
Posted on 25 Jan 2026. Share
ఆలయంబుల వ్యాపార మధికమయ్యె
యోగియే నిలువండట, యోగిరాజు
నిలుచునే అన్య దేశాల నిలుచుగాని,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥37॥
తా॥ దేవాలయములందు వ్యాపారము ఎక్కువైనది. అట్టి చోటులందు యోగియే నిలువజాలడు. ఇక యోగేశ్వరుడు నిలుచునా? అట్టి ఆలయాలను వదలి బయట సర్వత్రా నిలచియున్నాడు.
ప్రతిఫలాపేక్షతో సేయు భజనపూజ
కొంగ జపములు క్రతువులు దొంగ తపము,
ఫలరహిత భక్తి మేలిమి పసిడిబాట
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥38॥
తా॥ ప్రతిఫలాలను కోరి చేసే భజనలు, పూజలు, కొంగ జపములు, యజ్ఞాలు - దొంగతపస్సులు, వీరికి ఫలములపై ప్రేమయే తప్ప భగవంతుని పై కాదు. ఫలసాధనకు భగవంతుని ఉపయోగించు దొంగలు. ఎట్టి ఫలాపేక్షలేని నిష్కారణమైన సహజమైన భక్తియే మేలిమి బంగారపు బాటయగును.
సొత్తునిచ్చిన నిత్తురు సొమ్ములనిల
లంచగొండిగ పరునెంచి వంచకులును,
స్వామితత్త్వంబు తెలియని చవటలగుచు,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥39॥
తా॥ భగవంతుడిని లంచగొండిగా భావించి భగవంతునికి ఆభరణములను చేయించి ఐశ్వర్యము నిమ్మని భక్తులు కోరుచున్నారు. స్వార్థరహితమైన భక్తికి స్వామి వశుడగునను స్వామి తత్త్వమును తెలియక ఈ జీవులు చవట లగుచున్నారు.
స్వార్థ వేశ్యయును భజించు వగలుచూపి,
భక్తులందరు వేశ్యలే పలుక నిజము,
లేడు నిస్స్వార్థ దాసుండు పుడమి కలిని,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥40॥
తా॥ స్వార్థము నాశించి వేశ్యయును వగలుచూపి భజనచేయును. నిజము చెప్పవలెనన్న ఈ భక్తులందరును వేశ్యలే. స్వార్థరహితముగా స్వామికి సేవచేయువాడీ కలి యందు భూమిలో లేడు.
ప్రతిఫలాపేక్షతో సేయు భక్తి, కర్మ,
జ్ఞాన, యోగాలు హయములు చచ్చినవియె,
ప్రాణిఖరము నిస్స్వార్థంబు పనికివచ్చు
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥41॥
తా॥ ప్రతిఫలాన్ని కోరి చేసే భక్తి, యజ్ఞాదికర్మ, జ్ఞానచర్చ, యోగము మొదలగు ఉత్తమ మార్గములైననూ చచ్చిన గుర్రములవంటివి. పనికిరావు. (గుర్రము ఉత్తమమే) నిస్స్వార్థమైన ఏ పిచ్చిపనియైననూ బ్రతికినట్టి హీనమైన గాడిద వంటిది. అయిననూ భగవంతుని చేరు వాహనముగా పనికివచ్చును.
స్వార్థమే మోక్షకామంబు స్వల్పసుఖద-
వరములను మించి ఆనంద మరయునతడు,
దొంగలకును మించిన గజదొంగ యతడు,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥42॥
తా॥ మోక్షమును కోరుటయు స్వార్థమే. అది పెద్ద స్వార్థము. స్వల్పమైన ఐహిక సుఖములనిచ్చు వరములను వదలి శాశ్వతానందమును అతడు కోరుచున్నాడు. అతడు చిన్న దొంగలను మించిన గజదొంగ. కాన మోక్షమును కూడా కోరరాదు.
To be continued...
★ ★ ★ ★ ★