home
Shri Datta Swami

 Posted on 24 Jan 2026. Share

మరచిపోకుము దత్తుని మంచిమాట (Part-7)

ధర్మ రక్షణము, అధర్మ దండనములు
జ్ఞాన బోధ యథాశక్తి మానవలదు,
స్వామి సహకారమున స్వామి సంతసించు,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥31॥

తా॥ యథాశక్తిగా ధర్మ రక్షణ, అధర్మ ఖండనము, జ్ఞానబోధలను చేయుము. నా కెందుకని ఉపేక్షించకుము. ఈ మూడు స్వామి చేసే కార్యాలు. నీవునూ చేసినచో స్వామికి సహకరింతువు. దానిచేత స్వామి ఎంతయో సంతసించును. ఆ పనులు చేయుట చేత నీకు నిజముగా దైవత్వము వచ్చును.

మూడు పనులతో ఆచారమున గురువుకు
సమత సిద్ధించు వ్యర్థంబు సాధన లిక,
పొగడి కాకాలు పట్టిన పొంగు బోడు,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥32॥

తా॥ యథాశక్తిగా ధర్మరక్షణ, అధర్మ ఖండనము, జ్ఞానబోధ - ఈ మూడు పనులను ఆచరణమున కలవాడు గురుదత్తునితో సమానమగును. అన్య సాధనలన్నియు ఆచరణ హీనములు కాన వ్యర్థములు. స్తుతులచే పొగిడి కాకా పట్టినంత మాత్రాన పొంగిపోయే పిచ్చివాడా స్వామి?

స్వార్థ లక్ష్యంబు సిద్ధించ సడలిపోవు
లక్ష్య పరమాత్మ కరణంబు, లక్ష్యమైన
ప్రాప్తి పర్యంత మతడుండు పట్టుతోడ
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥33॥

తా॥ ఈనాటి మానవులకు కోరికలే లక్ష్యము. భగవంతుడు వాని సాధనలో పనిముట్టు. లక్ష్యము సిద్ధించగనే, భగవంతుడు, భగవంతునిపై భక్తి, సడలి పోవుచున్నవి. భగవంతుడే లక్ష్యమైనచో, ఆయనను చేరు వరకు భగవంతుడు, భక్తి సడలిపోరు.

పది తరాల కిచ్చినగాని భక్తుడడుగు,
మరల నిమ్మని పశు పక్షులరుగు తిన్న,
అడవికేగిరి మునులవి అధిక మనుచు,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥34॥

తా॥ పదితరాలకు సరిపడ సొత్తు నిచ్చిననూ, భక్తుడు మరల నిమ్మని వేడుచున్నాడు. పశు, పక్షులప్పటికి తిండి నిచ్చిన తృప్తిపడి వెడలి పోవుచున్నవి. కాన నరుల కన్న పశు, పక్షులే మేలని, నరులుండు ఊళ్ళని వదలి పశు, పక్షులుండు అడవులే మేలని, మునులు అడవుల నాశ్రయించినారు.

వరము లిచ్చిన పూజలు పెరుగుచుండు,
దిబ్బలో బడు పటము రాదేని వరము,
ముందు ఫలమున్న తుది పూజ మొక్కుబడులు
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥35॥

తా॥ పూజలకు వరములు లభించినచో ఆ పూజలు పెరుగుచుండును. వరములు లభించనిచో దేవుడి పటము దిబ్బలోకి పోవును. (కొందరు పటములను దేవాలయములందు విడచి వత్తురు.) అసలు ముందు పూజ చేసిన, వరము రానిచో, ఆ పూజ చేయుట వ్యర్థమగునన్న తలంపుతో ముందు వరముల నిచ్చినచో తరవాత పూజలను చేతుమని మొక్కుబడులను చేయుచున్నారు. ఎంత నీచావస్థ!

ప్రతి ఫలాపేక్షతో వచ్చు భక్తజనము,
భక్తి నమ్మి ప్రతిఫలము బడయువారు,
గుడి దుకాణాల పరమాత్మ విడిచిపోయె,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥36॥

తా॥ గుడికి వచ్చే భక్తులు ప్రతిఫలాన్ని ఆశించి, తమ భక్తిని అమ్ముకొని ప్రతిఫలాలను పొందుటకు వచ్చిన వారే. ఈ గుడి దుకాణములను అసహ్యముతో భగవంతుడు విడిచిపోయినాడు.

To be continued...

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via