home
Shri Datta Swami

 Posted on 27 Dec 2024. Share

జీవుని అహంకారము - స్వామి బోధ

[22-01-2003]

చేసేది సాయి పాడేది సాయి -
చెప్పేది సాయి ఓరన్నా!
గుణములు సాయివి దోషాలు నావి -
కీర్తి సాయిది ఓరన్నా!
ద్వారకమాయికి బయటనున్నట్టి -
శునకము నేనే ఓరన్నా!
శిరిడినాథుని పదధూళి మహిమ -
గురువుగ పుట్టితి ఓరన్నా!
పూర్వజన్మమున సాయి పూజలను -
చూసితి కోరితి ఓరన్నా!
గురుపీఠ మెక్క కరుణామయుడట -
సాయి దీర్చినది ఓరన్నా!

అహంకారముతో ఉన్న జీవులకు ప్రభువు బోధ చేయతలచినప్పుడు తన యదార్థస్థితిని దాచి అధముడైన పాత్రలో ప్రవేశించి చండాలాది వేషములలో అధమునిగా నటించుచు ఆ అహంకారి వద్దకు స్వామి చేరును. అహంకారి వద్ద స్వామి తన నిజస్థితిని ప్రకటించుకున్నచో అతడు అంగీకరించక స్వామిని దూషించుచూ స్వామి చెప్పు బోధలను వినడు. అప్పుడు సాధనలో మొదటి అవస్థ యగు శ్రవణమే లేకుండా పోవును. కావున అహంకారియగు జీవునకు శ్రవణము కలిగించుటకై స్వామి వినయముతో అధమునిగా వచ్చును. అహంకారమునకు ఆకర్షణను కలిగించునది వినయము. అహంకారమునకు అహంకారము వికర్షణ కల్గించి దూరముగా పోవును. కావున ముందు వాని అహంకారమును ఉపశమింప చేసిన కాని వాడు శ్రవణమునకు అవకాశము నీయడు. ముందు లంకిణిని లొంగదీసిన గాని లంకాప్రవేశము జరుగదు. కావుననే అహంకారియైన బలి వద్దకు స్వామి అమిత దుర్బలుడగు పసిబాలునిగా అనగా అధమునిగా వామనుడై వచ్చినాడు. కావున గురుస్వరూపుడగు దత్తుడు ఎప్పుడును వినయముతో తన్ను తాను అధమస్థితిలో నుంచుకొనును, ఏలననగా జీవులందరు అహంకారులే. కుక్కతోకకు వంకరతనము ఎట్లు స్వభావగుణమో జీవునకు అహంకారము అట్లు స్వభావగుణము. ఎంత జ్ఞానియైనను జీవునకు ఏదో ఒక సమయములో అహంకారము ప్రవేశించును. వాని అహంకారము అణగి ఉన్నప్పుడు స్వామి తన స్వరూపమును ప్రకటించును. వానిలో అహంకారము లేచినప్పుడు స్వామి మరల దాసుడిగా అధముడిగా ప్రకటించుకొనుచు వానిలోని అహంకారమును శాంతింప చేయును.

శంకరులు "అహం బ్రహ్మాస్మి" అన్నారు. వెంటనే శిష్యులు కూడా "అహం బ్రహ్మాస్మి" అన్నారు. మరి కొందరు ఎక్కువ అహంకారము కలవారు "అహం పరబ్రహ్మాస్మి" అన్నారు. మరికొందరు ఇంకనూ అహంకారము కలవారు "అహం పరాత్పర బ్రహ్మాస్మి" అన్నారు. అనగా శంకరులు నేను బ్రహ్మము అనగా కొందరు శిష్యులు నేను బ్రహ్మమునే అనియు, మరి కొందరు శిష్యులు నేను బ్రహ్మము కన్న అధికమైన పరబ్రహ్మము అనియు, నేను పరబ్రహ్మము కన్న ఇంకా అధికమగు పరాత్పరబ్రహ్మమనియు అన్నారు. కావున బ్రహ్మమగు శంకరులు చెప్పు వాక్యములను ఎవడును గ్రహించలేదు. ఆ బ్రహ్మము చెప్పు వాక్యములను బ్రహ్మమగు నేను ఏల వినవలయును అను అహంకారము ప్రవేశించినది. మీరు బ్రహ్మము గాదు జీవులే అని స్వామి అన్నచో నీవును జీవుడవే. జీవుడు చెప్పు మాటలను జీవుడు విననేల? అని శిష్యులు భావింతురు.

Swami

ఒక టోపీలు అమ్ముకొను వాడు నిద్రించుచుండగా వాని టోపీలను కోతులు ఎత్తుకొని పోయి చెట్లు ఎక్కి టోపీలను తలపై ధరించినవి. అవి టోపీలను ధరించుటకు కారణము ఆ వర్తకుడు టోపీను నెత్తిన ధరించుటయే. ఆ వర్తకుడు లేచి ఎంత ప్రాధేయపడినను, ఎంత బోధించినను అవి ఇకిలించినవే కాని తలలపై టోపీలను తీయలేదు. కారణము బోధించువాడు తలపై టోపీని ధరించి యుండగా కోతుల వంటి శిష్యులు వారి టోపీలను తీయరు. అప్పుడా వర్తకుడు తన టోపీని తీసి క్రింద పారవేయగా, ఆ కోతులును టోపీలను క్రింద పారవేసినవి. కావున శంకరులు ఉన్నంత కాలము శిష్యులు అద్వైతమతమునే అవలంబించి ఆయన బ్రహ్మము అన్నారు కావున మేము కూడా బ్రహ్మమే యని శిష్యులు అన్నారు. జీవులకు అహంకారము స్వభావము, అసూయ స్వరూపము.

కావున శంకరులు రామానుజులుగా అవతరించి తాను స్వామికి భక్తుడను అని అన్నారు. భక్తిని గుర్తించి బోధించినప్పుడు స్వామి భక్తుడి గానే అవతరించవలయును. అప్పుడు శిష్యులందరును "మేము స్వామి భక్తులమే" అన్నారు. అప్పుడు రామానుజులు "ఓ జీవులారా! మీరు భక్తులైనంత మాత్రమున చాలదు. స్వామి కార్యములో పాల్గొని సేవకులు కావలయును. నిజమైన భక్తియే సేవయని బోధించినారు. కాని జీవులు రామానుజులు ఎట్లు విష్ణువు అంశయో తాము కూడా విష్ణువు యొక్క అంశయే అని భావించినారు. జగత్తు స్వామి యొక్క శరీరము. ఈ శరీరములో ఒక భాగము జీవుడు. కావున మేము కూడా స్వామిలో భాగములను మహాగ్ని నుండి వచ్చిన నిప్పురవ్వలమే అన్నారు భక్తులు. అప్పుడు రామానుజులు మధ్వాచార్యునిగా అవతరించినారు. స్వామి దాసుడగు హనుమంతుని తనకు స్వామిగా చేసుకొని నేను దాసానుదాసుడను అని అన్నారు. జగత్తు స్వామి యొక్క శరీరము కాదు. స్వామి కన్న విడిగా యున్న పదార్థము అని బోధించినారు. అప్పుడు జీవులు కూడా స్వామి యొక్క దాసానుదాసులమని భావించిరి. కావున "యథా రాజా తథా ప్రజా" "యథా గురు స్తథా శిష్యః" అను సిద్ధాంతమును అనుసరించియే స్వామి కూడా దత్తునిగా కాకుండా భక్తునిగానే ప్రవర్తించు చుండును.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via