
16 Nov 2025
గమనిక: ఈ భగవత్ సందేశం పండితులు మరియు మేధావుల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.
Updated with Part-2 on 17 Nov 2025
Part-1
[25.11.2002] అవతారమునందు మూడు తత్వములుండును. మొదటిది పంచభూతములతో నిర్మింపబడి, ఆకారము కలిగిన ద్రవ్యమైన దేహము. ఇదే విష్ణుతత్త్వము. అందుకే విష్ణువును ఆకారముగా పూజించుచున్నారు. ఇక రెండవది శుద్ధ చైతన్యమైన జీవుడు. ఈ జీవుడు శరీరమంతా వ్యాపించి యుండుట వలన ఆత్మయన బడుచున్నాడు. "అతతి ఇతి ఆత్మా” – అనగా వ్యాపించునది ఆత్మ అని అర్థము. ఆ చైతన్యము శక్తిస్వరూపమును సూచించును. శక్తి తరంగములుగా ప్రసరించునని నేటి విజ్ఞానశాస్త్రము నిరూపించినది. ఈ తరంగరూపమే శివలింగ స్వరూపము. ఈ రెండవది యైన చైతన్య తత్త్వమును శివుడు సూచించుచున్నాడు. ద్రవ్యశక్తియే విష్ణువు, శివుడు. ఆ రెండును కలిసినప్పుడే శివకేశవ తత్త్వమైన ప్రాణి ఈ జగత్తులో సృష్టించబడినది. కావున మానవులందరును శివకేశవ తత్వమును సూచించుచున్నారు. నవీన విజ్ఞాన శాస్త్రవేత్తలలో రాజు వలె కొనియాడబడు 'ఐన్‌స్టీన్' అను విజ్ఞానవేత్త శక్తి ద్రవ్యముగను, ద్రవ్యము శక్తిగను మారుచు రూపాంతరము చెందుచున్నదను సిద్ధాంతమును నిరూపించినాడు. ఇదే “శివాయ విష్ణు రూపాయ” యని శివుడు విష్ణు రూపుడనియు, విష్ణువు శివరూపుడనియు మన ప్రాచీన వైజ్ఞానికులగు ఋషులు ఏనాడో చెప్పియున్నారు. ఐతే శక్తి సత్యమా? ద్రవ్యము సత్యమా? సత్యము ఎప్పుడును తన స్వరూపముననే యుండును. ఒక అసత్యము మరియొక అసత్యముగా రూపాంతరము చెందవచ్చును. కాని సత్యము యొక్క రూపము ఎప్పుడును మారదు. ఉదాహరణకు మనకు నేలపై ఒక త్రాడు పడియున్నది. తాడును మనము పట్టపగలు చూచినాము. దాని ముందు ఎంతసేపు నిలచినను, తాడు తాడుగనే కనపడును. తాడు పాము కాదు, మరియు కర్రయును కాదు. అదే తాడును మసక చీకటిలో చూచినాము. ఆ తాడు కొంతసేపు పాముగను, మరికొంత సేపు కర్రగను కనపడుచుండును. ఏక్షణములోను తాడు కనపడుటలేదు. చూడగానే ముందు పాము కనిపించినది. ఆ తర్వాత ఆ పాము కర్రగా తోచినది. ఇట్లు పాము, కర్ర రెండునూ రూపాంతరము చెందుచు మారి, మారి కనపడుచున్నవి. పాము అసత్యము. కర్ర అసత్యము. కావుననే ఈ రెండునూ రూపాంతరములు చెందుచున్నవి. అనగా ఒక అసత్యము మరియొక అసత్యముగా రూపాంతరము చెందును. లైటును వెలిగించి తాడును చూడగనే ఆ తాడు పాముగా గాని, కర్రగా గాని కనపడదు. అనగా సత్యము రూపాంతరము చెందదు అని తాత్పర్యము. కావున సత్యము ఎప్పటికి అసత్యముగ కనిపించదు. సత్యమందు అసత్యమును ఆరోపణము చేయలేము. ఒక అసత్యము నందు మరియొక అసత్యమును ఆరోపణము చేయవచ్చును. ఐతే పాము, కర్ర అను ఈ రెండు అసత్యములకు సత్యమైన తాడు అధారముగ యున్నది.

కావున సత్యమైన బ్రహ్మము అసత్యమైన జగత్తుగా గోచరించుటకు వీలులేదు. కాని అసత్యమైన జగత్తుకు సత్యమైన బ్రహ్మము ఆధారముగా యున్నది. మరి సత్యమైన బ్రహ్మము అసత్యమైన జగత్తుగా గోచరించని యెడల అసత్య జగత్తు మనకు ఎట్లు గోచరించుచున్నది? కావున ఈ అసత్యమైన జగత్తు సత్యమై యుండి తీరవలెను. జగత్తు అసత్యమని శంకరులు, జగత్తు సత్యమని రామానుజ, మధ్వులు ఘోషించుచున్నారు. ఆ రెండు వాదములకును శ్రుతులు ఉన్నవి. "తతో వై సదజాయత" అను శ్రుతి ఈ జగత్తు సత్యమని చెప్పుచున్నది. "నేహ నానాస్తి కించన" అను శ్రుతి ఈ జగత్తు అసత్యమని చెప్పుచున్నది. అనగా ఈ శ్రుతుల సమన్వయమే అసలు సిద్ధాంతము. ఈ జగత్తు ఉన్నది అని చెప్పవచ్చును, లేదు అనియూ చెప్పవచ్చును. ఇది ఎట్లు? అత్యల్పమైన దానిని అభావముగ చెప్పు వ్యాకరణశాస్త్ర సంప్రదాయమున్నది. "అనుదరా కన్యా" అనగా ఈ పిల్లకు పొట్టలేదు అని అర్థము. దీని అర్థము పిల్లకు అసలు పొట్ట లేక నడుము నుండి పైన ఒక ఖండము, నడుము నుండి క్రింది భాగము మరియొక ఖండముగా యున్నదని కాదు. నడుము చాలాచాలా సన్నమని అర్థము.
Part-2
"బ్రహ్మ పుచ్ఛం" అను శ్రుతి ప్రకారముగా, ఎండకు ఆధారమైన సూర్యగోళము వలె మహాశక్తికి ఆధారమైన బ్రహ్మము ఉన్నది. ఆ బ్రహ్మము యొక్క మహాశక్తి నుండి కోటానుకోట్ల కిరణములు వెలువడుచున్నవి. ఆ కిరణములలో ఒక కిరణము జగత్తుగా పరిణమించినది. ఇదే "పాదోఽస్య విశ్వా భూతాని" అను శ్రుతికి అర్థము. ఇక్కడ కిరణము జగత్తుగా గోచరించినదని అర్థమా? లేక జగత్తుగా పరిణమించినదని అర్థమా? జగత్తుగా పరిణమించనిచో జగత్తు, కుందేటికొమ్ము వలె పరిపూర్ణ అసత్యమగును. ఆట్టి అసత్యము గోచరించదు. కుందేటికొమ్ము ఎవ్వరికిని కనిపించదు. గోచరించనిచో బ్రహ్మమునకు వినోదము ఎట్లు వచ్చును? కుందేటితలపై కొమ్ము ఎంత చక్కగా వున్నది అని వినోదించువాడు కలడా? వినోదమునకు జగత్తును సృష్టించెనని "ఏకాకీ న రమతే" అను శ్రుతి చెప్పుచున్నది. మరియు ఆ జగత్తును చూచి వినోదించుచున్నాడని "సాక్షీ చేతా" అను శ్రుతి చెప్పుచున్నది. సృష్టి పరిపూర్ణ అసత్యమైనచో సృష్టించుటయను క్రియ అసత్యమగును. అప్పుడు "సర్వమిదమ్ అసృజత" అను శ్రుతి ద్వారా ఆయన ఈ జగత్తును సృష్టించెను అని చెప్పుట అసత్యమే అగును. సరే! జగత్తు సత్యమని నిర్ణయించెదము గాక! జగత్తు సత్యమే యైనచో అనగా పరిణామవాదమును అంగీకరించినచో "ఏకమేవాఽద్వితీయం బ్రహ్మ", "నేహ నానాస్తి" అను శ్రుతులు బ్రహ్మమొక్కటే సత్యము, రెండవ సత్యము లేదని చెప్పుచున్నవి. శంకరులు జగత్తు సత్యము కాదు, కాని గోచరించుచున్నది అని అన్నారు. జగత్తు గోచరించుచున్నది గాన సత్యమని అన్నారు రామానుజ, మధ్వులు.
శంకరమతము ఆభాసవాదము (apparent modification). రామానుజ, మధ్వుల మతము పరిణామవాదము (real modification). ఈ నమన్వయము కుదరక పండితులు వాదించుకొని, వాదించుకొని తేల్చుకొనలేక నీవు శుంఠవంటే నీవు శుంఠవని అని విడిపోవుచున్నారు. ఈ శిష్యులు నిజముగా శుంఠలే ఏలయనగా శంకర, రామానుజ, మధ్వుల హృదయమును తెలుసుకొనలేకున్నారు. శంకరులు చెప్పిన దానిని అపార్థము చేసుకొనిన శిష్యులను రామానుజులు దిద్దినారే తప్ప శంకరులను ఎప్పుడు తప్పు పట్టలేదు. రామానుజుడు శంకర హృదయమును విప్పిచెప్పినాడు. రామానుజులు చెప్పిన దానిని మరల అపార్థము చేసుకొనినందున మధ్వులు, రామానుజ హృదయమును విప్పిచెప్పినారు. మధ్వులను అపార్థము చేసుకొన్న పండితులకు ఎన్నిసార్లు చెప్పినను ఇక మీరు మారరని సరిదిద్దుటకు నాల్గవ ఆచార్య రూపము రాలేదు. ఏ దత్తుడు ఆచార్యత్రయ రూపములో వచ్చినాడో ఆ దత్తుడే చిట్టచివరి సారిగా సమస్వయమతమును బోధించుచున్నాడు. రామానుజులు తన భాష్యమున శంకరులు చెప్పినది తప్పు అని ఎక్కడను వ్రాయలేదు. "యదుచ్యతే శాంకరైః" అని వ్రాసినాడు. అనగా శంకర శిష్యులు చెప్పుచున్నది సరికాదు అనియే అర్థము. శంకరులు జగత్తును పూర్ణఅసత్యమని ఎచ్చటను చెప్పలేదు. జగత్తును ‘మిథ్యా’ అన్నారు. మిథ్యా శబ్దమునకు నిర్వచనము "సదసద్ విలక్షణా మిథ్యా” అని శంకరులే అన్నారు. అనగా ఇది సత్యమని చెప్పుటకు వీలు లేదు అలా అని అసత్యమని చెప్పుటకు వీలు లేదు అని అర్థము.
నీవు ఒక ఇంటికి వెళ్ళి "నేను వచ్చితిని" అని అన్నావు ఇది సత్యమే. కాని నీ చొక్కాపై పరిశీలించిన గాని కనిపించనంత సూక్షమైన ఒక చీమ ఉన్నది. అది అత్యల్పము కాన దానిని లేనట్లుగానే పరగణించి నేను ఒక్కడనే వచ్చినాను అని చెప్పుచున్నావు. కావున చీమ లేనట్లే కదా. కాని నీలగదీసి (after analysis) పరిశీలించినచో రెండవ ప్రాణియగు చీమ కూడా ఉన్నది. కావున ఇరువురము వచ్చినాము అనియే చెప్పవలెను. మరి చీమ సత్యమే కదా. ఇదే శంకరుల హృదయము. ఈ హృదయమును గ్రహించక అద్వైతులు ఒక పక్షమునే గ్రహించి జగత్తు అసత్యమనుట అజ్ఞానమే. భగవంతుని దృష్టిలో ఈ చీమ మాత్రమైన జగత్తులో దానిలోని అతి చిన్న చీమయే జీవుడు. అనగా చీమ వంటి జగత్తును ఒక పర్వతముగా ఊహించగా ఆ పర్వతములోని పరమాణువులే జీవుడు అని తెలిసినచో పరమాణు పర్వతము అసత్యమనునట్లుండును. పరమాత్మలో ఈ జగత్తు అను పర్వతము ఒక పరమాణువై యున్నది. ఈ పర్వతములో మరల అతి చిన్న పరమాణువు జీవుడు. కావున జీవుని దృష్టిలో జగత్తు మహాసత్యము. పరమాత్మ దృష్టిలో జగత్తు అత్యల్ప సత్యము అనగా అసత్యము. కావున శంకరులు పరమాత్మ-జీవుల దృష్టులను రెండింటిని పరిగణనలో యుంచుకొని అసత్యము, సత్యము అనెడి రెండు దృష్టులను ఒకే దృష్టి చేసినచో దానిని అసత్యమనలేము, సత్యమని కూడా అనలేము కావున మిథ్యా అన్నారు. అసత్యదృష్టిని తీసుకున్న శంకరుల శిష్యులను ఖండించుచు రామానుజులు జగత్తు సత్యమను దృష్టిని ప్రతిపాదించారు. అనగా రామానుజులకు అత్యల్ప సత్యమును అసత్యముగా పరిగణించెడి దృష్టి లేక కాదు. ఎదుటివాడు ఒక దృష్టినే తీసికొని వాదించుచున్నప్పుడు సిద్ధాంతమును స్థాపించువాడు రెండవదృష్టిని స్థాపించవలెను. ఇది శాస్త్రవాద సంప్రదాయము.
★ ★ ★ ★ ★