాత్మ యొక్క తత్త్వమును ఈర్ష్యవలన తెలియజాలకున్నాడు.
పంచభూతాలు నా సొత్తు పశుధనంబు
జీవులందరు నా సొత్తు నీవు పశువు
పశుపతిని నేనె విష్ణువు బ్రహ్మ నేనె
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥24॥
తా॥ ఈ పంచభూతాలు ఈ జగత్తు అంతా నా సొత్తు. జీవులందరును నా పశుసంపద. నీవును అందులోని ఒక పశువు. నేనే పశుపతిని. నేనే విష్ణువు. నేనే బ్రహ్మము.
To be continued...
★ ★ ★ ★ ★