
Posted on 23 Jan 2026. Share
గుణము పూజ్యతా హేతువు కులముకాదు
రావణ ఖలుండు వధ్యుడే బ్రాహ్మణుండు,
రాముడ బ్రాహ్మణుండు నారాధ్యుడగును,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥25॥
తా॥ గుణము వలన పూజ కలుగును కాని కులము వలన కాదు. రావణుడు బ్రాహ్మణుడైనా దుర్గుణుడైనందున వధ్యుడైనాడు. రాముడు బ్రాహ్మణుడు కాకపోయినా, సద్గుణముల వలన ఆరాధ్యుడైనాడు.
రాముడన ధర్మము సుఖంబు రమయతి యన,
రావణుండ ధర్మము దుఃఖ రావకరము,
పండితులు శబ్దతత్త్వార్థ పరమ విదులు
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥26॥
తా॥ రాముడంటే మనిషి కాదు. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని రామాయణమే, రాముడంటే ధర్మమని చెప్పుతున్నది, ‘రమయతీతి రామః’ అంటే సుఖింప చేయువాడు రాముడు అనగా ధర్మము సుఖప్రదము. రావణుడు అధర్మము. రావణుడనగా కేకలను పెట్టించు వాడని అర్థము అనగా దుఃఖకరమగు అధర్మమని అర్థము. పండితులు శబ్దతాత్పర్య పరమార్థతత్త్వాన్ని తీసుకుంటారు. పామరులు దానిని వినోదకరమైన పాత్రల కథగా తీసుకుంటారు.
శక్తి వీచికాకృతి సర్ప సరణి శక్తి
కుండలిని యన చేతన కుటిల గమన,
చిత్త భూతాలు చక్రాలు చిత్ర ఫణితి
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥27॥
తా॥ శక్తి తరంగాకారంలో సర్పంలాగా కుటిలమార్గములో ప్రయాణిస్తుంది. అన్నజాతమైన చైతన్యశక్తియే కుండలిని. పంచభూతాలు మనస్సు కలసి ఆరు చక్రాలు. చక్రాలనగా ఆకర్షణలని, సుడి గుండాల వంటివని అర్థము. నరునిలోని చైతన్యము వాటిలో పడి భ్రమించక దాటవలెనని బొమ్మల రూపములో బోధించబడినది.
శివుడు జ్ఞానంబు బుద్ధిలో చేతనయును
కలియ ధారణ యగును చక్రాల దాటి,
తిక్కశంకరయ్యలు బొమ్మ తెలియరైరి
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥28॥
తా॥ ఇక బుద్ధి అనే సహస్రారంలో నున్న బ్రహ్మజ్ఞానమే శివుడు. చేతన అనగా కుండలిని. ఈ జ్ఞానముతో కలియుటయే ధారణా యోగము. చిత్త - భూత వస్తు ఆకర్షణలను దాటి జ్ఞానమునందు నిలుచుటయే యోగము. ఇదే చక్రాలను కుండలిని దాటి శివునిలో ఐక్యమగుట. దీని అంతరార్థమును తెలియని తిక్కశంకరయ్యలు నిజముగా సర్పరూప కుండలిని, చక్ర పద్మాలు ఉన్నవని బొమ్మల భ్రమలో పడతారు. సహస్రార మనగా అనేక నిశ్చయాలతో శాఖోప శాఖలుగా నున్న బుద్ధి.
గ్రంథములు వృథ లోక సంగ్రహము లేక
కవులకును పాఠకులకును కాలహరము,
బ్రహ్మ ధర్మ బోధల సాధు ఫలితములగు,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥29॥
తా॥ లోకాన్ని ధర్మములో నడిపించి, అధర్మము నుండి ముక్తి కావించి, బ్రహ్మమును బోధించే గ్రంథములు మంచివి, సార్థకములు. ఇది లేకున్నచో, అట్టి గ్రంథాలు, కవులకును, పాఠకులకును కాలాన్ని వృథా చేసేవి అగును.
విష్ణు శివ బ్రహ్మ పనులవి విశ్వమందు
కర్మ లేకుండ తత్త్వంబు కలుగనెట్లు?
అగ్ని యగునె కాల్చక స్తోత్ర మగ్నికరమె?
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥30॥
తా॥ ధర్మ రక్షణ విష్ణు కార్యము. అధర్మ ఖండనము రుద్ర కార్యము. జ్ఞానబోధ బ్రహ్మ కార్యము. ఈ మూడు పనులు చేసిననే త్రిమూర్తి స్వరూపసిద్ధి. కర్మవల్లనే వస్తు తత్త్వము సిద్ధించును. దారిన పోవువారి విషయము నాకెందుకని ఉపేక్షించరాదు. నీ దృష్టిలో అధర్మము జరుగుచున్నచో పరుల విషయమని ఉపేక్షించక, ధర్మ స్థాపనము, అధర్మ ఖండనము యథాశక్తి చేయాలి. పరులకు జ్ఞానబోధ ప్రచారము చేయాలి. కాల్చే కర్మ ఉన్ననే అగ్ని అగును తప్ప స్తుతి వలన అగ్ని అగునా? అనగా - లోక సంగ్రహములగు ఈ మూడు పనులను చేయకుండా, కేవలము స్తుతించినంత మాత్రమున దైవత్వము రాదు.
To be continued...
★ ★ ★ ★ ★