
Posted on 26 Jan 2026. Share
అష్టసిద్ధుల కీర్తిని ఆశపడుట
స్వామి పదవిని కోరుట సంతసంబె?
భక్తకోటుల దుఃఖాను భవము తెలియ,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥43॥
తా॥ అష్టసిద్ధులనూ, కీర్తిని ఆశించుట, స్వామి పదవిని కోరుటయే. ఆ పదవి ఆనందకరమని అనుకొనుచున్నాడు. కానీ, స్వామి నిత్యమూ భక్తకోటుల దుఃఖాల ననుభవించుచున్నాడు. ఈ స్వామి తత్త్వమును తెలిసినిచో స్వామి పదవిని కోరడు.
కష్టములు రాగా నరుడు నాకాలబడును,
కష్టములఁ దీయ పైచూపు కన్నులగును,
నరుల చరితంబు లతినీచ మరయభువిని,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥44॥
తా॥ కష్టములు రాగానే, నరుడు నా కాళ్ళ పైబడి వేడుకొనుచున్నాడు. ఆ కష్టములను తొలగించగనే, వెంటనే, వాని కండ్లు క్రింద చూడక అహంకారముతో పైన చూచుచుండును. ఈ భూమిపైన మానవుల చరిత్రలు పరిశీలించినచో అతి నీచముగనున్నవి.
నిత్యసుఖ నిత్యకష్టంబు నిజము వెగటు,
పచ్చడియు లడ్డు మార్పు సుభక్షణమగు,
వెగటును రుచిని తెలియని వెర్రివారు !
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥45॥
తా॥ ఎల్లప్పుడూ సుఖము, లేక, ఎల్లప్పుడూ కష్టమున్న వెగటు కలుగును. పచ్చడి, లడ్డు మార్చి మార్చి తిన్నచో అది చక్కని భోజనమగును. ఏది వెగటో, ఏది రుచియో కూడా తెలియని ఈ వెర్రిజీవులు నిత్యసుఖముకై నన్ను ప్రార్థింతురు.
కర్మచక్రము తిరుగు నా కరమునందు
కష్ట సుఖముల మార్పుతో కలిపియుంటి
బూంది లడ్డులవలె రుచి పూర్ణములగు
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥46॥
తా॥ నా చేతిలో కర్మచక్రము సదా భ్రమించుచుండును. జీవుని పాప, పుణ్యములను బూంది - లడ్డులవలె మార్చి మార్చి కలిపి, రుచి పూర్తిగ నుండునట్లు ఈ కర్మచక్రమును తయారుచేసియున్నాను.
వీని రక్షింపమని నీవు వేడుకొనుట
హాస్యమగు, వీడు ఈ జన్మనందు తెలియు
నీకు, నాకు సృష్ట్యాదిగా నేస్తమితడు,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥47॥
తా॥ ఒక జీవుని నాకు చూపించి మరొక జీవుడు రక్షింపమని వేడుకొనుట హాస్యకరము. ఏలనన, ఈ ఇద్దరి జీవులకు ఈ జన్మలోనే సంబంధము. నాకు సృష్టి జరిగిన నుండి జీవులందరును ఆత్మీయులు.
జీవపశు సంపదనుగల దైవమతడు
విశ్వగృహ భర్త యజమాని విదితమగును,
వాని ఇచ్ఛయే ధర్మంబు అనుసరింప,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥48॥
తా॥ జీవులందరును దైవము యొక్క పశుసంపద. దేవుడే ఈ సృష్టి అను గృహ యజమాని. వాని ఇచ్ఛయే ధర్మశాస్త్రముగా తెలియుచున్నది. అట్టి ధర్మశాస్త్రము ననుసరించవలయునే తప్ప దైవాధీనుడైన జీవునకు స్వాతంత్ర్యము లేదు. అనగా ఒక పశువు ఎట్లు యజమాని ఇచ్ఛలో నుండునో జీవులందరును పశుపతియగు సర్వేశ్వరుని ఇచ్ఛారూపమైన ధర్మశాస్త్రము ననుసరించి ఉండవలయునే తప్ప స్వతంత్రించరాదు.
To be continued...
★ ★ ★ ★ ★